
అప్పటి వరకూ ఓట్లు అడగం: కేటీఆర్
ఖమ్మం: ప్రతి ఇంటికీ నల్లా నీరు ఇస్తామని సీఎం కేసీఆర్ భీష్మ ప్రతిజ్ఞ చేశారని, నీళ్లు ఇస్తేనే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడుగుతామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. అప్పటి వరకు ఓట్లు అడగమని చెప్పారు. ఆదివారం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్లచెర్వు గ్రామంలో పాలేరు సెగ్మెంట్ వాటర్‌గ్రిడ్ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన మాటకు కట్టుబడి, ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేస్తామన్నారు.
60ఏళ్ల ఆంధ్రా పాలనలో చితికిపోయిన తెలంగాణ అస్తిత్వాన్ని తిరిగి నిలబెట్టేందుకు సీఎం కృషి చేస్తున్నారని చెప్పారు. వచ్చే నాలుగేళ్ల లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌తోపాటు మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీలు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, బాల్కసుమన్, ఎమ్మెల్యేలు రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, తాటి వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య తదితరులు పాల్గొన్నారు.