మార్గదర్శనం ఈ ఆదర్శగ్రామం
గంగదేవిపల్లి
ఇటీవల ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పార్లమెంటు సభ్యులతో సమావేశమయ్యారు. దాదాపుగా ఆరువందల మంది హాజరైన ఆ సమావేశంలో ‘సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన’ కార్యక్రమాన్ని ప్రస్తావించారు. ప్రతి ఒక్కరూ ఓ గ్రామాన్ని దత్తత చేసుకుని దానిని ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దమని సూచిస్తూ... అంకితభావంతో పనిచేస్తే అది సాధ్యమే అని ఏడు నిమిషాల వీడియోను ప్రదర్శించారు. అది మన తెలుగు గ్రామం. బాలవికాస్ సంస్థ నిర్వహకులు ప్రజల భాగస్వామ్యంతో తీర్చిదిద్దిన గంగదేవిపల్లి. అసలు అది ఆదర్శగ్రామం ఎలా అయిందంటే...
వరంగల్‌జిల్లా గీసుకొండ మండలంలోని గంగదేవిపల్లి 320 కుటుంబాలున్న గ్రామం. జాతీయస్థాయిలో ఆదర్శగ్రామంగా మన్ననలు పొందుతోంది. ఇంతకీ ఆదర్శగ్రామం అంటే..? ప్రభుత్వం కొన్ని గ్రామాలను ఆదర్శగ్రామాలుగా ఎంపిక చేసి ప్రత్యేక వసతులు కల్పిస్తుంటుంది. ఇదీ అలాంటిదేనా? ఏ మాత్రం కాదు. ఇది ప్రజలు సంఘటితమై ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకున్న ఆదర్శ గ్రామం. అదెలా సాధ్యమైందంటే... పాతికేళ్ల కిందట గంగదేవి పల్లి కూడా అత్యంత సామాన్యమైన గ్రామమే. వర్గ తగాదాలు, రాజకీయ వైషమ్యాలతో పరస్పర విభేదాలతో ఉండేది. తాగునీటికి కిలోమీటర్ల దూరం వెళ్లక తప్పని పరిస్థితి.
ఇదిలా ఉండగా...
అది 1992వ సంవత్సరం. బాలవికాస స్వచ్ఛంద సంస్థ గ్రామాలకు రక్షిత మంచినీటిని అందించే ఉద్దేశంతో పనులు చేస్తోంది. గంగదేవిపల్లికి పొరుగూరులో మంచినీటి ట్యాంకు ప్రారంభోత్సవం జరుగుతోంది. గంగదేవి పల్లి గ్రామస్థులు కొంతమంది అక్కడికి వెళ్లి ‘తమ ఊరికి కూడా మంచినీటి ట్యాంకు కట్టించాల్సింది’గా బాలవికాస కేంద్రం నిర్వహకులను కోరారు. గ్రామంలోని వర్గవిభేదాలను తుడిచేయడానికి ఇదే మంచి సమయం అనుకున్నారు బాలవికాస కేంద్రం సి.ఇ.ఓ సింగారెడ్డి శౌరిరెడ్డి. ‘గ్రామం అంతా ఒకే మాట మీద కలిసికట్టుగా ఉండాలి, నీటి ఓవర్‌ట్యాంకు నిర్మాణంలో 15 శాతం గ్రామస్థుల భాగస్వామ్యం ఉండాలి’ అనే నియమాలను చెప్పి వారికి కొంత సమయం ఇచ్చారు.
‘‘మూడు నెలలకు మొదట కలిసిన వాళ్లు మరికొంత మందిని కలుపుకుని వచ్చారు. తమ వంతుగా అరవై వేల రూపాయలు సిద్ధం చేసి, శ్రమదానం చేస్తామన్నారు. ఓవర్‌హెడ్ ట్యాంకు నిర్మాణం పూర్తయి నీళ్లు ఇంటికే రావడంతో గ్రామస్థులలో పరివర్తన మొదలైంది’’ అన్నారు శౌరిరెడ్డి. ఇప్పుడు... మద్యపాన నిషేధం. అక్షరాస్యత సాధన. కుటుంబాలకు మరుగుదొడ్లు. అన్ని కుటుంబాలు పొదుపు చేయడం. ప్రతి ఇంటికీ నీటి కుళాయి... రోజూ నీటి సరఫరా. ప్రతి ఇంటి ముందూ చెట్లు పెంచడం. ప్రతి రోజూ వెలిగే వీథి దీపాలు. బడి... గుడి... ఆరోగ్యకేంద్రం. బాల కార్మికుల నిర్మూలన. ప్రతి ఒక్కరికీ రక్షిత మంచినీరు, అందరూ ఇంటిపన్ను - కరెంటు బిల్లులు కట్టడం వంటి వాటిలో నూటికి నూరుశాతం లక్ష్యాలను సాధించారు. ఈ ఇరవై ఏళ్లలో ఏ జంట కూడా ఇద్దరు పిల్లల నియమాన్ని తప్పలేదు. ఇరవై ఏళ్లలో గ్రామంలో ఒక్క పోలీసు కేసు కూడా నమోదు కాలేదు.
