తిరుమల: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కుటుంబసభ్యులు, స్పీకర్, మంత్రులతో సహా బుధవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. కేసీఆర్ సతీమణి శోభ, కుమార్తె కవిత, అల్లుడు అనీల్, మనువళ్లతో కలసి ఆయన మహాద్వారం గుండా ఆలయం లోనికి వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఆలయ కార్యనిర్వాహణాధికారి దొండపాటి సాంబశివరావు, ఆలయ అర్చకులు తెలంగాణ ముఖ‍్యమంత్రికి దగ్గరుండి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శ్రీవారి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీస్సులు ఇవ్వడంతోపాటు స్వామివారి ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా రూ.5 కోట్లతో ప్రత్యేకంగా తయారు చేయించిన స్వర్ణాభరణాలను కేసీఆర్ కానుకగా సమర్పించారు.
ఇందులో రూ.3.70 కోట్లతో 14.200 కిలోల స్వర్ణసాలగ్రామ హారం , రూ.1.21 కోట్లతో 4.650 కిలోలతో ఐదు పేటల స్వర్ణకంఠాభరణం ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే స్వర్ణాభరణాలు తిరుమల వేంకటేశ్వరస్వామికి కానుకగా సమర్పించుకుంటానని కేసీఆర్ మొక్కుకున్న విషయం తెలిసిందే. బుధవారం ఉదయం ఆయన మొక్కు చెల్లించుకున్నారు.
(ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)