gangadevipalli
-
వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, వరంగల్: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ముగ్గురు యువకులు మృతి చెందిన ఘటన గురువారం రాత్రి గంగాదేవిపల్లి సమీపంలో సంభవించింది. పోలీసుల వివరాల ప్రకారం.. చనిపోయిన యువకులు గంగాదేవిపల్లికి చెందిన ఇట్ల జగదీష్(19), న్యాల నవీన్(20), జనగామ జిల్లా నర్మెట్ట మాన్సింగ్ తండాకు చెందిన లకావత్ గణేష్(21)గా గుర్తించారు. ముగ్గురు ద్విచక్ర వాహనంపై వరంగల్ నుంచి గంగాదేవిపల్లికి వెళ్తుండగా.. వెనక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కోట్టడంతో అక్కడిక్కడే ప్రాణాలు వదిలిన ఘటన స్థానికులను కలిచివేసింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఒకే గ్రామానికి చెందిన జగదీష్, న్యాల నవీన్‌ల మృతితో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. -
నెరవేరని సీఎం హామీ..!
-
వడదెబ్బకు వృద్ధుడి బలి
గోరంట్ల (సోమందేపల్లి) : గోరంట్ల మండలం గంగాదేవిపల్లిలో వడదెబ్బకు గురై నాగప్ప(65) మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. బుధవారం పొలంలో పనులు చూసుకుని రాత్రికి ఇంటికి రాగానే తీవ్ర అస్వస్థతకు గురైనట్లు వివరించారు. గురువారం ఉదయమే ఇంటిలో నిద్రలోనే ప్రాణాలు వదిలినట్లు వారు కన్నీరుమున్నీరయ్యారు. -
పన్నుల వసూళ్లలో టాప్
►గీసుకొండ మండలంలో 86 శాతం వసూలు ►ఎనిమిది పంచాయతీల్లో వంద శాతం పూర్తి ►ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ ఇక్కడే ఎక్కువ.. గీసుకొండ(పరకాల) : ఇంటి పన్నుల వసూళ్ల విషయంలో జిల్లాలో గీసుకొండ మండలం మొదటి స్థానంలో నిలిచింది. మార్చి 6వ తేదీ నాటికి మండలంలో 86 శాతం ఇంటిపన్నులు వసూలయ్యాయి. జిల్లాలో గీసుకొండ మండలం తర్వాత నర్సంపేట, నల్లబెల్లి మండలాలు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. అయితే జిల్లాలో 15 మండలాలు ఉండగా మిగతా మండలాలకు అందనంత ఎక్కువగా ఇక్కడ పన్నులు వసూలు కావడం, ఉమ్మడి వరంగల్ జిల్లా వారీగా చూసినా ఎక్కువ శాతం ఇంటిపన్నులు వసూలు ఇక్కడే కావడం విశేషం. ముందు చూపే కారణం.. మండలం ఇంటి పన్నుల వసూళ్ల విషయంలో ముందు నిలవడానికి ఈఓపీఆర్డీ, పంచాయతీ కార్యదర్శులు ముందు చూపు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. మమూలుగా అయితే నవంబర్, డిసెంబర్ నెలలో పంటలు చేతికి వచ్చే సీజన్లో ఇంటి పన్నులు వసూలు చేస్తుంటారు. అలా కాకుండా మండలంలో ఆగస్టు నుంచే వసూలు చేయడం, బకాయిలు పేరుకుపోయిన గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించారు. అంతే కాకుండా పన్ను వసూలు చేయడానికి వెళ్లే ముందు గ్రామంలోని తాగునీరు, పారిశుధ్యం, వీధి దీపాల వంటి సమస్యలను పరిష్కరించడం, లేదంటే ప్రజలు చెప్పిన వెంటనే వాటిని ఏర్పాటు చేయడం చేశారు. దీంతో ప్రజలు పన్నులు చెల్లించడానికి ముందుకు వచ్చారు. అంతేకాకుండా ఈఓపీఆర్డీ చొరవ మేరకు పంచాయతీ కార్యదర్శులు, కారోబార్లు, వాటర్‌మెన్, స్వీపర్లు, సాక్షరభారత్ కోఆర్డినేటర్లు ప్రత్యేక బృందంగా ఏర్పడ్డారు. ప్రతీ రోజు ఓ గ్రామానికి వెళ్లడంతో మెరుగైన ఫలితాలొచ్చాయి. గంగదేవిపల్లి ఆదర్శం.. జాతీయ ఆదర్శ గ్రామం గంగదేవిపల్లి గ్రామపంచాయతీగా ఏర్పాటైన 1995 నుంచి నేటి వరకు ఇంటి పన్నులు వందశాతం వసూలు అవుతుండటం రాష్ట్రంలోనే రికార్డుగా చెబుతున్నారు. ఆ గ్రామ స్పూర్తితో మరియపురం, ఆరెపల్లి, అనంతారం, చంద్రయ్యపల్లి, కోనాయిమాకుల, బొడ్డుచింతలపెల్లి, నందనాయక్‌తండా గ్రామాల్లోనూ వంద శాతం పన్నులను ప్రజలు చెల్లించారు. 