కృష్ణా పశ్చిమ డెల్టాకు సాగునీరు విడుదల
Published Tue, Jul 19 2016 8:55 PM | Last Updated on Wed, Aug 29 2018 9:29 PM
కొల్లూరు : కృష్ణా పశ్చిమ డెల్టాలో ఖరీప్ సాగుకు అవసరమైన సాగునీరు విడుదలైంది. పశ్చిమ డెల్టా బ్యాంక్ కెనాల్ ద్వారా విడుదలైన నీటితో దుగ్గిరాల, కొల్లిపర, కొల్లూరు, భట్టిప్రోలు, రేపల్లె, రేపల్లె రూరల్, ఇతర మండలాల్లోని సుమారు 1.4 లక్షల ఆయకట్టుకు సాగునీరందనుంది. మంగళవారం కొల్లూరు చేరిన నీటిని నీటిపారుదల శాఖాధికారులు వివిద బ్రాంచ్ కెనాల్స్ ద్వారా వేమూరు, కొల్లూరు, కొల్లిపర మండలాల్లోని ఆయకట్టుకు విడుదల చేశారు. కొల్లూరుకు ఎగువ నుంచి 400 క్యూసెక్కుల నీరు విడుదలవుతుండగా 200 క్యూసెక్కుల నీటిని మూడు మండలాలకు మళ్లించి భట్టిప్రోలు, రేపల్లె, రేపల్లె రూరల్ మండలాలకు 200 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బుధవారం నాటికి 600 క్యూసెక్కుల నీరు కొల్లూరు లాకులకు చేరుకుంటుందని నీటిపారుదల శాఖ సిబ్బంది పేర్కొంటున్నారు. సాగు నీటి విడుదల విడతల వారీగా చేపట్టకుండా నిరంతరం సాగునీరు కాల్వల ద్వారా విడుదల చేయాలని రైతులు కోరతున్నారు.
Advertisement