kikaluru
-
సీఎం జగన్ పై నమ్మకంతోనే పార్టీలో చేరాం
సాక్షి, కైకలూరు(కృష్ణా) : జిల్లాలో కొల్లేరు పరివాహక ప్రాంత ప్రజలు సీఎం జగన్మోహన్రెడ్డిపై పూర్తి నమ్మకంతోనే పార్టీలో చేరుతున్నారని కొల్లేరు సంఘ జిల్లా అధ్యక్షుడు నబిగారి రాంబాబు స్పష్టం చేశారు. కొల్లేరులో చెరువుల సాగు ఇకపై చేయనివ్వబోమని, భయపెట్టిన కారణంగా వైఎస్సార్ సీపీలో అక్కడ ప్రజలు చేరుతున్నారంటూ టీడీపీ నేతలు ఆదివారం చేసిన వ్యాఖ్య లను కొల్లేరు పెద్దలు ఖండించారు. కైకలూరులోని వైఎస్సార్ సీపీ క్యాంపు కార్యాలయం వద్ద సోమవారం సంఘ నాయకుడు రాంబాబు మాట్లాడుతూ ఎన్నికల ముందు జరిపిన పాదయాత్ర సమయంలో సీఎం జగన్మోహన్రెడ్డి రెగ్యులేటర్ నిర్మాణంపై స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు. ఇటీవల అసెంబ్లీలో స్థానిక పార్టీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) కొల్లేరు సమస్యలను ప్రస్తావించారన్నారు. పార్టీ చేరికలపై మాపై ఎవరి ఒత్తిళ్లు లేవన్నారు. మా ప్రాంతానికి చెందిన టీడీపీ నాయకుడి పల్లకీ మోస్తే మాకు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ఆ నాయకుడు వైఎస్సార్ సీపీపై లేనిపోని ఆరోపణలు మానుకోవాలని సూచించారు. వివిధ కొల్లేరు సంఘ నాయకులు జల్లూరి వెంకన్న, బలే చిరంజీవి, జయమంగళ కాసులు, సైదు ఆనందబాబు, ఘంటసాల సీతారామాంజనేయులు, జయమంగళ వీర్రాజు పాల్గొన్నారు. కొల్లేరులో టీడీపీ, బీజేపీ బంధం రాష్ట్రంలో బీజేపీ, టీడీపీ వ్యతిరేకంగా ఉన్నట్లు కనిపిస్తున్న కొల్లేరులో మాత్రం కలసి పనిచేస్తున్నాయని కొల్లేరు సంఘ అధ్యక్షుడు రాంబాబు ఆరోపించారు. బీజేపీ సభ్యత్వం తీసుకోవాలని టీడీపీ నాయకులు కొల్లేరు ప్రజలకు చెప్పడం మైత్రికి నిదర్శనమని అన్నారు. -
వాళ్లకి చట్టాలు చుట్టాలురా...
సాక్షి, కైకలూరు : కుప్పుస్వామి : ఒరే.. నాగరాజు ఏంట్రా.. అంత తదేకంగా పేపరు చదువుతున్నావు.. ఏమైనా విశేషముందా.. ఉంటే.. కాస్త చెప్పరా.. నాగరాజు : స్వామి.. నాకు తెలియక అడుగుతా.. ఎప్పుడూ, ప్రజల పక్షాననిలిచి, ఉద్యమాలు చేస్తున్న ప్రతిపక్ష నేతలపైనే పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.. పేపర్లో రోజూ ఎక్కడో ఓ చోట ఇవే వార్తలు.. ఇదెక్కడి పోలీసు న్యాయమో.. అర్థం కావడం లేదు.. స్వామి : నాగరాజు.. నాకు చదువు అబ్బక పోయినా.. కాస్త లోకజ్ఞానం ఉందిరా.. ఆ అనుభవంతో చెబుతున్నా.. విను.. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకుల మాట చెల్లుబాటు ఆవుతుంది.. ఇదేమి కొత్తగా కనిపెట్టిన విషయం కాదు.. నేరం చేసిన వారి ఆర్థిక స్థోమత, సామాజిక నేపథ్యం, రాజకీయ విధేయతలను అనుసరించే పోలీసుల వైఖరి ఉంటుందనడంలో ఆశ్చర్యం లేదురా.. చట్టాలు వాళ్లకి చుట్టాలే. మనం వాళ్లను నిందించకూడదు.. పాలకులను నిందించాలి.. నాగరాజు : స్వామీ.. ఎక్కడో ఎందుకు.. మన దగ్గర్లో చింతపాడు గ్రామానికి వచ్చిన చింతమనేని అటవీశాఖ అధికారిని ఏమన్నాడు.. దమ్ముంటే రారా.. అంటూ పత్రికల్లో రాయలేని పచ్చి బూతులు తిట్టాడు.. అటవీశాఖ అభయారణ్యంలో ఏకంగా తారురోడ్డు వేయించాడు.. ఇప్పటి వరకు ఆయనపై యాక్షన్ లేదు.. స్వామి : ఓరేయ్.. పిచ్చోడా.. చింతమనేని ఎవరూ.. ప్రభుత్వ చీఫ్‌విప్.. టీడీపీ ఎమ్మెల్యే.. సంపన్నుడు.. అలాంటి వారిపై కేసులు నమోదైనా శిక్షలు పడవని ఖాకీలకు ముందే తెలుసురా... నాగరాజు : నిజమే స్వామి.. చింతమనేనిపై అటవీ శాఖాధికారులు మౌనం వహించారు. కేసు విచారణ కూడా లేదు.. అదే సమయంలో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానీపై సివిల్ వివాదంలో కేసు నమోదైంది.. బందరులో ఎక్సైజ్ అధికారుల విధులకు ఆటంకం మరో నేతపై కలిగించారని కేసులు పెట్టారు. ఇదేంటి.. అధికార పక్షానికి ఓ చట్టం.. ప్రతిపక్షానికి ఓ చట్టమా.. చెప్పు.. కృపావరం : స్వామీ.. మీరిన్ని చెబుతున్నారు.. కానీ అసలు ఖాకీలకే రక్షణ లేదు.. అధికారం అండతో వాళ్లపైనే దాడులు జరుగుతున్నాయి.. కుప్పు స్వామి : ఇదేక్కడి వింత.. మనకు రక్షణ కల్పించాల్సిన పోలీసుకే రక్షణ లేదంటావేంటి కృపావరం.. వివరంగా చెప్పు.. కృపావరం : చెబుతాను.. వినండి.. మన ప్రాంతంలో జరిగిన సంఘటలే ఇవి.. గుమ్మళ్ళపాడులో కోడిపందేలను అడ్డుకోడానికి వెళితే ఇద్దరు కానిస్టేబుళ్లను చితకబాదారు. కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానం వద్ద వాహనాలను లోపలకి అనుమతించడం లేదని గ్రామపెద్ద ఏకంగా కానిస్టేబుల్ చొక్కానే చింపేశాడు. పులపర్రులో కులాలు వేరైన ఇద్దరు ప్రేమికులకు రక్షణ కల్పించడానికి వెళ్లిన పోలీసులను అధికార అండ కలిగిన పెద్దలు వారినే నిర్భందించారు.. ఇవే కాదు.. అనేక సంఘటనలు ఉన్నాయి.. బుజ్జిబాబు : (పక్కనే కూర్చుని అంతా వింటున్న వ్యక్తి) పెద్దలందరికీ ఓ నమస్కారం.. అధికారం ఎంత బరి తెగించిందో నేనూ.. ఓ మాట చెబుతా.. కృపావరం : బుజ్జిబాబు.. అరే.. నేను నిన్ను చూడలేదు.. చెప్పు.. చెప్పు.. బుజ్జిబాబు : చింతమనేని సంగతి కాస్త పక్కన పెడదాం.. మన టీడీపీ అభ్యర్థి ఏం చేశారో తెలుసా.. మొన్నీమధ్య అటవీశాఖాధికారులు కొల్లేరు అభయారణ్యంలోకి ట్రాక్టరుపై తరలిస్తున్న ఆక్వా పరికరాలను సీజ్ చేసి కైకలూరు అటవీశాఖ కార్యాలయానికి తరలించారు.. అంతే ఆయనకు కోపం వచ్చింది. ఓ 60 మందితో వెళ్లి డాక్టరు, డ్రైవర్‌ను విడిపించుకుని వెళ్లిపోయారు.. కేసు పెట్టినప్పటికీ ఆయనను అడిగే వాడే లేడు.. ఇదేనండి అధికారం అంటే.. శంకరరావు : నిజమే నబ్బా.. పోలీసులు తీరు ఒక్కో సమయంలో ఒక్కో తీరుగా ఉంటుంది.. మొన్న విశాఖ ఎయిర్‌పోర్టులో ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై ఓ అగంతకుడు కత్తితో దాడి చేశాడు. పాపం.. రక్తం కారుతూ బాధతో జగన్ హైదరాబాదు వెళ్లారు.. ఇంతలోనే టీవీల్లో కత్తి దాడి ఆయన అభిమానే చేశాడని ప్రకటన... ఏ పార్టీ అభిమానైనా కత్తితో దాడి చేస్తాడా.. గుండెళ్లో పెట్టుకుని పూజిస్తాడు కాని.. జానీ : అవునండీ.. రాష్ట్రంలో మరీ దాడులు పెరిగాయి.. శ్యాంబాబు : (నాగరాజు కొడుకు) : నాన్నో ఓట్లు అడగడానికి ఎవరో వచ్చారు... నీ గురించి అడుగుతున్నారు. బేగా రా.. అంటూ పిలవడంతో అందరూ అక్కడి నుంచి నిష్క్రమించారు. -
పంచాయతీ నిధులు పక్కదారి.. సర్పంచ్ చేతివాటం..
సాక్షి, కైకలూరు: పంచాయతీల పాలన గాడి తప్పుతోంది. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే ఆలోచనలో కొందరు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ప్రజల సొమ్మును కాజేస్తున్నారు. పంచాయతీల సర్వతోముఖాభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేస్తున్న నిధులు పక్కదారి పడుతున్నాయి. అక్రమార్కులకు అధికారం అండదండలు ఉండటంతో నిధుల దుర్వినియోగం వెలుగులోకి రావటం లేదు. దీనికి తోడు ప్రభుత్వాధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా లక్షల నిధులు స్వాహ అవుతున్నాయి. జిల్లా శివారు కైకలూరు నియోజకవర్గంలో పలు పంచాయతీల్లో నిధులు గోల్మాల్ అవుతున్నాయి. పన్నుల రూపంలో ప్రజలు చెల్లించిన నగదును పంచాయతీకి జమ చేయకపోవడం, చేయని పనులను చేసినట్లు చిత్రీకరించి బిల్లులు పొందడం, కాంట్రాక్టు సిబ్బంది జీతాలు పేరుతో నగుదు కాజేయడం, జిల్లా అధికారుల ఖర్చుల పేరుతో నకిలీ బిల్లులతో నగదు పొందడం వంటి పలు రూపాల్లో పంచాయతీ సొమ్మును కొందరు దిగమింగుతున్నారు. పలువురు సర్పంచ్‌లకు అధికార పార్టీ నేతల అండదండలు పుష్పలంగా ఉండటంతో నిధులను పక్కదారి పట్టిస్తున్నారు. జిల్లా అధికారులు విచారణ పేరుతో కాలయాపన చేస్తుండటంతో అక్రమార్కుల పదవీ కాలం ముగిస్తోంది. భుజబలపట్నం పంచాయతీలో నిధులు స్వాహా కైకలూరు మండలంలో భుజబలపట్నం మేజర్ పంచాయతీలో ఒకటి. పంచాయతీల వనరుల రూపంలో ఏడాదికి రూ.10 లక్షల ఆదాయం వస్తుంది. పంచాయతీలో జరిగే అవకతవకలపై గ్రామానికి చెందిన మంతెన రామ్మూర్తిరాజు పదేళ్ల కాలంలో జరిగిన నిధుల వినియోగంపై సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు కోరారు. దీంతో అసలు