31వ తేదీ లోపు వసూళ్లు.. వరంగల్ రూరల్ జిల్లాలో ఈనెల 31వ తేదీ లోపు ఇంటి పన్నులను వసూలు చేయాలని కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్, డీపీఓ పిండి కుమారస్వామి సిబ్బందిని ఆదేశించారు. తరచూ పంచాయతీ కార్యదర్శులు, ఈఓపీఆర్డీలతో సమీక్షా సమావేశాలు నిర్వహించి పన్ను వసూళ్లలో వేగం పెంచాలని ఆదేశిస్తున్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహించిన శాయంపేట మండలంలోని ఇద్దరు పంచాయతీ కార్యదర్శులను కలెక్టర్ ఈనెల 14న సస్పెండ్ చేశారు. దీంతో పన్నుల వసూళ్ల విషయంలో పంచాయతీ కార్యదర్శులపై ఒత్తిడి పెరిగింది. -
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
తాడిపత్రి రూరల్ : తాడిపత్రి మండలం గంగాదేవిపల్లికి చెందిన సంజప్ప(42) అనే వ్యక్తి అప్పుల బాధ తాళలేక గురువారం గ్రామ సమీపంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి. సంజప్ప అంత్రాలు వేస్తు జీవనం సాగిస్తున్నాడు. చెడు వ్యసనాలకు లోనై అప్పులు చేశాడు. అప్పుల బాధ అధికం కావడంతో మనస్థాపానికి గురై గురువారం ఉదయం గ్రామ సమీపంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య మంజుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ పోలీసులు తెలిపారు. -
నేడు గంగదేవిపల్లికి కేంద్ర బృందం
వరంగల్: వరంగల్ రూరల్ జిల్లాలోని గంగదేవిపల్లిలో కేంద్ర, రాష్ట్ర ఐఏఎస్ అధికారుల బృందం శనివారం పర్యటించనుంది. ఇప్పటికే గ్రామం సాధించిన అభివృద్ధిని క్షుణ్ణంగా పరిశీలించి భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాల గురించి ప్రజలను, గ్రామ సర్పంచ్ తదితరులను అడిగి తెలుసుకోనున్నది. పారిశుధ్యం పట్ల గ్రామ కమిటీ, గ్రామ ప్రజల విజయాన్ని, వారిలోని చైతన్యాన్ని తెలుసుకోనున్నది. అనంతరం ఈ బృందం వ్యక్తిగత మరుగుదొడ్లపై పూర్తి సర్వే చేసి ప్రధానికి నివేదిక అందజేస్తుంది. -
ఇక వైఫై గంగదేవిపల్లి
ఇప్పటికే ఏడు చోట్ల ఆంటెన్నాల ఏర్పాటు {పతీ ఆంటెన్నాకు 200 మీటర్ల పరిధిలో ఇంటర్నెట్ సిగ్నల్ త్వరలో ప్రారంభం కానున్న సేవలు రాష్ట్రంలో ఉచిత ఇంటర్నెట్ పొందనున్న తొలి గ్రామంగా గుర్తింపు గీసుకొండ : జాతీయ ఆదర్శ గ్రామమైన వరంగల్ రూరల్ జిల్లాలోని గంగదేవిపల్లికి మరో గుర్తింపు లభించనుంది. తెలంగాణ రాష్ట్రంలోనే ఉచిత ఇంటర్నెట్ సేవలు అందుకోనున్న మొదటి గ్రామంగా త్వరలోనే పేరు నమోదు కానుంది. ఈ మేరకు ఇప్పటికే గ్రామంలో ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నారుు. ఇంకా మిగిలిపోరుున చిన్నచిన్న పనులు పూర్తికాగానే రాష్ట్ర మంత్రులు గంగదేవిపల్లిలో ఇంటర్నెట్ వైఫై సేవలను ప్రారంభించనున్నారు. ‘స్వేచ్ఛ’గా.. ఎన్నో అంశాల్లో ప్రత్యేకతలు గీసుకొండ మండలంలోని గంగదేవిపల్లి సొంతం. గతంలో సీఎం కేసీఆర్ సందర్శించి గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించి అభివృద్ధి పనుల కోసం రూ.10 కోట్లను మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఇక గీసుకొండ పోలీసుల సౌజన్యంతో ఉచితంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. గంగదేవిపల్లిలో జరిగిన అభివృద్ధి పనులను పరిశీలించేందుకు పలు ఖండాల్లోని 86 దేశాల వారు సందర్శించారు. అలాగే, దేశంలోని వివిధ రాష్ట్రాలు, జిల్లాల వారు