పంట సాగులో ‘క్రాంతి’
రసాయనిక ఎరువులు కాకుండా సేంద్రియ ఎరువులతో పంట సాగు చేపట్టి విప్లవాత్మక ఫలితాలను సాధిస్తున్నాడు బీటెక్ విద్యార్థి క్రాంతికుమార్. బుక్కరాయసముద్రంలోని కేకే అగ్రహారానికి చెందిన జ్యోతి, నాగేశ్వరరెడ్డి దంపతలు కుమారుడు క్రాంతికుమార్ రెడ్డి ప్రస్తుతం అనంతపురంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మెకానికల్ ఇంజినీరింగ్ (ద్వితీయ) చేస్తున్నాడు. తమకున్న 13 ఎకరాల పొలంలో వివిధ రకాల పంట సాగు చేపట్టారు. వరిసాగులో సేంద్రియ ఎరువులను వినియోగించడం ద్వారా ఎకరాకు 45 బస్తాల ధాన్యం పండించగలిగినట్లు కాంత్రికుమార్ తెలిపారు. ఎకరా పొలంలో వరిసాగుకు రూ. 10 వేల నుంచి రూ. 15 వేలు పెట్టుబడి అయిందని, పంట దిగుబడి విక్రయిస్తే రూ. 50 వేలు వచ్చినట్లు పేర్కొంటున్నారు. బేర్ యాపిల్, దానిమ్మ, వంకాయ పంటలను కూడా సేంద్రియ ఎరువులతో సాగు చేస్తున్నట్లు వివరించారు.
- బుక్కరాయసముద్రం (శింగనమల)
సేంద్రియ ఎరువుల తయారీ ఇలా..
జీవామృతం : పేడ, ఆవు మూత్రం, బెల్లం, సెనగపిండి, దోసెడు గట్టు మన్ను కలిపి ఐదు రోజులు నిల్వ ఉంచిన తర్వాత పొలంపై పిచికారి చేసుకోవాలి.
నీమాశ్రమం : వేపాకు, కిలో పేడ, ఆవు మూత్రం బాగా రుబ్బి రెండ్రోజలు తర్వాత పిచికారి చేసుకోవాలి.
దశ పరణి కషాయం : వేపాకు, ఉమ్మెత్త ఆకులు, జిల్లేడు ఆకులు, బంతి పూల ఆకులు, తంగేడు ఆకులు, బాగా మిశ్రమం చేసి మూడు రోజుల తరువాత స్ప్రే చేయాలి.
మురిపిండి కషాయం : కిలో పిప్పి ఆకు, లీటరు పాలు, వేపాకు కషాయం, ఆవు మూత్రం కలిపి నాలుగు రోజుల తర్వాత పిచికారి చేయాలి.
ఇవన్నీ పచ్చ పురుగు, వేరు కుళ్లు తెగుళ్ల నివారణతో పాటు కాయ నాణ్యతకు, పూత రావడానికి ఎంతో ఉపయోగపడతాయి.
జీవన ఎరువులే ఎంతో మేలు
పంటల సాగులో జీనవ ఎరువుల వినియోగం లాభదాయకం. ప్రతి ఒక్కరూ జీవన ఎరువులను వాడితే పర్యావరణ సమతుల్యతను కాపాడినట్లవుతుంది. పంట దిగుబడి నాణ్యతగా ఉండడంతో పాటు రైతుకు లాభదాయకంగానూ ఉంటుంది.
- డాక్టర్ లక్ష్మిరెడ్డి, కేవీకే ప్రధాన శాస్త్రవేత్త