విషయాలు వెలుగుచూశాయి. పంచాయతీ నుంచి డీఎల్పీవో వాహనానికి రూ.17,000 చెల్లించినట్లు ఉంది. ఇవే కాకుండా పలు బిల్లుల్లో తేడాలు ఉన్నాయి. ఈ ఘటనపై మచిలీపట్నం డీఎల్పీవో విచారణ చేసి ఈ నెల 11న పంచాయతీ నిధులు రూ.1,63,516.. ఆర్థిక సంఘం నిధులు రూ.1,39,074 వెరసి రూ.3,02, 590 దుర్వునియోగం అయినట్లు గుర్తించారు. సర్పంచ్‌లకు నోటీసులు భుజబలపట్నం పంచాయతీ నిధుల దుర్వినియోగంపై మాజీ సర్పంచ్‌లకు, అధికారులకు పంచాయతీశాఖ జిల్లా అధికారులు నోటీసులు పంపారు. వీరిలో పంచాయతీ కార్యదర్శి వి.రామరాజు రూ.1,51,295, మాజీ సర్పంచ్ సయ్యపురాజు గుర్రాజు రూ.23,039, మరో మాజీ సర్పంచ్ బి.రామలక్ష్మీ రూ.1,04,087, పూర్వ పంచాయతీ ప్రత్యేకాధికారి హెప్సిబారాణి రూ.24,169 నిధులను చెల్లించాలని నోటీ సులు పంపారు. వీరిలో పంచాయతీ కార్యదర్శి వి.రామరాజు ఇటీవల మరణించడంతో వారి కుటుంబ సభ్యులు సదరు నగదును చెల్లించాలని నోటీసులో సూచించారు. ఇవే కాకుండా కైకలూరు నియోజకవర్గ పరిధిలో కైకలూరు, కలిదిండి, గుర్వాయిపాలెం, కోరుకొల్లు, వైవాక, దేవపూడి పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై విచారణలు జరిగాయి. సొమ్ము రికవరీ చేస్తాం భుజబలపట్నం పంచాయతీలో రూ.3,02,590 నిధులు దుర్వినియోగం అయినట్లు మచిలీపట్నం డీఎల్పీవో విచారణలో తేలింది. అందుకు బాధ్యలైన అందరికి నోటీసులు అందించడం జరిగింది. సదరు వ్యక్తుల నుంచి నగదును రీకవరీ చేసుకుంటాం. పంచాయతీ రికార్డులు ఖచ్చితంగా పారదర్వకతతో నిర్వహించాలి. – అరుణ్‌కుమార్, ఈవోపీఆర్డి, కైకలూరు. -
అడుగుపెడితే చచ్చిపోతాం...!
కొల్లేటికోట (కైకలూరు) : కొల్లేరు అభయారణ్యంలో మంచినీటి చెరువుల పేరుతో సాగుతున్న అక్రమ తవ్వకాలకు అంతు ఉండటం లేదు. నిన్నటి వరకు మండవల్లి మండలానికి పరిమితమైన తవ్వకాలు ఇప్పుడు కైకలూరు మండలానికి పాకింది. కొల్లేటికోటలో అభయరణ్యపరిధిలో సుమారు 60 ఎకరాలు చెరువు పనులను శుక్రవారం పొక్లయిన్‌తో ప్రారంభించారు. ఇప్పుడు అటవీ సిబ్బందిని అడ్డుకోవడానికి అక్రమార్కులు కొత్త రూట్ కనిపెట్టారు. అధికారులు ఆ పనుల వద్దకు వెళ్లకుండా టెంట్లు వేసి మహిళలను ముందు వరసలో పెట్టారు. అటవీశాఖ డీఆర్వో జి.ఈశ్వరరావు, సిబ్బందితో లోపలకి వెళ్లడానికి ప్రయత్నించారు. ఎవరినీ వెళ్లనివ్వలేదు. రెండు నెలల వ్యవధిలో కొల్లేరు ప్రాంతంలో గుమ్మళ్ళపాడు, చింతపాడు, పులపర్రు గ్రామాల్లో తాగునీటి చెరువుల పేరుతో చెరువులను తవ్వేశారు. అన్నింటా ఒకటే సూత్రం మహిళలను అడ్డుపెట్టడం. కొల్లేటికోట విషయానికి వస్తే మరీ అడ్డగోలు వ్యవహారంగా కనిపిస్తుంది. ఇప్పటికే మంచినీటి