పుష్కర సేవలు భేష్
– 18 రోజుల పాటు శ్రమించిన టీటీడీ
– 11.27 లక్షల మందికి అన్నప్రసాదాల పంపిణీ
– నమూనా ఆలయంలో 5 లక్షల మందికి దర్శనం
– ఫల, పుష్ప, ఫోటో ఎగ్జిబిషన్లకు విశేష ఆదరణ
– ఉద్యోగులందరికీ అభినందనలు తెలిపిన ఈవో, ఛైర్మన్‌లు
సాక్షి ప్రతినిధి, తిరుపతి : కృష్ణా పుష్కరాల్లో యాత్రికులకు టీటీడీ ఉద్యోగులు అందిస్తోన్న వివిధ రకాల సేవలు మంగళవారంతో ముగిశాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 9 ఘాట్లలో ఈ నెల 6న మొదలైన టీటీడీ సేవలు 23న జరిగిన చక్రస్నానంతో ముగిశాయి. 650 మంది టీటీడీ ఉద్యోగులు, 1500 మంది శ్రీవారి సేవకులు 18 రోజుల పాటు నిర్విరామంగా శ్రమించి కృష్ణా పుష్కరాలను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా మంగళవారం ఈవో సాంబశివరావు ఉద్యోగులందరినీ కలిసి పుష్కర సేవలు బాగున్నాయనీ, ఉద్యోగులందరూ సమన్వయంతో పనిచేశారని కొనియాడారు.
కృష్ణా పుష్కరాలను విజయవంతం చేసేందుకు ఈ నెల మొదటి వారం నుంచే టీటీడీ సిద్ధమైంది. రూ.2 కోట్లతో విజయవాడ స్వరాజ్ మైదానంలో శ్రీవారి నమూనా ఆలయాన్ని నిర్మించింది. ఇక్కడే ఉన్న టీటీడీ ఆవరణలో పెద్ద ఎత్తున ఫల, పుష్ఫ, ఫోటో ఎగ్జిబిషన్లను ఏర్పాటు చేసింది. తిరుపతి అన్నమాచార్య, దాససాహిత్య, ధార్మిక పరిషత్ కళా బృందాలను పంపి తిరుమల వేంకటేశుని వైభవ ప్రాశస్త్యాన్ని తెలియజేసే సాంస్కృతిక, అధ్యాత్మిక కార్యక్రమాలను రోజూ నిర్వహించింది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని విజయవాడ, అమరావతి, శ్రీకాకుళం, హంసలదీవి, సీతానగరం ఘాట్లలో ప్రత్యేక వేదికలను నిర్మించి నిత్యం యాత్రికులను అన్నప్రసాదాన్ని పంపిణీ చేసింది. మొత్తం 11.27 లక్షల మందికి టీటీడీ అన్నప్రసాదాన్ని పంపిణీ చేసింది. ఇకపోతే శ్రీవారి నమూనా ఆలయంలో 5 లక్షల మంది యాత్రికులకు శ్రీవారి దర్శనాన్ని కల్పించింది. ఇదిలా ఉండగా, టీటీడీ ఏర్పాటు చేసిన ఫల,పుష్ప, ఫోటో ఎగ్జిబిషన్ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. పురాణాల్లోని వివిధ ఘట్టాలను వివరిస్తూ టీటీడీ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ యాత్రికులను కట్టిపడేసింది. సుమారు 4 లక్షల మంది యాత్రికులు వీటిని సందర్శించారు.
సేవకుల సేవలు ప్రశంసనీయం...
శ్రీవారి సేవకులు పుష్కర యాత్రికులకు విశేషమైన సేవలందించారు. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, తెలంగాణ, దక్షిణ కోస్తా జిల్లాలకు చెందిన 1500 మంది శ్రీవారి సేవకులు ప్రధాన ఘాట్లలో నిత్యం సేవలందించారు. భరించలేని ఎండలోనూ వీరు యాత్రికులకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా మరుగుదొడ్లు, పిండప్రదానం, వైద్య సేవా కేంద్రాలు, వృద్ధులను ట్రైసైకిళ్లపై ఘాట్ల వరకూ చేర్చడం, వారికి రాత్రిళ్లు వసతులు కల్పించడం వంటి సేవా కార్యక్రమాల్లో సేవకులు విశేషంగా శ్రమించారు. టీటీడీ ఈవో సాంబశివరావు, జేఈవో శ్రీనివాసరాజు, అన్నప్రసాదం డిప్యూటీ ఈవో చెంచులక్ష్మి, ఇంజినీరింగ్ అధికారులు చంద్రశేఖర్‌రెడ్డిలతో పాటు అదనపు సీవీఎస్‌వో శివకుమార్‌రెడ్డి, టీటీడీ పీఆర్‌వో రవికుమార్, టీటీడీ వేదపండితులు డాలర్ శేషాద్రి ప్రభృతులు సేవల్లో పాల్గొన్నారు.