'సీఎం, మంత్రికి తెలియకుండానే బాక్సైట్ జీవో'
విజయవాడ: బాక్సైట్ తవ్వకాల జీవో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సంబంధిత శాఖ మంత్రికి తెలియకుండానే అటవీశాఖ జారీ చేసిందని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పేర్కొన్నారు. ఇదే విషయం మంత్రివర్గ సమావేశంలోనూ చర్చకు వచ్చిందని, ఇలాంటి లోపాలను సరిదిద్దుతామని ఆయన చెప్పారు.
విజయవాడ స్టేట్ గెస్ట్‌హౌస్‌లో మంగళవారం కేఈ కృష్ణమూర్తి విలేకరులతో మాట్లాడుతూ.. రెవెన్యూ శాఖలో అవినీతి ఉందని సీఎం గతంలో ఒకసారి అన్నారని, తరువాత ఇంకెప్పుడూ అనలేదన్నారు. రెవెన్యూ శాఖలో అవినీతి ఉందని ఓ మంత్రి మాట్లాడుతున్నారని, ఆయన మాదిరి సంబంధం లేని ఇతర శాఖల గురించి తాను మాట్లాడబోనని కేఈ చురకలు అంటించారు. రెవెన్యూ సిబ్బంది, అధికారులపై దాడులపట్ల తక్షణ చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించినట్లు చెప్పారు.
బ్యాంకు రుణాలకు పాస్‌బుక్‌లు అవసరం లేకుండా లోన్ చార్జ్ క్రియేషన్ మాడ్యూల్ను బ్యాంకులకు అనుసంధానిస్తామన్నారు. సర్వే పనులు వేగవంతం చేయడానికి సుమారు రూ.15 కోట్లతో 273 ఈటీఎస్ మిషన్లు రప్పిస్తామన్నారు. కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన ఈ-పంట కార్యక్రమాన్ని రాష్ట్రమంతటా అమలు చేస్తామన్నారు. మీ-సేవ కేంద్రాల ద్వారా 62 రెవెన్యూ సేవలను అందుబాటులోకి తెచ్చామని, అవసరంలేని 18 రకాల సేవలను తొలగించామన్నారు. 240 డిప్యూటీ సర్వేయర్ల పోస్టులు భర్తీ చేస్తామని ఉపముఖ్యమంత్రి వెల్లడించారు. సమావేశంలో చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్‌ఏ) అనిల్‌చంద్ర పునీత పాల్గొన్నారు.