సందర్శనకు వస్తుండడంతో సందర్శకుల తాకిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో దేశ, విదేశాల నుంచి వచ్చే వారే కాకుండా స్థానికుల సౌకర్యం కోసం ఇక్కడ ఉచిత ఇంటర్నెట్ వైఫై సేవలందించేందుకు హైదరాబాద్‌కు చెందిన ‘స్వేచ్ఛ’ స్వచ్చంద సంస్థ బాధ్యులు ముందుకొచ్చారు. ఇందులో భాగంగా గ్రామపంచాయతీ సహకారంతో ఇంటర్నెట్ సదుపాయం కల్పించేందుకు గ్రామంలో ఏడు చోట్ల ఆంటెన్నా లు ఏర్పాటు చేశారు. ప్రతీ ఆంటెన్నా ద్వారా 200 మీటర్ల వరకు ఇంటర్నెట్ వైఫై సేవలను గ్రామస్తులకు ఉచితంగా అందనున్నారుు. స్మార్ట్ఫోన్లు కలిగిన గ్రామస్తులు ఇంటర్నెట్ సదుపాయాన్ని అన్‌లిమిటెడ్‌గా వినియోగించుకోవచ్చు. మిగిలిపోరుున చిన్నచిన్న పనులు పూర్తికాగానే గంగదేవిపల్లిలో వైఫై ఇంటర్నెట్ సేవలను రాష్ట్ర మంత్రుల ద్వారా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా, సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన ఎరవెల్లిలో రిలయన్స కంపెనీ వారు గ్రామస్తులకు ఉచితంగా ఇంటర్నెట్ సేవలు అందించడానికి ముందుకొచ్చారు. అరుుతే, అందుకు సంబంధించిన పనులు ఇంకా కొనసాగుతున్నారుు. ఆలోపే గంగదేవిపల్లికి ఉచిత ఇంటర్నెట్ సేవలు ప్రారంభం కానున్నందున రాష్ట్రంలోనే తొలిసారి ఉచిత ఇంటర్నెట్ సౌకర్యం అందుకున్న గ్రామంగా గుర్తింపు లభించనుంది. -
పెళ్లి కోసం ప్రియురాలి పోరాటం
ప్రియుడి ఇంటి ముందు ఆందోళన బాధితురాలిది నల్లగొండ జిల్లా రెడ్డిగూడెం తాడిపత్రి రూరల్(అనంతపురం) : తెలంగాణ యువతి పెళ్లి కోసం తను ప్రేమించిన ఆంధ్రప్రదేశ్ యువకుడి ఇంటి వద్ద ఆందోళనకు దిగింది. వివరాల్లోకెళితే.. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం గంగాదేవిపల్లికి చెందిన చంద్రకాంత్‌రెడ్డి బీటెక్ చదివాడు. ఆరేళ్ల క్రితం హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగంలో చేరాడు. ఆ సమయంలో అదనపు కోర్సు కోసం శిక్షణ కేంద్రానికి వెళ్లాడు. ఎంబీఏ చదివిన నల్లగొండ జిల్లా రెడ్డిగూడెంకు చెందిన చైతన్య అనే యువతి కూడా అదే కేంద్రంలో శిక్షణ తీసుకుంటోంది. అలా ఏర్పడిన వీరి పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. మూడు నెలల నుంచి చంద్రకాంత్‌రెడ్డి చైతన్యతో మాట్లాడటం మానేశాడు. కనిపించకుండా తిరుగుతున్నాడు. ఆఖరికి ఫోన్‌కూడా రిసీవ్ చేసుకోవడం లేదు. దీంతో చైతన్య శుక్రవారం గంగాదేవిపల్లికి చేరుకుంది. ఆ సమయంలో ప్రియుడు గ్రామంలో లేడు. దీంతో ఆమె ప్రియుడి ఇంటి వద్ద ఆందోళనకు దిగింది. చంద్రకాంత్‌రెడ్డికి ఇష్టం ఉంటే పెళ్లి చేసుకో.. మా ఇంటి ముందుకు ఎందుకు వచ్చావు అంటూ చైతన్యతో చంద్రకాంత్ కుటుంబసభ్యులు మండిపడ్దారు. తనను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చేంతవరకూ ఇక్కడి నుంచి కదిలేది లేదని ఆమె భీష్మించింది. ఈ విషయంపై బాధితురాలి నుంచి ఎటువంటి ఫిర్యాదూ అందలేదని రూరల్ ఎస్ఐ నారాయణరెడ్డి పేర్కొన్నారు. -
రాజమౌళికి కేసీఆర్ ఫోన్
