కేటాయింపు ఎంతో!
కేటాయింపు ఎంతో!
Published Tue, Mar 14 2017 1:35 AM | Last Updated on Sat, Oct 20 2018 5:53 PM
జిల్లాలోని మెట్టప్రాంత సాగునీటి పథకాలు ఏళ్లతరబడి పెండింగ్‌లో ఉన్నాయి. డెల్టా ఆధునికీకరణ పనులు ముందుకుసాగడం లేదు. ఏటేటా నిర్మాణ వ్యయం పెరిగిపోతోంది. అయినా సర్కారు శ్రద్ధ కనబరచడం లేదు. ప్రతిఏటా అరకొర నిధులు విదిలిస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం 2017–18 బడ్జెట్‌ను శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ సారైనా పూర్తిగా నిధులు కేటాయిస్తుందా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
కొవ్వూరు : జిల్లాకు వచ్చిన ప్రతిసారీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ఎన్నికల్లో 15 సీట్లూ తమ పార్టీకి కట్టబెట్టిన ప్రజల రుణం తీర్చుకోలేనిదని, జిల్లాకు సముచిత ప్రాధాన్యం ఇస్తామని పదేపదే వల్లెవేశారు. కానీ ఈ మూడేళ్లలో ఆయన జిల్లాకు ప్రత్యేకంగా చేసిందేమీ లేదు. గత బడ్జెట్లలో జిల్లాకు ఒనగూరిన ప్రయోజనం శూన్యం. ఇంకా రెండేళ్లే సమయం ఉన్నందున ఈ సారైనా జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారా అని ప్రజలు నిరీక్షిస్తున్నారు.
జిల్లా రైతులపై శీతకన్ను
పొరుగు జిల్లాకు నీటిని తరలించేందుకు పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని రూ.1,340 కోట్లతో ఆగమేఘాలపై పూర్తిచేసిన ప్రభుత్వం జిల్లా రైతులపై కపట ప్రేమ చూపిస్తోంది. మెట్ట ప్రాంత పథకాలపై శీతకన్ను వేసింది. దీంతో రైతుల నుంచి సర్కారు తీరుపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.
‘తాడిపూడి’ వ్యయం రెట్టింపు
తాడిపూడి ఎత్తిపోతల పథకానికి నిధులు విడుదల కాకపోవడంతో అసంపూర్తిగా నిలిచింది. నిర్మాణ వ్యయంపై రూ.526.27 కోట్ల నుంచి రూ.1,042 కోట్లకు పెరిగింది. అధికారులు ఇటీవల కొత్త అంచనాలను తయారు చేసి ప్రభుత్వానికి పంపారు. ఇప్పటి వరకు రూ.488.11 కోట్లు ఖర్చు చేశారు. ఇంకా రూ.554 కోట్ల మేర నిధులు అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు. 2015 బడ్జెట్‌లో రూ.70కోట్లు కేటాయించారు. వినియోగం కూడా అంతంతమాత్రంగానే జరిగింది. దీంతో గత ఏడాది రూ.55 కోట్లు కేటాయించింది. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం భారీగా పెరగడంతో కొత్త అంచనాలకు అనుగుణంగా నిధులు విడుదల కావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఈ పథకం నిర్మాణ పనులకు ప్రభుత్వం ఏమేర ని««ధులు కేటాయిస్తుందో వేచిచూడాలి.
