
రాష్ట్రంలో కాలుపెట్టే సమయం లేదా?
ప్రధాని మోదీపై కేటీఆర్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి 35 దేశాలు తిరగడానికి సమయం ఉందని, కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం లో అడుగుపెట్టేందుకు సమయం చిక్కలేదేమని పంచాయతీరాజ్, ఐటీ శాఖల మంత్రి కె.తారకరామారావు ప్రశ్నించారు. ఇలాంటప్పుడు బీజేపీ నేతలు ఏ ముఖం పెట్టుకుని ప్రజలను ఓట్లు అడుగుతారని నిలదీశారు. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌లో జరిగిన జెడ్పీ ఎన్నికలతో పాటు ఢిల్లీ, బిహార్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి ‘స్థానిక’ ఎన్నికల్లోనూ బీజేపీకి ప్రజలు గుణపాఠం చెప్పారని వ్యాఖ్యానించారు.
సోమవారం హైదరాబాద్ నగర పరిధిలోని అంబర్‌పేట్, మల్కాజ్‌గిరి, జూబ్లీహిల్స్ నియోజకవర్గాలకు చెందిన పలువురు మాజీ కార్పొరేటర్లు, ముఖ్య నేతలు టీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా తెలంగాణ భవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో 75 నుంచి 80 సీట్లను గెలుచుకొని బల్దియా పీఠంపై టీఆర్‌ఎస్ జెండా ఎగురవేస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డిని పంచెలూడదీసి కొడతామన్న కాంగ్రెస్ నేత దానం నాగేందర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ... ఎవరి పంచెలూడగొట్టాలో ఎన్నికల్లో ప్రజలే నిర్ణయిస్తారని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో ఇక గూండాల రాజ్యం నడవదని వ్యాఖ్యానించారు. గత 18 నెలలుగా ప్రజలు కేసీఆర్ పాలనను ఆమోదిస్తున్నందువల్లే జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ ఘన విజయం సాధిస్తోందన్నారు. జానారెడ్డి, చంద్రబాబు పార్టీలు మారగా లేనిది ఇతరులు పార్టీ మారితే ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయిందంటూ రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక సీమాంధ్రులు, సింధీ, మార్వాడీ, సిక్కులను నగరం నుంచి తరిమివేస్తారంటూ అసత్య ప్రచారం చేసిన పార్టీలకు... ఇప్పుడు తమ ప్రభుత్వ పాలన చూసి కనువిప్పు కలగాలని పేర్కొన్నారు.
గత 60 ఏళ్లలో కాంగ్రెస్, టీడీపీలు చేయని అభివృద్ధిని తాము చేసి చూపుతున్నామన్నారు. అనంతరం మంత్రి తలసాని మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ జెండా మినహా ఇతర పార్టీల జెండాలు కనిపించని పరిస్థితి ఉందన్నారు. కాంగ్రెస్ అగ్రనేతల నమ్మకం కోల్పోయిన దానం నాగేందర్... వారి మెప్పుకోసం టీఆర్‌ఎస్ నాయకులపై విమర్శలు చేస్తున్నారని, ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. పార్టీలో చేరిన వారందరికీ టికెట్లు ఇవ్వలేమని, గెలుపు గుర్రాలకే దక్కుతాయన్నారు.