వరంగల్ : హలో.. నేను సీఎం కేసీఆర్‌ను మాట్లాడుతున్నా.. అంటూ గంగదేవిపల్లి మాజీ సర్పంచ్, గ్రామ అభివృద్ధి కమిటీ నాయకుడు కూసం రాజమౌళికి కేసీఆర్ సోమవారం రాత్రి 8 గంటలకు ఫోన్ చేశారు. అయితే సీఎం తనకు ఫోన్ చేసి మాట్లాడుతుండటంతో రాజమౌళి కొంత ఆశ్చర్యానికి గురైనా ఆ తర్వాత తేరుకుని ఆయనతో మాట్లాడారు. సోమవారం మండలంలోని జాతీయ ఆదర్శ గ్రామం గంగదేవిపల్లిలో గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా సీఎం కేసీఆర్ ఇక్కడి పద్ధతులను, ప్రజల ఐకమత్యాన్ని, సంఘటిత శక్తిని తెలుసుకుని హైదరాబాద్ వెళ్లారు. హైదరాబాద్ చేరుకున్న సీఎం కేసీఆర్ రాత్రి 8 గంటలకు నేరుగా రాజమౌళికి ఫోన్ చేసి మాట్లాడారు. తాను గంగదేవిపల్లి గ్రామాన్ని సందర్శించడంపై ప్రజల స్పందన ఎలా ఉందని సీఎం కేసీఆర్ రాజమౌళిని అడిగారు. అయితే ‘మీ రాకతో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. మాలో స్ఫూర్తిని నింపారు. మా గ్రామంలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులును ప్రతిభింబించే విధంగా మీ మాటలు ఉన్నాయి. మేం అడిగిన నిధుల కంటే ఎక్కువగా నిధులు మంజూరు చేసినందుకకు మా గ్రామస్తుల ఆనందం మాటల్లో చెప్పలేని విధంగా ఉంది’ అని రాజమౌళి అన్నారు. కాగా ‘ఇప్పటి వరకు మీరు కమిటీల ద్వారా ప్రజలను ఐక్యంగా చేశారు. ఇంకా ఎంతో చేయాలి. ప్రతీ కుటుంబాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయాలి. వ్యసాయాన్ని పాత పద్ధతిలో కాకుండా కొత్త పద్ధతిలో చేయాలి. ఈ విషయంలో ఆలోచించండి. ప్రభుత్వ నుంచి మీకు పూర్తి సహకారం ఉంటుంది.’ అంటూ సీఎం కేసీఆర్ తనతో ఫోన్లో మాట్లాడినట్లు కూసం రాజమౌళి తెలిపారు. -
కేసీఆర్ ఆరోసారి
-
కేసీఆర్ ఆరోసారి
నేడు జిల్లాకు ముఖ్యమంత్రి గంగదేవిపల్లిలో గ్రామజ్యోతి ప్రారంభం మేడిపల్లి - రాంపూర్‌లో బహిరంగసభ ఒక్క రోజు పర్యటనే! వరంగల్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మరోసారి జిల్లాకు వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలోనే ప్రారంభించనున్నారు. పరకాల నియోజకవర్గం గీసుగొండ మండలం గంగదేవిపల్లిలో సోమవారం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా గంగదేవిపల్లికి హెలికాప్టర్లో రానున్నారు. గ్రామంలో గ్రామజ్యోతి ప్రారంభోత్సవ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. అనంతరం నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లి మండలం మేడిపల్లి-రాంపూర్‌లోనూ గ్రామజ్యోతి సభలో పాల్గొంటారు. అక్కడి నుంచే నేరుగా హైదరాబాద్‌కు వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. పోలీసులు బందోబస్తు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. గత ఏడా ది జూన్ 2న ముఖ్యమం త్రి పదవి చేపట్టిన కేసీఆర్... ఇప్ప టి వరకు ఐదుసార్లు జిల్లాకు వచ్చారు. జూలైలో హరితహారం కార్యక్రమానికి రావా ల్సి ఉన్నా.. ఆఖరి నిమిషంలో పర్యటన రద్దరుుంది. ఇప్పుడు గ్రామజ్యోతి కార్యక్రమం కోసం జిల్లాకు వస్తున్నారు. ఒక్క రోజు పర్యటనే... ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా పర్యటన మొదట రెండు రోజులు ఉంటుందనే నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. సోమవారం పరకాల, నర్సంపేట నియోజకవర్గాల్లో... మంగళవారం వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల్లో పర్యటించేలా పర్యటన మొదట ఖరారైంది. చివరి నిమిషయంలో రెండో రోజు పర్యటన రద్దరుు్యంది. గ్రామజ్యోతికి ప్రాచుర్యం కల్పించాలనే ఉద్దేశంతోనే కేవలం ఈ కార్యక్రమానికే పరిమితమైనట్లు టీఆర్ఎస్ ముఖ్య నాయకులు చెబుతున్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో పర్యటనకు ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. కేసీఆర్ నగర పర్యటన రద్దవడంతో మోడల్ మార్కెట్, షాదీఖానా నిర్మాణానికి శంకుస్థాపనలు వాయిదా వేయాల్సి వచ్చింది. ఏళ్లుగా