అంగరంగ వైభవం.. శ్రీనివాసుని కల్యాణం
కరీంనగర్‌కల్చరల్: శ్రీవేంకటేశ్వరస్వామి తిరు కల్యాణోత్సవం ఆదివారం రాత్రి నగరంలోని వైశ్యభవన్‌లో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీత్రిదండి చిన్నజీయర్‌స్వామి మంగళ శాసనాలతో శ్రీదేవనాథ జీయర్‌స్వామి పర్యవేక్షణలో పండితులు శ్రీపాంచరాత్ర దివ్యాగ మోక్షం ప్రకారం శ్రీనివాసుని కల్యాణాన్ని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న దంపతులకు స్వామివారి శంఖుచక్ర నామ సహిత శేషవస్త్రాలు, స్వామివారి డాలర్, తిరుపతి లడ్డూప్రసాదం అందజేశారు. శ్రీపద్మనాభ సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కల్యాణోత్సవంలో సంగీత దర్శకుడు కేబీ శర్మ బృందం ఆలకించిన ఏడు కొండల వారి కీర్తనలు, పాటలు అలరించాయి.