కొల్లేరుకు తూట్లు
కొల్లేరుకు తూట్లు
Published Sat, Jul 23 2016 6:15 PM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM
కొల్లేరును మింగేస్తున్నారు. సుప్రీంకోర్టు నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. అధికార పార్టీనా మజాకా అంటూ హడలెత్తిస్తున్నారు. పచ్చ చొక్కాలంటూ ప్రతాపం చూపుతున్నారు. అడ్డుకోవాల్సిన అటవీశాఖ అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. అక్రమంగా చేపల చెరువులు తవ్వుతున్నారు.
కైకలూరు :
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, కైకలూరు బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ నియోజకవర్గంలో కొల్లేరు అభయారణ్యం కొవ్వొత్తిలా తరిగిపోతోంది. నిబంధనలకు లోబడి చెరువులు తవ్వుకోవాలని, లేదంటే తనకు మాటోస్తుందని మొత్తుకుంటున్నా టీడీపీ నేతలు మంత్రి మాటను సైతం లెక్కచేయడం లేదు. గురువారం మండవల్లి మండలం పులపర్రు, చింతపాడు కొల్లేరు అభయారణ్య పరిధిలో ఏకధాటిగా అక్రమ చెరువుల తవ్వకాలను పట్టపగలే ప్రారంభించారు. అడ్డువచ్చిన అటవీశాఖాధికారులను లెక్కచేయలేదు.
కొల్లేరులో చట్టాలు వర్తించవా..
కొల్లేరు అభయారణ్య పరిరక్షణ చట్టం జీవో నంబరు 120 ప్రకారం కనీసం అగ్గిపెట్టె తీసుకువెళ్ళినా నేరం. అటువంటిది ప్రభుత్వ చీఫ్‌విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆటపాక పక్షుల కేంద్రం వద్ద చట్టాలను ధిక్కరించి కోమటిలంక రోడ్డును దగ్గరుండి వేయించారు. తమపై దాడి చేశారంటూ అటవీశాఖ అధికారులు కైకలూరు టౌన్ స్టేషన్‌లో చేసిన ఫిర్యాదు అధికార బలం సాక్షిగా బుట్ట దాఖలయ్యింది. తర్వాత చింతపాడు వద్ద ఎగనమిల్లి రోడ్‌ను దగ్గరుండి వేయించారు. ఇదే దారిలో స్థానిక పచ్చనేత రెచ్చిపోతున్నాడు. కొద్ది రోజుల్లో కొల్లేటికోటలో మరో 17 ఎకరాలు మంచినీటి చెరువు పేరుతో తవ్వడానికి సిద్ధమవుతున్నారు.
అటవీశాఖ ఉన్నట్లా.. లేనట్లా..
ప్రతి అక్రమ చెరువు తవ్వకం వద్దకు అటవీశాఖ క్షేత్ర స్థాయి అధికారులు రావడం, ప్రేక్షక పాత్ర వహించడం పరిపాటిగా మారింది. కళ్ళ ఎదుట పొక్లయిన్‌తో అక్రమ చెరువులు తవ్వుతుంటే ఆపలేని అటవీశాఖ సిబ్బంది ఎందుకు వెళ్ళడం అని పర్యావరణ ప్రేమికులు విమర్శిస్తున్నారు. అంతా అయిపోయాక నలుగురు పెద్దలపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసి చేతులు దులుపుకుంటున్నారు. పై స్థాయిలో అటూ అటవీఅధికారులు, ఇటు పోలీసులు అధికార ప్రజాప్రతినిధులు సిపార్సులకు లొంగి కింద స్థాయి అటవీసిబ్బందిని బలి చేస్తున్నారని పలువురు సిబ్బంది బాధపడుతున్నారు. ఆడవారు దాడి చేస్తున్నా తమకు రక్షణ లేదని మదనపడుతున్నారు.
చింతపాడులో గత నెల కొల్లేరు అభయారణ్యంలో రెండు మంచినీటి చెరువుల పేరుతో గ్రామ మహిళలను ముందుపెట్టి తవ్వేశారు. గురువారం మళ్ళీ మహిళలను అడ్డుపెట్టి మరో చెరువును పొక్లయిన్‌తో తవ్వుతున్నారు. ఇదిలా ఉంటే పులపర్రు మంచినీటి చెరువు పక్కన కొల్లేరు అభయారణ్యం లో సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో మంచినీటి చెరువు పేరుతో చెరువు పనులు మొదలు పెట్టారు. అటవీశాఖ సెక్షన్ ఆఫీసరు గంగారత్నం, బీటు ఆఫీసరు వెంకన్న, సిబ్బందితో వెళితే కనీసం లోపలకు వెళ్ళనివ్వలేదు. మీడియాను సైతం అడ్డుకున్నారు. పులపర్రులో మంత్రికి ముఖ్య అనుచరుడినని చెప్పుకునే వ్యక్తి చెరువు తవ్వకంలో పచ్చనేతకు అండగా నిలిచారు. ఏవరైన పనులు ఆపడానికి వస్తే రెచ్చిపోవాలని మహిళలకు బోధిస్తున్నారు.
ఉన్నతాధికారులకు నివేదించాం...
పట్టపగలు అక్రమ చేపల చెరువుల తవ్వకంపై అటవీశాఖ ఎసీఎఫ్ వినోద్‌కుమార్‌ను వివరణ కోరగా,∙షరా మామూలుగానే ఉన్నతాధికారులకు వివరించామని తెలిపారు. ఇక్కడ జరిగిన విషయాన్ని లిఖిత పూర్వకంగా పైస్థాయి అధికారులకు తెలియచేస్తామన్నారు.
Advertisement
Advertisement