ప్రారంభానికి నోచుకోకుంటా ఉన్న రీజిన్ సైన్స్ సెంటర్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఎట్టకేలకు ప్రారంభించనున్నారని భావించినా చివరిని నిమిషయంలో మళ్లీ రద్దయ్యింది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం వడ్డెపల్లి చెరువు ట్యాంక్‌బండ్ పరిశీలన పరిస్థితి ఇలాగే ఉంది. సీఎం పర్యటన ఇలా.. ఉదయం 10.30 గంటలకు హెలికాప్టర్లో గీసుగొండ మండలం గంగదేవిపల్లికి చేరుకుంటారు. ఒంటి గంట వరకు గంగదేవిపల్లిలో గ్రామజ్యోతి కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభిస్తారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల వరకు మేడిపల్లిలో భోజనం మధ్యాహ్నం రెండు గంటల నుంచి 3 గంటల వరకు మేడిపల్లిలో గ్రామజ్యోతి కార్యక్రమం పాల్గొంటారు.మధ్యాహ్నం 3.30 గంటలకు సీఎం కేసీఆర్ హైదరాబాద్‌కు తిరుగు పయనం. -
నేడు ‘గ్రామజ్యోతి’కి శ్రీకారం
గంగదేవిపల్లిలో ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం ఉదయం 10.30 గంటలకు వరంగల్ జిల్లా గంగదేవిపల్లిలో ప్రారంభించనున్నారు. కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి హరితహారం నిర్వహిస్తారు. గ్రామకమిటీ ల ద్వారా గంగదేవిపల్లిలో జరిగిన అభివృద్ధిని ముఖ్యమంత్రి పరిశీలిస్తారు. అనంతరం గ్రామసభలో పాల్గొంటారు. తర్వాత నల్లబెల్లి మండలం మేడిపల్లిలో నిర్వహించనున్న రాంపూర్-మేడిపల్లి జంట గ్రామాల గ్రామసభలో పాల్గొంటారు. తన గ్రామాభివృద్ధికి రూ. 50 లక్షలను విరాళంగా ఇచ్చిన రాంపూర్వాసి, యశోద హాస్పిటల్స్ అధిపతి గోరుకంటి సురేందర్‌రావును సీఎం కేసీఆర్ అభినందించనున్నారు. అలాగే, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్‌లో గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారు దత్తత తీసుకున్న గ్రామాల్లోనే సోమవారం గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. -
కేసీఆర్‌కు గంగదేవిపల్లి స్వాగతం
సీఎం పర్యటన ఏర్పాట్లు పూర్తి గ్రామజ్యోతి కార్యక్రమానికి ఇక్కడి నుంచే శ్రీకారం గీసుకొండ :సీఎం కేసీఆర్‌కు మండలంలోని గంగదేవిపల్లి స్వాగతం పలుకుతోంది. ప్రతీ గడప, కుటుంబం ఆయన రాకకోసం ఎదురు చూస్తోంది. తమ గ్రామానికి దేశవిదేశీయులు అనేకమంది వచ్చినా సీఎం కేసీఆర్ తొలిసారి ఇక్కడ పర్యటించడం వారిలో నూతనోత్తేజం నింపుతోంది. గ్రామజ్యోతి పథకాన్ని ఆయన ఇక్కడి నుంచే ప్రారంభించనుండడంతో జిల్లానేకాదు.. రాష్ర్టం దృష్టి మొత్తం ఇక్కడే ఉంది. గ్రామస్తులతో ముఖాముఖి సీఎం కేసీఆర్ ఉదయం 10 గంటలకు గ్రామానికి చేరుతారు. ఆయనకు స్వాగ తం పలకడానికి సర్వం సిద్ధం చేశామని గ్రామాభివృద్ధి కమిటీ నాయకుడు కూ సం రాజమౌళి తెలిపారు. తొలుత సీఎం ఇంటింటికీ తిరుగుతూ గ్రామస్తుల అ నుభవాలు అడిగి తెలుసుకుంటారు. జెడ్పీ పాఠశాలలో మొక్కలు నాటుతా రు. గ్రామపంచాయతీ కార్యాలయం వ ద్ద గ్రామసభ చేపట్టి గంగదేవిపల్లి ఆదర్శాల గురించి గ్రామస్తులతో చర్చిస్తారు. ఒకవేళ వర్షం కురిసినా ఇబ్బందులు తలెత్తకుండా పంచాయతీ కార్యాలయం ప్రాంగణంలో రేకులతో పెద్దకప్పు, వేదిక ఏర్పాటు చేశారు. ఏర్పాట్లలో అధికారులు సీఎం పర్యటన ఏర్పాట్లలో జిల్లా అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ప్రధాన శాఖల అధికారులు ఇక్కడే మకాం వేసి అవసరమైన చర్యలు చేపట్టారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, కలెక్టర్ వాకాటి కరుణ, జేసీ పాటిల్ ఆదివారం రాత్రి