హత్య చేసి కాల్చేశారు..?
►అడ్డకొండలో వెలుగులోకి వచ్చిన వైనం
►మృతుడు నారేవారిపల్లెకు చెందిన ఆటోడ్రైవర్
►దంపతుల మధ్య విభేదాలే చావుకు కారణమా?
రామసముద్రం : రామసముద్రం అడ్డకొండ ప్రాంతంలోని మంగలోని మిద్దె సమీపంలో కాల్చివేసి బొగ్గుల గూడుగా ఉన్న గుర్తుతెలియని శవం వెలుగులోకి వచ్చింది. కట్టెల కోసం వెళ్లిన నారేవారిపల్లె గ్రామస్తులు ఇది గుర్తించారు. సమాచారమివ్వడంతో పుంగనూరు రూరల్ సీఐ రవీంద్ర, ఎస్‌ఐ సోమశేఖర్ తమ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. అయితే శవం బాగా కాలిపోయి గుర్తుపట్టని విధంగా ఉండటం, మృతదేహాన్ని జంతువులు పీక్కుతిన్న ఆనవాళ్లు ఉండడంతో ఎవరనేది తెలియరాలేదు. అయితే వారం క్రితం అదృశ్యమైన నారేవారిపల్లెకు చెందిన వెంకట్రమణ కుమారుడు బి.ఆదెప్ప(40) మృతదేహమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
సంఘటన స్థలంలో పడి ఉన్న వెదురు కట్టె ఆధారంగా మృతుడిని కుటుంబ సభ్యులు గుర్తించి భోరున విలపించారు. ఆదెప్ప ఆటో డ్రైవర్‌గా ఉంటూ కౌలుకు వ్యవసాయం చేసేవాడు. కుటుంబంలో భార్యాభర్తల నడుమ కొంతకాలంగా గొడవలు ఉన్నాయని గ్రామస్తులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆదెప్ప భార్య రత్నమ్మపై అనుమానం వ్యక్తం చేశారు. ఉదయం అడ్డకొండలో శవం ఉందని ప్రచారంలోకి రావడంతో మృతుడి భార్య పరారైనట్లు తెలుస్తోంది. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. సీఐ రవీంద్ర కేసు నమోదు చేశారు. దర్యాప్తులో వాస్తవాలేమిటో తెలియాల్సి ఉంది.