
ఆ కుటుంబాల్లో తీరని శోకం
విశాఖపట్నం: పుష్కర స్నానానికి వారు రాజమహేంద్రవరం వచ్చారు. ఆ పుణ్యకార్యాన్ని పూర్తి చేద్దామని పుష్కరఘాట్‌కు చేరుకున్నారు. ఇంతలో తోపుటలాట జరిగింది. ఆ తోపులాటలో వారు ప్రాణాలు కోల్పోయారు. గత ఏడాది జూలై 14న ప్రారంభమైన గోదావరి పుష్కారాల్లో జరిగిన తొక్కిసలాటలో విశాఖ జిల్లాకు చెందిన ఐదుగురు మృతి చెందారు. మధురవాడ సమీపంలోని మారికవలసకు చెందని అవ్వ బంగారమ్మ, ఆమె కుమార్తె గౌరి, సీతమ్మధారకు చెందిన కోటిన మహాలక్ష్మి, పెందుర్తికి చెందిన గొర్లె మంగమ్మ, గాజువాకకు చెందిన పాండవుల విజయలక్ష్మి ప్రాణాలు కోల్పోయారు. వీరంతా మహిళలే. ఆ విషాద సంఘటనకు నేటి కి ఏడాది కావడంతో ప్రథమ వర్ధంతికి కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఆడ దిక్కు లేకపోతే వెలితే..
మధురవాడ దరి మారికవలస జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ఇంట్లో ఉంటున్న ఆటో డ్రైవరు అవ్వ కృష్ణ పుష్కరఘాట్ వద్ద జరిగిన ప్రమాదంలో భార్య ఎ.బంగారమ్మ, కుమార్తె ఎ.గౌరిని కోల్పోయాడు. ఇంటి దీపం దూరం కావడంతో తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. ‘‘భార్య, కుమార్తెలు జ్ఞాపకాలు మరువలేక పోతున్నాం.. ఇంటికి ఆడ దిక్కులేకపోతే వెలితే.. ఎప్పుడూ సందడిగా ఉండే మా ఇల్లు బోసిపోయింది. కుమార్తె నవ్వులు దూరమయ్యాయి. మా ఇంట్లో ఆ విషాదచాయలు ఇంకా పోలేదు. ఇటువంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు’’ అని తండ్రీకుమారుడు బాధాతప్త హృదయాలతో చెబుతున్నారు. ప్రథమ వర్ధంతికి ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. అక్క కొల్లి దాలమ్మ, వదిన గంగమ్మల సాయంతోనే నెట్టుకు వస్తున్నామని చెప్పారు.
బతుకు తెరువుకు నగరానికి వచ్చి..
విజయనగరం జిల్లా భోగాపురం మండలం సరవవిల్లి సమీపంలోని అవ్వపేట వీరి స్వగ్రామం. బతుకు దెరువు కోసం కృష్ణ కుటుంబం 1995లో విశాఖపట్నం వలస వచ్చింది. అతడు ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. 1995లో మారికవలసలో ఇల్లు రావడంతో అక్కడ నివాసం ఉంటున్నారు. ఇంతలో ఈ విషాదం చోటుచేసుకోవడంతో ప్రస్తుతం తండ్రీకుమారులిద్దరే అక్కడ ఉంటున్నారు. ఆటో నడుపుతూ కుమారుడు రాంబాబును డిప్లమో చదివించాడు. కృష్ణ వదిన గంగమ్మ వీరికి వండిపెడుతోంది.