అవసరాల నిమిత్తం 30 ఎకరాల తాగునీటి చెరువు ఉంది. దీనికి అధనంగా మరో 60 ఎకరాలు తవ్వుతున్నారు. విస్తీర్ణం మరింతగా పెరిగే అవకాశం ఉంది. పురుగుమందు డబ్బాలతో బెదిరింపు.. కొల్లేటికోటలో మహిళలు మరో అడుగు ముందుకేశారు. అధికారులు, మీడియా లోపలకి వెళితే పురుగుమందు తాగి ఆత్మహత్యలు చేసుకుంటామని బెదిరించారు. పలువురు మహిళల చేతుల్లో పురగుమందు డబ్బాలు ఉన్నాయి. పులపర్రు, చింతపాడు గ్రామాల మాదిరిగా మహిళలను ముందు వరసలో ఉంచి, సూత్రధారులు వారి వెనుక ఉండి కథ నడిపిస్తున్నారు. కనీసం లోపల జరిగే తంతును ఫొటోలు తీయడానికి వెళ్ళిన మీడియాను అనుమతించలేదు. షరామమూలుగానే కైకలూరు రూరల్ స్టేషన్లో ఓ ఆరుగురు పెద్దలపై అటవీశాకాధికారులు ఫిర్యాదు చేసి చేతులు దులుపుకున్నారు. కొల్లేరులో చట్టాలు వర్తించవా..? కైకలూరు బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. ప్రభుత్వ అనుమతులు తీసుకునే చెరువులు తవ్వాలని ఆయన పదేపదే చెబుతున్నా,అక్రమ చేపల చెరువుల తవ్వకాలు రోజురోజుకు శృతిమించుతున్నాయి. అధికారపక్షం అండతో నియోజకవర్గ స్థాయి నాయకుడు తెరవెనుక మొత్తం కథ నడుపుతున్నాడు. రెండు నెలలుగా సుప్రీం కోర్టు తీర్పుకు కొల్లేరులో తూట్లు పడుతున్న జిల్లా స్థాయి అధికారులు కొ ల్లేరుపై కనీసం కన్నెత్తి చూడటం లేదు. చట్టాలను లెక్కచేయకుండా తవ్విస్తున్న సదరు పచ్చనేతకు ఓ ఏడాది పాటు చేపల చెరువు లీజు ఫ్రీగా ఇవ్వలనే కండీషన్ పెట్టినట్లు తెలుస్తుంది. కొల్లేరులో అక్రమ పరంపర కొనసాగుతుందా. అడ్డుకట్ట పడుతుందా అనేది అంతుచిక్కని ప్రశ్నంగా మారింది. -
కొల్లేరుకు తూట్లు
కొల్లేరును మింగేస్తున్నారు. సుప్రీంకోర్టు నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. అధికార పార్టీనా మజాకా అంటూ హడలెత్తిస్తున్నారు. పచ్చ చొక్కాలంటూ ప్రతాపం చూపుతున్నారు. అడ్డుకోవాల్సిన అటవీశాఖ అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. అక్రమంగా చేపల చెరువులు తవ్వుతున్నారు. కైకలూరు : రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, కైకలూరు బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ నియోజకవర్గంలో కొల్లేరు అభయారణ్యం కొవ్వొత్తిలా తరిగిపోతోంది. నిబంధనలకు లోబడి చెరువులు తవ్వుకోవాలని, లేదంటే తనకు మాటోస్తుందని మొత్తుకుంటున్నా టీడీపీ నేతలు మంత్రి మాటను సైతం లెక్కచేయడం లేదు. గురువారం మండవల్లి మండలం పులపర్రు, చింతపాడు కొల్లేరు అభయారణ్య పరిధిలో ఏకధాటిగా అక్రమ చెరువుల తవ్వకాలను పట్టపగలే ప్రారంభించారు. అడ్డువచ్చిన అటవీశాఖాధికారులను లెక్కచేయలేదు. కొల్లేరులో