డెల్టా ఆధునికీకరణపైనా చిన్నచూపు
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి డెల్టా ఆధునికీకరణకు భారీ ఎత్తున నిధులు సమకూర్చారు. జిల్లాకు రూ.1,383.96 కోట్లు కేటాయించగా.. వీటిలో రూ.660 కోట్లు విలువైన పనులు మాత్రమే జరిగాయి. 2015–16 బడ్జెట్‌లో రూ.15కోట్లు, గత ఏడాది బడ్జెట్‌లో రూ.42.50 కోట్లు మాత్రమే జిల్లాకు కేటాయించారు. ఇంకా సుమారు రూ.720కోట్లకు పైగా పనులు చేపట్టాల్సి ఉంది. వీటికి అవసరమైన నిధులను ప్రభుత్వం కేటాయించడం లేదు. జిల్లాలో అత్యవసరంగా చేపట్టాలి్సన 188 పనులకు ప్రభుత్వం 92 జీవో జారీ చేసింది. దీనిలో 83 కాలువ పనులు, 105 డ్రెయిన్లుకు సంబంధించిన పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. వీటిలో 95 పనులకు గతంలో టెండర్లు పిలిస్తే కేవలం 32 పనులు పూర్తి చేశారు. ఇంకా 29 పనులు ప్రారంభం కాలేదు.
ఎర్రకాలువ ఆ«ధునికీకరణదీ అదే దుస్థితి
ఎర్రకాలువ ఆధునికీకరణ పనులకు రూ.104 కోట్లు కేటాయించారు. దీనిలో రూ.40 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. దీనికి 2015లో రూ.150 కోట్లు కేటాయించగా, గత ఏడాది రూ.2.60 కోట్లు కేటాయించారు. ప్రభుత్వం నిధుల విడుదల చేయకపోవడంతో నిర్మాణ వ్యయం ఏటేటా పెరుగుతోంది.
కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లలోనూ కోత
కొత్త వ్యవయసాయ కనెక్షన్లలోనూ జిల్లాపై ప్రభుత్వం పక్షపాతం ప్రదర్శిస్తోంది. గత ఏడాది జిల్లాకు 1,800 కనెక్షన్ల మంజూరు మాత్రమే లక్ష్యంగా ఇచ్చారు. దీంతో ఆరునెలల నుంచి కొత్త కనెక్షన్లు ఇవ్వడం లేదు. ఫలితంగా రైతులు అవస్థలు పడుతున్నారు. రాష్ట్రంలో విద్యుత్ మిగులులో ఉందని ప్రభుత్వం చెబుతున్నా వ్యవసాయ కనెక్షన్‌లు ఇవ్వకపోవడంతో రైతుల్లో అసంతృప్తి నెలకొంది. ఈ బడ్జెట్‌లోనైనా అవసరమైన వారందరికీ కనెక్షన్‌లు కేటాయిస్తారని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. డెల్టాలో ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటు, ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకానికి నిధుల కేటాయింపు ఎలా ఉటుందోననే అంశంపైనా సర్వత్రా ఆసక్తి నెలకొంది.
చింతలపూడిపై ఏదీ కనికరం
జిల్లాలోని మెట్టప్రాంత మండలాలకు సాగునీరు అందించే చింతలపూడి పథకం నిర్మాణ పనులపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. రూ.1,701 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పథకానికి భూసేకరణతో కలిపి కేవలం రూ. 719.4 కోట్లు ఖర్చు చేశారు. ఇంకా సుమారు రూ.982 కోట్లు అవసరం. 2015 బడ్జెట్‌లో రూ.22.03 కోట్లు, గత ఏడాది రూ.83 కోట్లు మాత్రమే కేటాయించింది. దీంతో పనులు మందకొడిగా సాగుతున్నాయి. అదనంగా మరో 2.8 లక్షల ఎకరాలకు నీరందించేందుకు రుపొందించిన రెండోదశకు ఇప్పటికీ టెండర్ల ప్రక్రియ పూర్తి కాలేదు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1,701 నుంచి రూ.4,909.80 కోట్లకు పెరిగింది. దీనికి సంబంధించి పరిపాలనా ఆమోదం లభించి ఏడు నెలులు కావస్తోంది. ఏడాది ఈ రెండో దశకు నిధులిస్తామని ఊరిస్తున్నా.. ఇప్పటివరకూ కేటాయించలేదు. ఈ బడ్జెట్‌లోనైనా నిధులు కేటాయించి పనులు పూర్తి చేస్తే పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంది.
Advertisement
Advertisement