మోర్తాడ్ (నిజామాబాద్) : కువైట్‌లో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం కారణంగా అక్కడి ప్రభుత్వం కంపెనీలపై పన్ను భారం మోపితే.. కంపెనీల యాజమాన్యాలు ఆ భారాన్ని కార్మికుల నెత్తిన వేస్తూ వేధింపులకు పాల్పడుతున్నాయి. గడువు ముగిసిన కార్మికుల వీసాలను రెన్యూవల్ చేయాల్సిన కంపెనీలు తాము చెప్పినంత సొమ్ము చెల్లించాలంటూ హుకుం జారీ చేస్తున్నాయి. కువైట్‌లోని కంపెనీల్లో పని చేస్తున్నవారిలో ఎక్కువ మంది విదేశీయులే. అందులో సగం మంది భారతీయులు కాగా వారిలో 30 శాతం మంది తెలుగు వారున్నారు.
కువైట్‌లోని కన్‌స్ట్రక్షన్, ఆయిల్, మున్సిపల్ క్లీనింగ్, ఆసుపత్రులు, వాణిజ్య వ్యాపార సముదాయాలు, విద్యాలయాలు తదితర కంపెనీల్లో పని చేయడానికి ఏటా వేలాది మంది కార్మికులు కువైట్‌కు వలసవెళుతున్నారు. వీసా జారీ అయినప్పుడు రెండేళ్ల పాటు పని చేయడానికి అనుమతి ఇస్తారు. గడువు పొడగిస్తూ వీసాను మరో రెండేళ్ల పాటు రెన్యూవల్ చేస్తారు. ప్రతి వీసా గడువు రెండు సంవత్సరాల పాటు ఉంటుంది. వీసా రెన్యూవల్ సమయంలో కార్మికుడు కంపెనీకి సొమ్ము చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు మాత్రం ప్రభుత్వం పెంచిన పన్ను మొత్తంను కంపెనీలు కార్మికులపై భారం మోపుతున్నాయి.
వీసా గడువు ముగిసి రెన్యూవల్ చేయాలంటే రూ.65 వేల వరకు చెల్లించాలని కంపెనీ యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆ సొమ్ము చెల్లించకపోతే వీసాను పొడిగించకుండా ఇంటికి పంపిస్తున్నారు. కువైట్‌లోని వివిధ కంపెనీల్లో పని చేస్తున్న కార్మికుల్లో నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలకు చెందిన కార్మికులు దాదాపు 20 వేల మంది ఉన్నారు. ఎక్కువ మంది కార్మికులకు నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వేతనం లభిస్తుంది. వీసా రెన్యూవల్‌కు రూ.65 వేల వరకు చెల్లిస్తే మూడు, నాలుగు నెలల వేతనం కంపెనీలకే సంతర్పణ చేయాల్సి వస్తుంది. కువైట్ ప్రభుత్వం వీసా రెన్యూవల్‌కు డబ్బులు వసూలు చేయాలనే నిబంధన విధించకున్నా కంపెనీలు మాత్రం ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నాయి.
కంపెనీల తీరుపై కువైట్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసే సాహసం కార్మికులు చేయలేకపోతున్నారు. ఒక వేళ కంపెనీలకు వ్యతిరేకంగా తాము పని చేస్తే కంపెనీల నుంచి తొలగిస్తారే భయం కార్మికుల్లో ఏర్పడింది. వీసా రెన్యూవల్ కోసం తమ వద్ద సొమ్ము లేకపోతే ఇంటి నుంచి తెప్పించుకోవడానికి కార్మికులు ప్రయత్నిస్తున్నారు. వీసా రెన్యూవల్ చేసుకోకుండా ఇంటికి వస్తే ఇక్కడ ఉపాధి లేక మళ్లీ గల్ఫ్ వెళ్లడానికి అప్పులు చేయాల్సి వస్తుందని కార్మికులు వాపోతున్నారు. మన విదేశాంగ శాఖ స్పందించి కువైట్‌లోని కంపెనీల వసూళ్ల బాగోతాన్ని అక్కడి ప్రభుత్వం దృష్టికి తీసుకవెళ్లాలని పలువురు కార్మికులు కోరుతున్నారు.
వీసా రెన్యువల్ అంటూ కువైట్ కంపెనీల దందా
Published Thu, Jul 28 2016 7:18 PM | Last Updated on Tue, Aug 7 2018 4:24 PM
Advertisement
Advertisement