ఇక వైఫై గంగదేవిపల్లి
ఇప్పటికే ఏడు చోట్ల ఆంటెన్నాల ఏర్పాటు
{పతీ ఆంటెన్నాకు 200 మీటర్ల పరిధిలో ఇంటర్నెట్ సిగ్నల్
త్వరలో ప్రారంభం కానున్న సేవలు
రాష్ట్రంలో ఉచిత ఇంటర్నెట్ పొందనున్న తొలి గ్రామంగా గుర్తింపు
గీసుకొండ : జాతీయ ఆదర్శ గ్రామమైన వరంగల్ రూరల్ జిల్లాలోని గంగదేవిపల్లికి మరో గుర్తింపు లభించనుంది. తెలంగాణ రాష్ట్రంలోనే ఉచిత ఇంటర్నెట్ సేవలు అందుకోనున్న మొదటి గ్రామంగా త్వరలోనే పేరు నమోదు కానుంది. ఈ మేరకు ఇప్పటికే గ్రామంలో ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నారుు. ఇంకా మిగిలిపోరుున చిన్నచిన్న పనులు పూర్తికాగానే రాష్ట్ర మంత్రులు గంగదేవిపల్లిలో ఇంటర్నెట్ వైఫై సేవలను ప్రారంభించనున్నారు.
‘స్వేచ్ఛ’గా..
ఎన్నో అంశాల్లో ప్రత్యేకతలు గీసుకొండ మండలంలోని గంగదేవిపల్లి సొంతం. గతంలో సీఎం కేసీఆర్ సందర్శించి గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించి అభివృద్ధి పనుల కోసం రూ.10 కోట్లను మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఇక గీసుకొండ పోలీసుల సౌజన్యంతో ఉచితంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. గంగదేవిపల్లిలో జరిగిన అభివృద్ధి పనులను పరిశీలించేందుకు పలు ఖండాల్లోని 86 దేశాల వారు సందర్శించారు. అలాగే, దేశంలోని వివిధ రాష్ట్రాలు, జిల్లాల వారు సందర్శనకు వస్తుండడంతో సందర్శకుల తాకిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో దేశ, విదేశాల నుంచి వచ్చే వారే కాకుండా స్థానికుల సౌకర్యం కోసం ఇక్కడ ఉచిత ఇంటర్నెట్ వైఫై సేవలందించేందుకు హైదరాబాద్‌కు చెందిన ‘స్వేచ్ఛ’ స్వచ్చంద సంస్థ బాధ్యులు ముందుకొచ్చారు. ఇందులో భాగంగా గ్రామపంచాయతీ సహకారంతో ఇంటర్‌నెట్ సదుపాయం కల్పించేందుకు గ్రామంలో ఏడు చోట్ల ఆంటెన్నా లు ఏర్పాటు చేశారు. ప్రతీ ఆంటెన్నా ద్వారా 200 మీటర్ల వరకు ఇంటర్‌నెట్ వైఫై సేవలను గ్రామస్తులకు ఉచితంగా అందనున్నారుు. స్మార్ట్‌ఫోన్లు కలిగిన గ్రామస్తులు ఇంటర్నెట్ సదుపాయాన్ని అన్‌లిమిటెడ్‌గా వినియోగించుకోవచ్చు.
మిగిలిపోరుున చిన్నచిన్న పనులు పూర్తికాగానే గంగదేవిపల్లిలో వైఫై ఇంటర్నెట్ సేవలను రాష్ట్ర మంత్రుల ద్వారా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా, సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన ఎరవెల్లిలో రిలయన్‌స కంపెనీ వారు గ్రామస్తులకు ఉచితంగా ఇంటర్నెట్ సేవలు అందించడానికి ముందుకొచ్చారు. అరుుతే, అందుకు సంబంధించిన పనులు ఇంకా కొనసాగుతున్నారుు. ఆలోపే గంగదేవిపల్లికి ఉచిత ఇంటర్నెట్ సేవలు ప్రారంభం కానున్నందున రాష్ట్రంలోనే తొలిసారి ఉచిత ఇంటర్నెట్ సౌకర్యం అందుకున్న గ్రామంగా గుర్తింపు లభించనుంది.