వాళ్లకి చట్టాలు చుట్టాలురా... | Laws Do Not Apply To Them Because They Are MLAs | Sakshi
Sakshi News home page

వాళ్లకి చట్టాలు చుట్టాలురా...

Published Sat, Mar 23 2019 10:20 AM | Last Updated on Sat, Mar 23 2019 10:23 AM

They Are MLAs Laws Do Not Apply To Them - Sakshi

సాక్షి, కైకలూరు : కుప్పుస్వామి : ఒరే.. నాగరాజు ఏంట్రా.. అంత తదేకంగా పేపరు చదువుతున్నావు.. ఏమైనా విశేషముందా.. ఉంటే.. కాస్త చెప్పరా.. 
నాగరాజు :  స్వామి.. నాకు తెలియక అడుగుతా.. ఎప్పుడూ, ప్రజల పక్షాననిలిచి, ఉద్యమాలు చేస్తున్న ప్రతిపక్ష నేతలపైనే పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.. పేపర్లో రోజూ ఎక్కడో ఓ చోట ఇవే వార్తలు.. ఇదెక్కడి పోలీసు న్యాయమో.. అర్థం కావడం లేదు..
స్వామి : నాగరాజు.. నాకు చదువు అబ్బక పోయినా.. కాస్త లోకజ్ఞానం ఉందిరా.. ఆ అనుభవంతో చెబుతున్నా.. విను.. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకుల మాట చెల్లుబాటు ఆవుతుంది.. ఇదేమి కొత్తగా కనిపెట్టిన విషయం కాదు.. నేరం చేసిన వారి ఆర్థిక స్థోమత, సామాజిక నేపథ్యం, రాజకీయ విధేయతలను అనుసరించే పోలీసుల వైఖరి ఉంటుందనడంలో ఆశ్చర్యం లేదురా.. చట్టాలు వాళ్లకి చుట్టాలే. మనం వాళ్లను నిందించకూడదు.. పాలకులను నిందించాలి..
నాగరాజు : స్వామీ.. ఎక్కడో ఎందుకు.. మన దగ్గర్లో చింతపాడు గ్రామానికి వచ్చిన చింతమనేని అటవీశాఖ అధికారిని ఏమన్నాడు.. దమ్ముంటే రారా.. అంటూ పత్రికల్లో రాయలేని పచ్చి బూతులు తిట్టాడు.. అటవీశాఖ అభయారణ్యంలో ఏకంగా తారురోడ్డు వేయించాడు.. ఇప్పటి వరకు ఆయనపై యాక్షన్‌ లేదు.. 
స్వామి : ఓరేయ్‌.. పిచ్చోడా.. చింతమనేని ఎవరూ.. ప్రభుత్వ చీఫ్‌విప్‌.. టీడీపీ ఎమ్మెల్యే.. సంపన్నుడు.. అలాంటి వారిపై కేసులు నమోదైనా శిక్షలు పడవని ఖాకీలకు ముందే తెలుసురా...
నాగరాజు : నిజమే స్వామి.. చింతమనేనిపై అటవీ శాఖాధికారులు మౌనం వహించారు. కేసు విచారణ కూడా లేదు.. అదే సమయంలో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానీపై సివిల్‌ వివాదంలో కేసు నమోదైంది.. బందరులో ఎక్సైజ్‌ అధికారుల విధులకు ఆటంకం మరో నేతపై కలిగించారని కేసులు పెట్టారు. ఇదేంటి.. అధికార పక్షానికి ఓ చట్టం.. ప్రతిపక్షానికి ఓ చట్టమా.. చెప్పు..
కృపావరం :  స్వామీ.. మీరిన్ని చెబుతున్నారు.. కానీ అసలు ఖాకీలకే రక్షణ లేదు.. అధికారం అండతో వాళ్లపైనే దాడులు జరుగుతున్నాయి.. 
కుప్పు స్వామి : ఇదేక్కడి వింత.. మనకు రక్షణ కల్పించాల్సిన పోలీసుకే రక్షణ లేదంటావేంటి కృపావరం.. వివరంగా చెప్పు.. 
కృపావరం : చెబుతాను.. వినండి.. మన ప్రాంతంలో జరిగిన సంఘటలే ఇవి.. గుమ్మళ్ళపాడులో కోడిపందేలను అడ్డుకోడానికి వెళితే ఇద్దరు కానిస్టేబుళ్లను చితకబాదారు. కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానం వద్ద వాహనాలను లోపలకి అనుమతించడం లేదని గ్రామపెద్ద ఏకంగా కానిస్టేబుల్‌ చొక్కానే చింపేశాడు. పులపర్రులో కులాలు వేరైన ఇద్దరు ప్రేమికులకు రక్షణ కల్పించడానికి వెళ్లిన పోలీసులను అధికార అండ కలిగిన పెద్దలు వారినే నిర్భందించారు.. ఇవే కాదు.. అనేక సంఘటనలు ఉన్నాయి.. 
బుజ్జిబాబు : (పక్కనే కూర్చుని అంతా వింటున్న వ్యక్తి) పెద్దలందరికీ ఓ నమస్కారం.. అధికారం ఎంత బరి తెగించిందో నేనూ.. ఓ మాట చెబుతా..  
కృపావరం : బుజ్జిబాబు.. అరే.. నేను నిన్ను చూడలేదు.. చెప్పు.. చెప్పు.. 
బుజ్జిబాబు : చింతమనేని సంగతి కాస్త పక్కన పెడదాం.. మన టీడీపీ అభ్యర్థి ఏం చేశారో తెలుసా.. మొన్నీమధ్య అటవీశాఖాధికారులు కొల్లేరు అభయారణ్యంలోకి ట్రాక్టరుపై తరలిస్తున్న ఆక్వా పరికరాలను సీజ్‌ చేసి కైకలూరు అటవీశాఖ కార్యాలయానికి తరలించారు.. అంతే ఆయనకు కోపం వచ్చింది. ఓ 60 మందితో వెళ్లి డాక్టరు, డ్రైవర్‌ను విడిపించుకుని వెళ్లిపోయారు.. కేసు పెట్టినప్పటికీ ఆయనను అడిగే వాడే లేడు.. ఇదేనండి అధికారం అంటే..
శంకరరావు : నిజమే నబ్బా.. పోలీసులు తీరు ఒక్కో సమయంలో ఒక్కో తీరుగా ఉంటుంది.. మొన్న విశాఖ ఎయిర్‌పోర్టులో ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిపై ఓ అగంతకుడు కత్తితో దాడి చేశాడు. పాపం.. రక్తం కారుతూ బాధతో జగన్‌ హైదరాబాదు వెళ్లారు.. ఇంతలోనే టీవీల్లో కత్తి దాడి ఆయన అభిమానే చేశాడని ప్రకటన... ఏ పార్టీ అభిమానైనా కత్తితో దాడి చేస్తాడా.. గుండెళ్లో పెట్టుకుని పూజిస్తాడు కాని.. 
జానీ : అవునండీ.. రాష్ట్రంలో మరీ దాడులు పెరిగాయి..  
శ్యాంబాబు : (నాగరాజు కొడుకు) : నాన్నో  ఓట్లు అడగడానికి ఎవరో వచ్చారు... నీ గురించి అడుగుతున్నారు. బేగా రా.. అంటూ పిలవడంతో అందరూ అక్కడి నుంచి నిష్క్రమించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement