
జీహెచ్‌ఎంసీ పీఠం మాదే!
♦ ఏ పార్టీతోనూ మాకు పొత్తులు ఉండవు
♦ అవగాహన కూడా ఉండదు
♦ తెలంగాణకు ప్రధాని మోదీ చేసిందేమీ లేదు
♦ మూడుసార్లు పిలిచినా కన్నెత్తి చూడలేదు
♦ మా ప్రశ్నలకు సమాధానాలు లేకే బీజేపీ విమర్శలు
♦ మా దగ్గర ‘విశ్వనగర’ ప్రణాళికలు ఉన్నాయి
♦ టీఆర్‌ఎస్‌లో ఎలాంటి నంబర్ గేమూ లేదు
♦ హరీశ్‌రావుతో నాకు ఆధిపత్య పోరు లేదు
♦ ‘సాక్షి’ ఇంటర్వ్యూలో మంత్రి కల్వకుంట్ల తారక రామారావు
సాక్షి, హైదరాబాద్: ఏడాది పొడవునా వివిధ ఎన్నికల్లో జైత్రయాత్ర కొనసాగించిన అధికార టీఆర్‌ఎస్, వచ్చే జనవరిలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లోనూ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలు తమ వద్ద ఉన్నాయని గ్రేటర్‌లో పార్టీకి అన్నీ తానై వ్యవహరిస్తున్న ఐటీ, పంచాయతీరాజ్ మంత్రి కె.తారకరామారావు చెప్పారు. వివిధ మౌలికాంశాల్లో హైదరాబాద్ దుస్థితి, కేంద్రం చిన్నచూపు, గ్రేటర్ ఎన్నికల్లో ప్రత్యేక మేనిఫెస్టో తీరుతెన్నులు, పొత్తులు, టీఆర్‌ఎస్ సంస్థాగత వ్యవహారాలు తదితరాలపై బుధవారం ‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఆయన స్పష్టత ఇచ్చారు. వివరాలు...
ప్రత్యేక మేనిఫెస్టో రూపమిదీ...!
హైటెక్ సిటీ కట్టినమని డబ్బాలు కొట్టుకునేటోళ్లు కింద మోరీలు కట్టడం మరిచిపోయారు. చెన్నైలో 100 సెంటిమీటర్ల వర్షం వస్తే రోడ్లన్నీ చెరువులయ్యాయి. హైదరాబాద్ దానికి భిన్నంగా ఏమీ లేదు. చాలామంది ఫుట్‌పాత్‌ల మీద పడుకుంటున్నరు. చాలాచోట్ల అసలు ఫుట్‌పాత్‌లే లేవు. నగరంలో ఈ రోజుకూ మోరీల వ్యవస్థ లేదు. నైట్ షెల్టర్లు, పార్కులు, మార్కెట్లు , శ్మశానాల్లేవు. అందుకే మౌలిక సౌకర్యాలపైనే మేం దృష్టి పెట్టాం. ప్రజలు కోరుకునే దిశలోనే ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేస్తం. నగరం కోసం 30 టీఎంసీల సామర్థ్యంతో రెండు తాగునీటి జలాశయాలు నిర్మిస్తున్నం.
నగర జనాభా పది కోట్లకు చేరుకున్నా తట్టుకునేలా తీర్చిదిద్దుతం. హైదరాబాద్‌లో భవిష్యత్తులో కనురెప్పపాటు కూడా కరెంటు పోకుండా ఐలాండ్ టవర్ సిద్ధం చేస్తున్నం. నగరం చుట్టూ నాలుగు సబ్‌స్టేషన్లతో ఎక్కడా కోతల్లేకుండా రూ.2,000 కోట్లతో కరెంటు ఇవ్వబోతున్నం. రూ.20 వేల కోట్లతో రోడ్లను అభివృద్ధి చేస్తూ కొత్తగా వేస్తం. మనకు పీవీ ఎక్స్‌ప్రెస్ హైవే లాంటివి మరో నాలుగైదు కావాలి. ప్యారడైజ్-కొంపల్లి, జూబ్లీ బస్టాండ్-శామీర్‌పేట, ఉప్పల్-ఘట్‌కేసర్, ఆరాంగఢ్-బెంగుళూరు హైవేల్లో ఎక్స్‌ప్రెస్ హైవేలు నిర్మిస్తం.
నగర రోడ్లకు 400 కి.మీ. మేర వైట్ టాపింగ్, 1,800 కి.మీ. బీటీ రెన్యువల్ కోటింగ్ పూర్తి చేస్తున్నం. నగరంలో మోండా, గడ్డిఅన్నారం తప్పితే ఇతర మార్కెట్లు లేవు. 36 మోడల్ మార్కెట్లు, 36 మోడల్ శ్మశాన వాటికలు సిద్ధం చేస్తం. మూసీ వెంట 6 లేన్ల ఎక్స్‌ప్రెస్ రోడ్‌ను 42 కి.మీ. నిడివిలో నిర్మిస్తం. ప్రజలు ఈ నగరంలో జీవించడానికి ఇష్టపడాలి. స్మార్ట్ సిటీగా ఉండేలా, విశ్వనగరంగా తీర్చిదిద్దుతం.