వరకూ ఇక్కడే ఉండి పనులను పర్యవేక్షించారు. కట్టుదిట్టంగా భద్రత.. గంగదేవిపల్లిలో సీఎం సెక్యూరిటీ ఫో ర్స్ మకాం వేసింది. వీరే కాకుండా సు మారు వెయ్యి మంది పోలీసులను ని యమించారు. నగర పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు, ఏసీపీ మహేందర్ బందోబస్తు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే గ్రా మం మీదుగా హెలికాప్టర్ చక్కర్లు కొ ట్టింది. అయితే సీఎం ఎలా వస్తారనే వి షయాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు. -
17న గంగదేవిపల్లికి సీఎం
‘గ్రామజ్యోతి’ని ప్రారంభించనున్న కేసీఆర్ {పజల ఐకమత్యం, పనిలో భాగస్వామ్యం ఇదీ గంగదేవిపల్లి ప్రత్యేకత గీసుకొండ: మండలంలోని జాతీయ ఆదర్శగ్రామం గంగదేవిపల్లి మరోసారి వార్తలకెక్కింది. సీఎం కేసీఆర్ ఈ గ్రామాన్ని సందర్శించనున్నారు. ‘గ్రామజ్యోతి’ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచే కేసీఆర్ లాంఛనంగా ఆగస్టు17వ తేదీన ప్రారంభిస్తారు. తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 24వ తేదీ వరకు వారోత్సవాలు నిర్వహించనున్నట్లు స్వయంగా సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లో గురువారం జరిగిన మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో వెల్లడించారు. అనేక ప్రత్యేకతలతో దేశంలోనే ఆదర్శగ్రామంగా గుర్తింపు తెచ్చుకున్న గంగదేవిపల్లి ఇప్పటికే దేశవిదేశీయులను ఆకర్శిస్తోంది. ముఖ్యంగా ప్రతీ పనికి ఓ కమిటీని ఏర్పాటు చేసుకుని దాని ద్వారా పనులను చేయడం, గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడం ఇక్కడి ప్రజల ప్రత్యేకత. 2004లో ప్రత్యేక గ్రామపంచాయతీగా ఏర్పడిన గ్రామం ఆ తర్వాత అనేక సొబగులు అద్దుకుంది. గంగదేవిపల్లి ప్రత్యేకతలు.. ►వంద శాతం కుటుంబాలు మరుగుదొడ్లు నిర్మించుకోవడం. ►{పతీ కుటుంబం చిన్న మొత్తాల పొదుపు చేయడం ►{పతీ కుటుంబానికి బ్యాంకు అకౌంట్ ఉండటం ►అర్హులైన ప్రతీ కుటుంబం కుటుంబ నియంత్రణ పాటించడం ►తమ ఇంటి ముందు రోడ్డును ఆయూ కుటుంబాలు ఊడ్చుకోవడం, పరిశుభ్రతను పాటించడం. ► మద్యం అమ్మకాలు లేకపోవడం బాలకార్మికులు లేకపోవడం ►తాగునీరు వృథా చేసినా, బహిరంగ ప్రదేశాల్లో మల, మూత్ర విసర్జన చేసినా రూ. 500 జరిమానా విధిస్తారు. ►కేంద్ర ప్రభుత్వ చేపట్టిన స్వచ్ఛభారత్‌కు ఈ గ్రామం స్ఫూర్తిగా నిలుస్తోంది. ►ఇప్పటి వరకు గ్రామాన్ని సుమారు 76 దేశాల ప్రతినిధులు సందర్శించారు. ►స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ సంసద్ ఆదర్శ గ్రామ యోజన కింద గంగగేవిపల్లిని ఎంపిక చేసి గ్రామాభివృద్ధిపై రూపొందించిన డాక్యుమెంటరీని న్యూఢిల్లీలో వీక్షించారు. ►గంగదేవిపల్లి ప్రజల ఐకమత్యాన్ని, పనుల్లో భాగస్వామ్యాన్ని కొనియాడారు. ఎన్నో అవార్డులు.. ►2007 మే 4వ తేదీన అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా నిర్మల్ గ్రామ్ పురస్కారాన్ని సర్పంచ్ కూసం రాజమౌళి అందుకున్నారు. జిల్లాలో ఈ అవార్డు పొందిన తొలిగ్రామం గంగదేవిపల్లి ►2008 నవంబర్1న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా శుభ్రం అవార్డును సర్పంచ్ కూసం రాజమౌళికి అందుకున్నారు. ►2010లో గూగుల్ సంస్థ వారు గూగుల్ గ్రామపంచాయతీ అవార్డుకు గ్రామాన్ని ఎంపిక చేసి రూ. 5 లక్షలు అందించారు. ►2007న ఆంధ్రా బ్యాంకు వారు పట్టాభి ఆదర్శగ్రామంగా ప్రకటించారు. ►2007లో భారతరత్న రాజీవ్‌గాంధీ అత్యుత్తమ గ్రామపంచాయతీ జాతీయస్థాయి అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ►సినీ హీరో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన సందర్భంగా తెలంగాణలో మొట్టమొదటి సారిగా గంగదేవిపల్లిని సందర్శించారు. -
