పావని కేసులో కొత్త మలుపు
చిత్తూరు : జిల్లా వ్యాప్తంగా పలువురు మహిళల్ని మోసం చేసి బంగారు ఆభరణాలను కాజేసిన పావని కేసు కొత్త మలుపు తిరిగింది. చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చింటూకు పావని ఇచ్చినట్లు గుర్తించిన రూ.50 లక్షల నగదు, ముత్తూట్ ఫైనాన్స్ నుంచి 460 గ్రాముల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలను ఎస్పీ శ్రీనివాస్, కేసు దర్యాప్తు అధికారి గిరిధర్ శుక్రవారం వివరించారు.
చిత్తూరుకు చెందిన ఆటో డ్రైవర్ చరణ్ భార్య పావని 2013 నుంచి 2015 వరకు పలువురు మహిళలకు మాయ మాటలు చెప్పి వారి నుంచి సుమారు 8 కిలోల బంగారు ఆభరణాలు తీసుకుంది. వీటిని ఆమె చిత్తూరులోని ముత్తూట్ ఫైనాన్స్‌లో 244 ఖాతాల్లో కుదువ పెట్టి రూ.1.52 కోట్ల రుణం తీసుకుంది.
ఆభరణాలు ఇచ్చిన మహిళలు వాటిని వెనక్కు ఇవ్వాలని అడగడంతో పావని హరిదాస్ ద్వారా చింటూను ఆశ్రయించింది. చింటూ తనను బెదిరించాడంటూ ఓఎంఆర్ జ్యోత్స్న పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణలో వాస్తవాలన్నీ వెలుగు చూశాయి.
ఒత్తిళ్ల నుంచి తప్పించినందుకు పావని చింటూకు రూ.50 లక్షలు ఇచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇందులో రూ.45 లక్షలు బెంగళూరులోని చింటూకు పరిచయం ఉన్న వ్యక్తి వద్ద, మిగిలిన రూ.5 లక్షలు గంగనపల్లెలోని చింటూ నివాసంలో స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు లో ఉందని, మరిన్ని వివరాలను త్వరలో రాబడతామని ఎస్పీ పేర్కొన్నారు.
పావని కోసం గాలింపు
ఈ కేసులో పరారీలో ఉన్న పావని, ఆమె భర్త చరణ్ కోసం ప్రత్యేక బృందాలు తీవ్రంగా గాలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. త్వరలోనే ఇద్దరినీ అరెస్టు చేస్తామన్నారు.