తెలంగాణకు మోదీ ఏమీ చేయలేదు
ప్రధాని మోదీని తెలంగాణకు మూడుసార్లు పిలిచినం. కానీ ఆయన ఇటువైపు కన్నెత్తి చూడలేదు. కేంద్రం తెలంగాణకు ప్రత్యేకంగా ఏమీ ఇవ్వలేదు. ఆయన 22నెలలుగా ముఖం చాటేయడం వాస్తవం కాదా? మరి ఏ ముఖం పెట్టుకుని ఓట్లడుగుతరని మేం ప్రశ్నిస్తున్నం. అసలు తెలుగువారి కోసం ప్రధాని ఏం చేసిండ్రు? ఏపీకి పోయి మట్టి, నీళ్లు ఇచ్చి వెళ్లారు. ప్రత్యేకంగా చేసిందేముంది? హైదరాబాద్‌లోని తెలుగువాళ్లను ఓట్లెట్ల అడుగుతరు? బదనాం చేయడం తప్ప బీజేపీ, ఎన్‌డీఏ తెలంగాణకు చేసిందేమీ లేదు. బీజేపీవి ప్రచారార్భాటాలు, ప్రకటనలు తప్ప వాళ్ల కార్యక్రమాల్లో పదును లేదు. మా ప్రశ్నలకు సమాధానాల్లేకే విమర్శలు చేస్తున్నరు.
వరంగల్ ఫలితమే పునరావృతం
మా పాలన, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి పోతున్నయన్న విశ్వాసం మాకుంది. కేసీఆర్ నాయకత్వం పట్ల ప్రజలకు నమ్మకం మరింత బలపడింది కాబట్టే వరంగల్ ఉప ఎన్నికలో ఘనవిజయం సాధించినం. గ్రేటర్ వరంగల్ లోని ఈస్ట్, వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1.3 లక్షల మెజారిటీ వచ్చింది. కాబట్టి అర్బన్ ఓటింగే సంకేతమని భావిస్తే అది అద్భుతమైన మెజారిటీ. ప్రజలు ప్రజలుగానే ఆలోచిస్తరు. గ్రేటర్ హైదరాబాద్‌లో ఒకలా, మరో నగరంలో ఇంకోలా ఆలోచిస్తరని లేదు. గ్రేటర్‌లో ఉన్న వైవిధ్యం వరంగల్‌లో కూడా ఉంది. హైదరాబాద్ ఫలితం ఇంకా మెరుగ్గా ఉంటది. సీఎం చెప్పింది చేస్తడన్న విశ్వాసం పెరిగింది. కాబట్టి హైదరాబాద్‌లో ఫలితాలు మెరుగ్గానే ఉంటయి.
కేసీఆరే ఏకైక నంబర్
టీఆర్‌ఎస్‌లో ఏ నంబర్లూ లేవు. ఉన్నదొకటే నంబర్. కేసీఆర్. మిగతావారికి ఏ నంబర్లూ లేవు. దీన్ని భూతద్దంలో పెట్టి చూడొద్దు. మంత్రి హరీశ్‌రావుతోనూ ఎలాంటి ఆధిపత్య పోరూ లేదు. టీడీపీ, కాంగ్రెస్ పతనపు అంచున ఉన్నయి. అందుకే పనికిమాలిన ప్రచారం చేస్తున్నయి. మా మధ్య ఏమీ లేదు, ఏమీ ఉండదు, ఏమీ ఉండబోదు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలవాలి. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు గెలవాలి. సమష్టిగా పని చేస్తం. అందరం పని చేస్తం. వరంగల్‌లో మొన్న అదేమాదిరిగా పని చేసినం.
ఎంఐఎం సహా ఎవరితోనూ పొత్తులుండవ్
మాకు ఏ పార్టీతో పొత్తు లేదు. శత్రుత్వమూ లేదు, స్నేహమూ లేదు. అసెంబ్లీలో మజ్లిస్ మమ్మల్ని సమర్థిస్తున్నది. ప్రభుత్వానికి మద్దతిస్తున్నది. అయితే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మాకు ఎవరితో పొత్తుండదు. 150 డివిజన్లలోనూ పోటీ చేస్తం. వంద శాతం స్వతంత్రంగనే గెలుస్తం. జీహెచ్‌ఎంసీలో నలుగురు మంత్రులు తిరుగుతున్నరు. నాకున్న పరిచయాలతో ఎక్కువ తిరిగే అవకాశముంది. టీఆర్‌ఎస్ కార్యకర్తగా అడ్వాంటేజ్ తీసుకుని పనిచేస్తున్న.