17న గంగదేవిపల్లికి సీఎం
‘గ్రామజ్యోతి’ని ప్రారంభించనున్న కేసీఆర్
{పజల ఐకమత్యం, పనిలో భాగస్వామ్యం
ఇదీ గంగదేవిపల్లి ప్రత్యేకత
గీసుకొండ: మండలంలోని జాతీయ ఆదర్శగ్రామం గంగదేవిపల్లి మరోసారి వార్తలకెక్కింది. సీఎం కేసీఆర్ ఈ గ్రామాన్ని సందర్శించనున్నారు. ‘గ్రామజ్యోతి’ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచే కేసీఆర్ లాంఛనంగా ఆగస్టు17వ తేదీన ప్రారంభిస్తారు. తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 24వ తేదీ వరకు వారోత్సవాలు నిర్వహించనున్నట్లు స్వయంగా సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లో గురువారం జరిగిన మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో వెల్లడించారు. అనేక ప్రత్యేకతలతో దేశంలోనే ఆదర్శగ్రామంగా గుర్తింపు తెచ్చుకున్న గంగదేవిపల్లి ఇప్పటికే దేశవిదేశీయులను ఆకర్శిస్తోంది. ముఖ్యంగా ప్రతీ పనికి ఓ కమిటీని ఏర్పాటు చేసుకుని దాని ద్వారా పనులను చేయడం, గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడం ఇక్కడి ప్రజల ప్రత్యేకత. 2004లో ప్రత్యేక గ్రామపంచాయతీగా ఏర్పడిన గ్రామం ఆ తర్వాత అనేక సొబగులు అద్దుకుంది.
గంగదేవిపల్లి ప్రత్యేకతలు..
►వంద శాతం కుటుంబాలు మరుగుదొడ్లు నిర్మించుకోవడం.
►{పతీ కుటుంబం చిన్న మొత్తాల పొదుపు చేయడం
►{పతీ కుటుంబానికి బ్యాంకు అకౌంట్ ఉండటం
►అర్హులైన ప్రతీ కుటుంబం కుటుంబ నియంత్రణ పాటించడం
►తమ ఇంటి ముందు రోడ్డును ఆయూ కుటుంబాలు ఊడ్చుకోవడం, పరిశుభ్రతను పాటించడం.
► మద్యం అమ్మకాలు లేకపోవడం బాలకార్మికులు లేకపోవడం
►తాగునీరు వృథా చేసినా, బహిరంగ ప్రదేశాల్లో మల, మూత్ర విసర్జన చేసినా రూ. 500 జరిమానా విధిస్తారు.
►కేంద్ర ప్రభుత్వ చేపట్టిన స్వచ్ఛభారత్‌కు ఈ గ్రామం స్ఫూర్తిగా నిలుస్తోంది.
►ఇప్పటి వరకు గ్రామాన్ని సుమారు 76 దేశాల ప్రతినిధులు సందర్శించారు.
►స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ సంసద్ ఆదర్శ గ్రామ యోజన కింద గంగగేవిపల్లిని ఎంపిక చేసి గ్రామాభివృద్ధిపై రూపొందించిన డాక్యుమెంటరీని న్యూఢిల్లీలో వీక్షించారు.
►గంగదేవిపల్లి ప్రజల ఐకమత్యాన్ని, పనుల్లో భాగస్వామ్యాన్ని కొనియాడారు.
ఎన్నో అవార్డులు..
►2007 మే 4వ తేదీన అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా నిర్మల్ గ్రామ్ పురస్కారాన్ని సర్పంచ్ కూసం రాజమౌళి అందుకున్నారు. జిల్లాలో ఈ అవార్డు పొందిన తొలిగ్రామం గంగదేవిపల్లి
►2008 నవంబర్1న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా శుభ్రం అవార్డును సర్పంచ్ కూసం రాజమౌళికి అందుకున్నారు.
►2010లో గూగుల్ సంస్థ వారు గూగుల్ గ్రామపంచాయతీ అవార్డుకు గ్రామాన్ని ఎంపిక చేసి రూ. 5 లక్షలు అందించారు.
►2007న ఆంధ్రా బ్యాంకు వారు పట్టాభి ఆదర్శగ్రామంగా ప్రకటించారు.
►2007లో భారతరత్న రాజీవ్‌గాంధీ అత్యుత్తమ గ్రామపంచాయతీ జాతీయస్థాయి అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
►సినీ హీరో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన సందర్భంగా తెలంగాణలో మొట్టమొదటి సారిగా గంగదేవిపల్లిని సందర్శించారు.