మౌనిక కేసులో తండ్రే నిందితుడు
* లైంగికదాడికి యత్నం.. హత్య
* వీడిన మౌనిక హత్య మిస్టరీ
* నిందితుడి అరెస్టు
* 24 గంటల్లో ఛేదించిన పోలీసులు
కోరుట్ల/మేడిపల్లి : నవవధువు మౌనిక(19) హత్య కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. కన్నతండ్రే ఆమెపై లైంగికదాడికి యత్నించి ఆ విషయం ఎక్కడ బయటకు చెబుతుందోనని హత్యచేశాడని కోరుట్ల సీఐ రాజశేఖర్‌రాజు తెలిపారు. నిందితుడిని కోరుట్ల పోలీస్ స్టేషన్‌లో సోమవారం అరెస్ట్ చూపారు. సీఐ కథనం ప్రకారం..
మేడిపల్లి మండలం దేశాయిపేటకు చెందిన భూమల్ల నడిపిమల్లయ్య(45)కు భార్య లక్ష్మి, కుమార్తె మౌనిక(19), కుమారుడు మనోజ్(10) ఉన్నారు. ఉపాధి నిమిత్తం మల్లయ్య మూడేళ్లుగా దుబాయ్ వెళ్లొస్తున్నాడు. గత ఏప్రిల్ 4వ మౌనిక నిశ్చితార్థం మేనబావ మొత్కురావుపేటకు చెందిన మహేశ్‌తో జరిగింది. నిశ్చితార్థం జరిగినప్పుడు మల్లయ్య దుబాయ్‌లోనే ఉన్నాడు. అదే రోజు కుటుంబ సభ్యులు పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు. ఏప్రిల్ 27న మౌనిక పెళ్లి నిర్ణయించి నడిపి మల్లయ్యకు సమాచారం ఇచ్చారు.
దీంతో పెళ్లికి పదిరోజుల ముందే స్వగ్రామానికి వచ్చాడు. రూ.5 లక్షల వరకట్నం ఒప్పుకుని వివాహం జరిపించారు. అంతకుముందు మల్లయ్య భార్య లక్ష్మి ఇంటి నిర్మాణం కోసం రూ.4 లక్షలు అప్పుచేసింది. కూతురు పెళ్లికి మరో రూ.5లక్షలు అప్పు చేశారు. రూ.9లక్షల అప్పు కావడంతో మల్లయ్య భార్య, కూతురుతో చాలాసార్లు గొడవపడ్డాడు. ఈ క్రమంలో సోమవారం నుంచి ఆషాఢమాసం మొదలవుతుండడంతో మౌనికను పుట్టింటికి తీసుకురావాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.
శనివారం సాయంత్రం 5.30గంటలకు మల్లయ్య ద్విచక్రవాహనంపై మోత్కురావుపేటకు వెళ్లాడు. అక్కడే మద్యం తాగి కూతురును తీసుకుని స్వగ్రామానికి బయల్దేరాడు. గోవిందారం శివారుకు రాగానే రాత్రి 8:15 గంటలకు వర్షం కురిసింది. దీంతో రోడ్డుపక్కన ఉన్న మామిడి చెట్టు కింద కొద్దిసేపు ఆగారు. అక్కడికి సమీపంలో ఉన్న తన పొలం ఉండడంతో విద్యుత్ మోటార్ ఆన్ చేద్దామని వాన తగ్గాక కూతురును తీసుకుని వెళ్లాడు. అక్కడ విచక్షణ కోల్పోయిన మల్లయ్య ఒక్కసారిగా కూతురిపై లైంగిక దాడికి యత్నించాడు. నివ్వెరపోయిన మౌనిక తండ్రిని దూషిస్తూ ప్రతిఘటించింది. ఈ క్రమంలో తేరుకున్న మల్లయ్య లైంగిక దాడి విషయాన్ని కూతురు బయటకు చెబుతుందేమోనని భయపడ్డాడు. ఆమె చీరకొంగును గొంతుకు బిగించి హత్య చేశాడు.
కిడ్నాప్ కట్టుకథ..
మౌనికపై లైంగికదాడికి యత్నించి విఫలమై హత్య చేసిన మల్లయ్య ఆ తరువాత రాత్రి 9 గంటల ప్రాంతంలో దేశాయిపేటకు వెళ్లాడు. ఇద్దరు ముసుగు వ్యక్తులు మోటార్‌సైకిల్‌పై వచ్చి తనపై మత్తుమందు చల్లి కూతురును ఎత్తుకెళ్లారని గ్రామస్తులకు చెప్పాడు. ఆ వెంటనే గ్రామస్తులు మేడిపల్లి ఎస్సై రవికి సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు మౌనిక కోసం గాలించారు. నడిపి మల్లయ్యతో కలిసి మోతుకురావుపేట, దేశాయిపేట, గోవిందారం పరిసరాల్లో రాత్రంతా వెతికారు. తండ్రి ఫిర్యాదు మేరకు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. ఆదివారం ఉదయం మళ్లీ గాలించగా దేశాయిపేట శివారులోని నడిపి మల్లయ్య పొలం వద్ద మృతదేహం కనిపించింది.పట్టించిన సెల్‌ఫోన్..
మౌనికను ఇద్దరు ముసుగు దొంగలు ఎత్తుకెళ్లారని పోలీసులకు చెప్పిన నడిపి మల్లయ్య, తన సెల్‌ఫోన్ ఎక్కడో పోయిందని తెలిపాడు. అయితే కూతురు ఫోన్‌మాత్రం తండ్రివద్ద ఉండడంతో పోలీసులకు అనుమానంవచ్చింది. శనివారం రాత్రి మౌనిక ఆచూకీ కోసం వెతికే సమయంలో మృతదేహం ఉన్న తన పొలం వద్దకు కాకుండా గోవిందారం గుట్టల్లోకి దుండగులు వెళ్లారని చెప్పడం, ఇతర ప్రాంతాల్లో వెతికేలా పోలీసులను మళ్లించడంతో ఈ అనుమానం మరింత బలపడింది.
మౌనిక అంత్యక్రియలు పూర్తయిన వెంటనే ఆదివారం రాత్రి నడిపి మల్లయ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలితో విచారణ చేశారు. దీంతో నిందితుడు అనిన విషయాలు చెప్పాడు. తానే మౌనికపై లైంగికదాడికి యత్నించి హత్య చేసినట్లు అంగీకరించాడు. సోమవారం కోరుట్ల సీఐ రాజశేఖర్‌రాజు, ఎస్సై రవి నిందితుడిని అరెస్ట్ చూపారు. కేసు దర్యాప్తులో చురుకుగా వ్యవహరించిన హెడ్‌కానిస్టేబుల్ తిరుపతి, కానిస్టేబుల్ శ్రీనివాస్‌ను సీఐ అభినందించారు.