కాంగ్రెస్కు గుడ్ బై: టీఆర్ఎస్లోకి ఖమ్మం ఎమ్మెల్యే
ఖమ్మం: ఎన్నికల్లో ఒటమి తర్వాత ఎమ్మెల్యేల ఫిరాయింపులు, సమిష్టి నాయకత్వ లోపాలతో తీవ్రమైన చిక్కుల్లో కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. అసెంబ్లీలో, మీడియా చర్చల్లో పార్టీ గొంతుకను బలంగా వినిపించే ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ కాంగ్రెస్ కు రాజీనమా చేశారు. సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరుతానని చెప్పారు. ఆదివారం సాయంత్రం ఖమ్మంలోని తన క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన ఆయన తన రాజీనామాను ప్రకటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ రాష్ట్రస్థాయి నాయకులపై అజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
'కాంగ్రెస్ పార్టీలో నన్ను అణగదొక్కే ప్రయత్నం చేశారు. అయినాసరే ఇన్నాళ్లూ మనసు చంపుకొని పార్టీ కోసం పాటుపడ్డా. నిజానికి సీఎం కేసీఆర్ రాష్ట్రాభివృద్ధి కోసం తీవ్రంగా పాటుపడుతున్నారు. కానీ ఆ విషయాలపై మా నాయకులు నాతో అబద్ధాలు చెప్పించారు' అని పువ్వాడ అజయ్ తాను పార్టీ మారబోతుండటాన్ని సంమర్థించుకున్నారు. ఖమ్మం నియోజకవర్గ అభివృద్ధితోపాటు జిల్లా వృద్ధిపథంలో ముందుండాలని కోరుకుంటున్నానన్న ఆయన.. సోమవారం హైదరాబాద్ లో సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు చెప్పారు.
సీపీఐ కురువృద్ధుడు పువ్వాడ నాగేశ్వర్ రావు తనయుడు, మమత వైద్య విద్యాసంస్థల అధినేత అయిన పువ్వాడ అజయ్ కుమార్ 2014లో కాంగ్రెస్ పార్టీలో చేరీచేరగానే ఎమ్మెల్యేగా గెలుపొందారు. జిల్లాలో ఆయనతోపాటు హస్తం గుర్తుపై గెలిచిన భట్టి విక్రమార్క(మధిర) కాంగ్రెస్ లో క్రియాశీలకంగా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఇప్పటికే కారెక్కగా, పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట రెడ్డి కొద్ది నెలల కిందట అనారోగ్యంతో చనిపోయారు. ఆయన మరణంతో అనివార్యమైన పాలేరు ఉప ఎన్నిక మరి కొద్ది రోజుల్లో జరుగుతుందనగా అజయ్ కాంగ్రెస్ నుంచి నిష్క్రమించడం గమనార్హం.
పువ్వాడ చేరికతో కాంగ్రెస్ నుంచి అధికారపార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల సంఖ్య పెరిగింది. ఇక టీడీపీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేల చేరికను స్పీకర్ మధుసూదనాచారి అధికారిక విలీనంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. వైఎస్సార్ సీసీ నుంచి గెలిచి, టీఆర్ ఎస్ లోకి ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్యేలు, కాంగ్రెస నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు స్పీకర్ వద్ద పెండింగ్ లో ఉన్నాయి.