మార్గదర్శనం ఈ ఆదర్శగ్రామం
గంగదేవిపల్లి ఇటీవల ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పార్లమెంటు సభ్యులతో సమావేశమయ్యారు. దాదాపుగా ఆరువందల మంది హాజరైన ఆ సమావేశంలో ‘సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన’ కార్యక్రమాన్ని ప్రస్తావించారు. ప్రతి ఒక్కరూ ఓ గ్రామాన్ని దత్తత చేసుకుని దానిని ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దమని సూచిస్తూ... అంకితభావంతో పనిచేస్తే అది సాధ్యమే అని ఏడు నిమిషాల వీడియోను ప్రదర్శించారు. అది మన తెలుగు గ్రామం. బాలవికాస్ సంస్థ నిర్వహకులు ప్రజల భాగస్వామ్యంతో తీర్చిదిద్దిన గంగదేవిపల్లి. అసలు అది ఆదర్శగ్రామం ఎలా అయిందంటే... వరంగల్జిల్లా గీసుకొండ మండలంలోని గంగదేవిపల్లి 320 కుటుంబాలున్న గ్రామం. జాతీయస్థాయిలో ఆదర్శగ్రామంగా మన్ననలు పొందుతోంది. ఇంతకీ ఆదర్శగ్రామం అంటే..? ప్రభుత్వం కొన్ని గ్రామాలను ఆదర్శగ్రామాలుగా ఎంపిక చేసి ప్రత్యేక వసతులు కల్పిస్తుంటుంది. ఇదీ అలాంటిదేనా? ఏ మాత్రం కాదు. ఇది ప్రజలు సంఘటితమై ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకున్న ఆదర్శ గ్రామం. అదెలా సాధ్యమైందంటే... పాతికేళ్ల కిందట గంగదేవి పల్లి కూడా అత్యంత సామాన్యమైన గ్రామమే. వర్గ తగాదాలు, రాజకీయ వైషమ్యాలతో పరస్పర విభేదాలతో ఉండేది. తాగునీటికి కిలోమీటర్ల దూరం వెళ్లక తప్పని పరిస్థితి. ఇదిలా ఉండగా... అది 1992వ సంవత్సరం. బాలవికాస స్వచ్ఛంద సంస్థ గ్రామాలకు రక్షిత మంచినీటిని అందించే ఉద్దేశంతో పనులు చేస్తోంది. గంగదేవిపల్లికి పొరుగూరులో మంచినీటి ట్యాంకు ప్రారంభోత్సవం జరుగుతోంది. గంగదేవి పల్లి గ్రామస్థులు కొంతమంది అక్కడికి వెళ్లి ‘తమ ఊరికి కూడా మంచినీటి ట్యాంకు కట్టించాల్సింది’గా బాలవికాస కేంద్రం నిర్వహకులను కోరారు. గ్రామంలోని వర్గవిభేదాలను తుడిచేయడానికి ఇదే మంచి సమయం అనుకున్నారు బాలవికాస కేంద్రం సి.ఇ.ఓ సింగారెడ్డి శౌరిరెడ్డి. ‘గ్రామం అంతా ఒకే మాట మీద కలిసికట్టుగా ఉండాలి, నీటి ఓవర్ట్యాంకు నిర్మాణంలో 15 శాతం గ్రామస్థుల భాగస్వామ్యం ఉండాలి’ అనే నియమాలను చెప్పి వారికి కొంత సమయం ఇచ్చారు. ‘‘మూడు నెలలకు మొదట కలిసిన వాళ్లు మరికొంత మందిని కలుపుకుని వచ్చారు. తమ వంతుగా అరవై వేల రూపాయలు సిద్ధం చేసి, శ్రమదానం చేస్తామన్నారు. ఓవర్‌హెడ్ ట్యాంకు నిర్మాణం పూర్తయి నీళ్లు ఇంటికే రావడంతో గ్రామస్థులలో పరివర్తన మొదలైంది’’ అన్నారు శౌరిరెడ్డి. ఇప్పుడు... మద్యపాన నిషేధం. అక్షరాస్యత సాధన. కుటుంబాలకు మరుగుదొడ్లు. అన్ని కుటుంబాలు పొదుపు చేయడం. ప్రతి ఇంటికీ నీటి కుళాయి... రోజూ నీటి సరఫరా. ప్రతి ఇంటి ముందూ చెట్లు పెంచడం. ప్రతి రోజూ వెలిగే వీథి దీపాలు. బడి... గుడి... ఆరోగ్యకేంద్రం. బాల కార్మికుల నిర్మూలన. ప్రతి ఒక్కరికీ రక్షిత మంచినీరు, అందరూ ఇంటిపన్ను - కరెంటు బిల్లులు కట్టడం వంటి వాటిలో నూటికి నూరుశాతం లక్ష్యాలను సాధించారు. ఈ ఇరవై ఏళ్లలో ఏ జంట కూడా ఇద్దరు పిల్లల నియమాన్ని తప్పలేదు. ఇరవై ఏళ్లలో గ్రామంలో ఒక్క పోలీసు కేసు కూడా నమోదు కాలేదు. ప్రభుత్వ పథకాల నిర్ణయాలు పైస్థాయిలో జరుగుతాయి. వాటిని ‘ఆచరించకపోతే ఏమవుతుంది’ అనే తిరుగుబాటు ధోరణి వ్యక్తమవుతుంటుంది. ప్రభుత్వం చెప్తున్న సంగతి అంత ప్రాముఖ్యం కాదనే అవగాహన లోపమూ ఉంటుంది. అలా కాకుండా ‘‘తమకు తాముగా తీసుకునే నిర్ణయం కావడంతో అందరూ ఆచరిస్తున్నారు. ప్రతి గ్రామంలో ఇలాంటి స్ఫూర్తినే రగిలించాల’’ంటారు ప్రధాని... అన్నారాయన. గంగదేవిపల్లిలో వాటర్ కమిటీ, హెల్త్ కమిటీ, మదర్స్ కమిటీ, స్కూల్ ఎడ్యుకేషన్, టెంపుల్ కన్స్ట్రక్షన్, ఫార్మర్స్ కమిటీ, యూత్ కమిటీ, ప్లాస్టిక్ కంట్రోల్, మహిళా కమిటీ, గంగా డిష్ కనెక్షన్, పొదుపు, జీవిత బీమా, బాల కార్మిక నిర్మూలన వంటి 15 కమిటీలున్నాయి. గ్రామస్థులలో సగం మంది ఏదో ఓ కమిటీలో సభ్యులై ఉంటారు. ఐక్యత, సమర్థ నాయకత్వం, ఒకే విధమైన ముందుచూపు ఉంటే గ్రామాన్ని ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దవచ్చు అంటారు శౌరిరెడ్డి. నిబంధనలు కఠినంగానే ఉంటాయి! ఆదర్శగ్రామం అనే బిరుదును అందుకోవడం చిన్న విషయమేమీ కాదు. ఆశయం మంచిదైనా ఆచరణ సరిగ్గా ఉండాలంటే నియమాలు, నిబంధనలు కఠినంగానే ఉండాలి. ఇంటి ముందు నాటిన చెట్టు చనిపోయినా, నీటి తొట్టి నిండి పొర్లిపోయినా, నీటి కుళాయి లీకవుతున్నా ఇంటికి నీటి సరఫరాను నిలిపేస్తారు. ఒకసారి నల్లా (నీటి కుళాయి) బంద్ అయితే వాటర్ కమిటీ ముందు క్షమాపణ చెప్పి జరిమానా చెల్లించాలి. మరుగుదొడ్డి ఉపయోగించపోయినా ఫైన్ కట్టాలి. అన్నింటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సిందేమిటంటే... వారానికోసారి గ్రామస్థులంతా ఎవరి ఇంటి ముందు వాళ్లే వీథిని శుభ్రం చేసుకుంటారు. ఊరంతా కలిసి డిష్ కేబుల్ ఏర్పాటుచేసుకున్నారు. ఇక నెలవారీ బిల్లులుండవు. విదేశీ ప్రతినిధులు గ్రామంలో పర్యటించే వివరాలు, గ్రామానికి అవార్డు వచ్చిన వార్తలను, గర్భిణులకు పరీక్షలు చేయడానికి, పిల్లలకు పోలియో చుక్కలు వేయడానికి హెల్త్ వర్కర్లు గ్రామానికి వచ్చే తేదీల సమాచారాన్ని ప్రత్యేకంగా ప్రసారం చేస్తారు. ఆర్థికంగా కాదు ఆదర్శంగా!: గంగదేవి పల్లికి పొరుగున కొన్ని గ్రామాల్లో పెద్ద పెద్ద భవనాలు, సిమెంటు రోడ్లు, కమ్యూనిటీ భవనాల వంటివి ఉన్నాయి. కానీ అవేవీ ప్రజల భాగస్వామ్యంతో జరిగినవి కాదు. ప్రజల భాగస్వామ్యంతో సాధించిన అభివృద్ధే ఆదర్శవంతమైన అభివృద్ధి. మన ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోరుకుంటున్న అభివృద్ధి కూడా అలాంటిదే. మన పార్లమెంటు సభ్యులు చేసి చూపాల్సింది కూడా ప్రజలను భాగస్వాములను చేసిన ఆదర్శగ్రామాలనే. - వాకా మంజులారెడ్డి ఫొటోలు: రాజేంద్రప్రసాద్, వరప్రసాద్, సాక్షి గ్రామ స్వరాజ్యమే కాదు... సురాజ్యమూ సాధ్యమే! అభివృద్ధి ఒక్కరోజులో వచ్చేది కాదు. గ్రామస్థుల మధ్య అవగాహన బాగుంటే ఆలోచనలు బాగుంటాయి. ఆలోచనలు బాగుంటే ఆశయం బాగుంటుంది. ఆశయం బాగుంటే ఆచరణ బాగుంటుంది. ఆచరణ బాగుంటే అభివృద్ధి బావుంటుంది. అంటే అభివృద్ధి అనే మహావృక్షానికి బీజం అవగాహన... అని మేము ఎంపిక చేసుకున్న వంద గ్రామాల ప్రజలకూ చెప్తున్నాం. ప్రధానమంత్రి ఢిల్లీలో పార్లమెంటు సభ్యులకు గంగదేవిపల్లిని ఆదర్శంగా చూపించినప్పుడు వారిలో ఒక ఆశ కనిపించింది. ఎం.పిలలో మార్పు సాధ్యమే అనే అభిప్రాయం కలగడాన్ని గమనించాను. వారి స్ఫూర్తితో ముందుకు వస్తే చాలా గ్రామాలు ఆదర్శగ్రామాలవుతాయి. గాంధీజీ కలలు కన్నట్లు గ్రామ స్వరాజ్యం మాత్రమే కాకుండా మన ప్రధాని కోరినట్లు గ్రామసురాజ్యాన్ని కూడా సాధించవచ్చు.