చట్టాలు వర్తించవా.. కొల్లేరు అభయారణ్య పరిరక్షణ చట్టం జీవో నంబరు 120 ప్రకారం కనీసం అగ్గిపెట్టె తీసుకువెళ్ళినా నేరం. అటువంటిది ప్రభుత్వ చీఫ్‌విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆటపాక పక్షుల కేంద్రం వద్ద చట్టాలను ధిక్కరించి కోమటిలంక రోడ్డును దగ్గరుండి వేయించారు. తమపై దాడి చేశారంటూ అటవీశాఖ అధికారులు కైకలూరు టౌన్ స్టేషన్లో చేసిన ఫిర్యాదు అధికార బలం సాక్షిగా బుట్ట దాఖలయ్యింది. తర్వాత చింతపాడు వద్ద ఎగనమిల్లి రోడ్‌ను దగ్గరుండి వేయించారు. ఇదే దారిలో స్థానిక పచ్చనేత రెచ్చిపోతున్నాడు. కొద్ది రోజుల్లో కొల్లేటికోటలో మరో 17 ఎకరాలు మంచినీటి చెరువు పేరుతో తవ్వడానికి సిద్ధమవుతున్నారు. అటవీశాఖ ఉన్నట్లా.. లేనట్లా.. ప్రతి అక్రమ చెరువు తవ్వకం వద్దకు అటవీశాఖ క్షేత్ర స్థాయి అధికారులు రావడం, ప్రేక్షక పాత్ర వహించడం పరిపాటిగా మారింది. కళ్ళ ఎదుట పొక్లయిన్‌తో అక్రమ చెరువులు తవ్వుతుంటే ఆపలేని అటవీశాఖ సిబ్బంది ఎందుకు వెళ్ళడం అని పర్యావరణ ప్రేమికులు విమర్శిస్తున్నారు. అంతా అయిపోయాక నలుగురు పెద్దలపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసి చేతులు దులుపుకుంటున్నారు. పై స్థాయిలో అటూ అటవీఅధికారులు, ఇటు పోలీసులు అధికార ప్రజాప్రతినిధులు సిపార్సులకు లొంగి కింద స్థాయి అటవీసిబ్బందిని బలి చేస్తున్నారని పలువురు సిబ్బంది బాధపడుతున్నారు. ఆడవారు దాడి చేస్తున్నా తమకు రక్షణ లేదని మదనపడుతున్నారు. చింతపాడులో గత నెల కొల్లేరు అభయారణ్యంలో రెండు మంచినీటి చెరువుల పేరుతో గ్రామ మహిళలను ముందుపెట్టి తవ్వేశారు. గురువారం మళ్ళీ మహిళలను అడ్డుపెట్టి మరో చెరువును పొక్లయిన్‌తో తవ్వుతున్నారు. ఇదిలా ఉంటే పులపర్రు మంచినీటి చెరువు పక్కన కొల్లేరు అభయారణ్యం లో సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో మంచినీటి చెరువు పేరుతో చెరువు పనులు మొదలు పెట్టారు. అటవీశాఖ సెక్షన్ ఆఫీసరు గంగారత్నం, బీటు ఆఫీసరు వెంకన్న, సిబ్బందితో వెళితే కనీసం లోపలకు వెళ్ళనివ్వలేదు. మీడియాను సైతం అడ్డుకున్నారు. పులపర్రులో మంత్రికి ముఖ్య అనుచరుడినని చెప్పుకునే వ్యక్తి చెరువు తవ్వకంలో పచ్చనేతకు అండగా నిలిచారు. ఏవరైన పనులు ఆపడానికి వస్తే రెచ్చిపోవాలని మహిళలకు బోధిస్తున్నారు. ఉన్నతాధికారులకు నివేదించాం... పట్టపగలు అక్రమ చేపల చెరువుల తవ్వకంపై అటవీశాఖ ఎసీఎఫ్ వినోద్‌కుమార్‌ను వివరణ కోరగా,∙షరా మామూలుగానే ఉన్నతాధికారులకు వివరించామని తెలిపారు. ఇక్కడ జరిగిన విషయాన్ని లిఖిత పూర్వకంగా పైస్థాయి అధికారులకు తెలియచేస్తామన్నారు.