గండిపడిన వీఆర్‌ఎస్ కాలువ
తలా పిడికెడు!
Published Fri, Aug 12 2016 11:01 PM | Last Updated on Mon, Sep 4 2017 9:00 AM
చేతులు మారుతున్న నామినేటెడ్ పనులు
నాయకులు... ఇంజినీరింగ్ అధికారులకూ పర్సంటేజీలు
లాభాలకోసం నాసిరకం పనులు
చంద్రన్నబాట, నీరుచెట్టులో నాణ్యత డొల్ల
సాక్షి ప్రతినిధి, విజయనగరం : ప్రభుత్వ పనులు ఎంతోమందికి కాసులు కురిపిస్తున్నాయి. పనులు మంజూరు చేయించిన నాయకులకు ముడుపుల రూపంలో మిగులుతున్నాయి. ఇంజినీరింగ్ అధికారులకు పర్సంటేజీలు వస్తున్నాయి. పనులు చేసే కాంట్రాక్టర్లకు లాభాలొస్తున్నాయి. ఇక పనులు నాసిరకంగా మిగులుతున్నాయి. నాణ్యతలేకుండా... మమ అనిపించేస్తున్న పనులు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. గతుకుల మయమైన చంద్రన్నబాటలు... నీటి ప్రవాహం లేకుండానే గట్లుతెగుతున్న కాలువ పనులు... ఈ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి.
చంద్రన్నబాట కింద వేసిన రోడ్లు: 320 కిలోమీటర్లు
ఖర్చు చేసిన నిధులు: సుమారు రూ. 106కోట్లు
నీరు చెట్టు కింద మంజూరైన పూడిక తీత, చెరువు గట్టు పనులు : 2703
మంజూరు చేసిన నిధులు : రూ. 180.75 కోట్లు
నీరు చెట్టు కింద మంజూరైన మదుములు, స్లూయిజ్ పనులు : 2,047
వాటి కోసం కేటాయించిన నిధులు : రూ. 144.94కోట్లు
జిల్లాలో ఇటీవల జరుగుతున్న పనులు నాసిరకానికి పరాకాష్టగా నిలుస్తున్నాయి. చంద్రన్నబాట పేరుతో నిర్మించిన సీసీరోడ్లు, నీరుచెట్టు పథకం ద్వారా చేపట్టిన కాలువ మరమ్మతు పనులు పూర్తిగా అక్రమాలకు అడ్డాగా మారాయి. చంద్రన్నబాటలు ఎంతలా పక్కదారి పట్టాయో నిగ్గుతేల్చాలంటూ లోకాయుక్త, విజిలెన్స్, క్వాలిటీ కంట్రోల్‌కు విస్తృతంగా ఫిర్యాదులు అందాయి. అంతేనా... నీరు చెట్టు పేరుతో కాలువల పూడికతీత పనులు, చెరువు గట్టు పటిష్ట పనులు పూర్తి చేయకుండానే చెల్లింపులు జరిగిపోయిన సంఘటనలూ.... తవ్వినమట్టిని లేఅవుట్‌లకు తరలించి అటు ప్రభుత్వం నుంచి, ఇటు రియల్టర్ల నుంచి పెద్ద ఎత్తున సొమ్ము చేసుకున్న వైనాలూ... ముదుములు, తూములు, స్లూయిజ్ పనుల్లో జరిగిన అక్రమాలూ బహిరంగ రహస్యాలుగా మారాయి.
అంతా అడ్డగోలే...
పనులు మంజూరైన దగ్గరి నుంచి చేపట్టిన వరకు అడ్డుగోలు కార్యక్రమమే నడిచింది. నామినేటెడ్ పద్ధతిలో మంజూరైన పనులను సంబంధిత సర్పంచ్‌లు, నీటి సంఘాల అధ్యక్షులు చేపట్టాల్సి ఉంది. కానీ, కొందరు అధికార పార్టీ నేతలు కష్టపడకుండానే సొమ్ము చేసుకోవాలన్న అత్యాశతో పనులను కాంట్రాక్టర్లకు అమ్మేశారు. ఉదాహరణకు రూ. లక్ష పని విలువైతే అందులో రూ. 10వేల నుంచి రూ. 15వేలు తీసుకుని కాంట్రాక్టర్లకు ఇచ్చేశారు. కొందరు ఆ పనులు చేపట్టకుండానే బిల్లులు చేసేసుకోవడంలో అధికారులు ఇతోథికంగా సాయపడ్డారు.
ఇంజనీర్లకు పర్సంటేజీలు
పనుల నాణ్యతను ప్రశ్నించకుండా ఉండేందుకు ఇంజినీరింగ్ అధికారులు పెద్ద మొత్తలో పనివిలువలో పర్సంటేజీలు లాగేస్తున్నారు. చంద్రన్న బాటలో వేసిన సిమెంట్ రోడ్ల కోసం 10నుంచి 12శాతం తీసుకుంటున్నారు. కొన్నిచోట్లైతే ఆ పర్సంటేజీల శాతం 15వరకు వెళ్లింది. అంటే రూ. లక్ష పని విలువలో రూ. 10వేల నుంచి రూ. 15వేల వరకు తీసుకుంటున్నారు. ఇక, ఇరిగేషన్ అధికారులైతే 15నుంచి 20శాతం వరకు తీసుకుంటున్నారు. ఈ లెక్కన పని విలువ రూ .లక్ష అయితే అందులో రూ. 15వేల నుంచి రూ. 20వేల వరకు వసూలు చేస్తున్నారు.
లాభాలకోసం... తూతూ మంత్రం పనులు
పనులు అమ్మినోళ్లకు 10నుంచి 15శాతం పర్సంటేజీ వెళ్లిపోతోంది. ఇంజినీరింగ్ అధికారులకు 10నుంచి 20శాతం పర్సంటేజీల కింద పోతోంది. ఇక పనులు చేసే కాంట్రాక్టర్ లబ్ధికోసం ఇష్టానుసారం పనులు చేస్తున్నారు. అడుగడుగునా ముడుపులు వారి పనుల్ని ప్రశ్నించనీయకుండా చేసింది. అలా అంచెలంచెలుగా జరిగిన అక్రమాలవల్ల కాలువలకు గండ్లు పడటం... రోడ్ల రాళ్లు తేలడం వంటివి చోటు చేసుకుంటున్నాయి. వాటిపై వెళ్తున్న ఫిర్యాదులపై లోకాయుక్త, విజిలెన్స్, క్వాలిటీ కంట్రోల్ ఏమేరకు స్పందిస్తుందన్నది వేచి చూడాలి.
Advertisement