ప్రభుత్వ పథకాల నిర్ణయాలు పైస్థాయిలో జరుగుతాయి. వాటిని ‘ఆచరించకపోతే ఏమవుతుంది’ అనే తిరుగుబాటు ధోరణి వ్యక్తమవుతుంటుంది. ప్రభుత్వం చెప్తున్న సంగతి అంత ప్రాముఖ్యం కాదనే అవగాహన లోపమూ ఉంటుంది. అలా కాకుండా ‘‘తమకు తాముగా తీసుకునే నిర్ణయం కావడంతో అందరూ ఆచరిస్తున్నారు. ప్రతి గ్రామంలో ఇలాంటి స్ఫూర్తినే రగిలించాల’’ంటారు ప్రధాని... అన్నారాయన. గంగదేవిపల్లిలో వాటర్ కమిటీ, హెల్త్ కమిటీ, మదర్స్ కమిటీ, స్కూల్ ఎడ్యుకేషన్, టెంపుల్ కన్‌స్ట్రక్షన్, ఫార్మర్స్ కమిటీ, యూత్ కమిటీ, ప్లాస్టిక్ కంట్రోల్, మహిళా కమిటీ, గంగా డిష్ కనెక్షన్, పొదుపు, జీవిత బీమా, బాల కార్మిక నిర్మూలన వంటి 15 కమిటీలున్నాయి. గ్రామస్థులలో సగం మంది ఏదో ఓ కమిటీలో సభ్యులై ఉంటారు. ఐక్యత, సమర్థ నాయకత్వం, ఒకే విధమైన ముందుచూపు ఉంటే గ్రామాన్ని ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దవచ్చు అంటారు శౌరిరెడ్డి.
నిబంధనలు కఠినంగానే ఉంటాయి!
ఆదర్శగ్రామం అనే బిరుదును అందుకోవడం చిన్న విషయమేమీ కాదు. ఆశయం మంచిదైనా ఆచరణ సరిగ్గా ఉండాలంటే నియమాలు, నిబంధనలు కఠినంగానే ఉండాలి. ఇంటి ముందు నాటిన చెట్టు చనిపోయినా, నీటి తొట్టి నిండి పొర్లిపోయినా, నీటి కుళాయి లీకవుతున్నా ఇంటికి నీటి సరఫరాను నిలిపేస్తారు. ఒకసారి నల్లా (నీటి కుళాయి) బంద్ అయితే వాటర్ కమిటీ ముందు క్షమాపణ చెప్పి జరిమానా చెల్లించాలి. మరుగుదొడ్డి ఉపయోగించపోయినా ఫైన్ కట్టాలి.
అన్నింటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సిందేమిటంటే... వారానికోసారి గ్రామస్థులంతా ఎవరి ఇంటి ముందు వాళ్లే వీథిని శుభ్రం చేసుకుంటారు. ఊరంతా కలిసి డిష్ కేబుల్ ఏర్పాటుచేసుకున్నారు. ఇక నెలవారీ బిల్లులుండవు. విదేశీ ప్రతినిధులు గ్రామంలో పర్యటించే వివరాలు, గ్రామానికి అవార్డు వచ్చిన వార్తలను, గర్భిణులకు పరీక్షలు చేయడానికి, పిల్లలకు పోలియో చుక్కలు వేయడానికి హెల్త్ వర్కర్లు గ్రామానికి వచ్చే తేదీల సమాచారాన్ని ప్రత్యేకంగా ప్రసారం చేస్తారు.
ఆర్థికంగా కాదు ఆదర్శంగా!: గంగదేవి పల్లికి పొరుగున కొన్ని గ్రామాల్లో పెద్ద పెద్ద భవనాలు, సిమెంటు రోడ్లు, కమ్యూనిటీ భవనాల వంటివి ఉన్నాయి. కానీ అవేవీ ప్రజల భాగస్వామ్యంతో జరిగినవి కాదు. ప్రజల భాగస్వామ్యంతో సాధించిన అభివృద్ధే ఆదర్శవంతమైన అభివృద్ధి. మన ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోరుకుంటున్న అభివృద్ధి కూడా అలాంటిదే. మన పార్లమెంటు సభ్యులు చేసి చూపాల్సింది కూడా ప్రజలను భాగస్వాములను చేసిన ఆదర్శగ్రామాలనే.
- వాకా మంజులారెడ్డి
ఫొటోలు: రాజేంద్రప్రసాద్, వరప్రసాద్, సాక్షి
గ్రామ స్వరాజ్యమే కాదు... సురాజ్యమూ సాధ్యమే!
అభివృద్ధి ఒక్కరోజులో వచ్చేది కాదు. గ్రామస్థుల మధ్య అవగాహన బాగుంటే ఆలోచనలు బాగుంటాయి. ఆలోచనలు బాగుంటే ఆశయం బాగుంటుంది. ఆశయం బాగుంటే ఆచరణ బాగుంటుంది. ఆచరణ బాగుంటే అభివృద్ధి బావుంటుంది. అంటే అభివృద్ధి అనే మహావృక్షానికి బీజం అవగాహన... అని మేము ఎంపిక చేసుకున్న వంద గ్రామాల ప్రజలకూ చెప్తున్నాం. ప్రధానమంత్రి ఢిల్లీలో పార్లమెంటు సభ్యులకు గంగదేవిపల్లిని ఆదర్శంగా చూపించినప్పుడు వారిలో ఒక ఆశ కనిపించింది. ఎం.పిలలో మార్పు సాధ్యమే అనే అభిప్రాయం కలగడాన్ని గమనించాను. వారి స్ఫూర్తితో ముందుకు వస్తే చాలా గ్రామాలు ఆదర్శగ్రామాలవుతాయి. గాంధీజీ కలలు కన్నట్లు గ్రామ స్వరాజ్యం మాత్రమే కాకుండా మన ప్రధాని కోరినట్లు గ్రామసురాజ్యాన్ని కూడా సాధించవచ్చు.