అప్పుల బాధతో ఓ కౌలు రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. కర్నూలు జిల్లా గూడూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన దండు తిమ్మోతి(35)కి సొంత పొలం లేదు. దీంతో నాలుగు ఎకరాలను కౌలుకు తీసుకుని నాలుగేళ్ల నుంచి వ్యవసాయం చేసుకుంటున్నాడు.
వర్షాభావ పరిస్థితులతో పంటలు సక్రమంగా పండక పెట్టుబడులు కూడా రాలేదు. అప్పులు దాదాపు రూ.4లక్షలు కావడంతో వాటిని తీర్చేందుకు ఆటో కూడా నడిపేవాడు. అయితే అప్పుల ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి అధికం కావడంతో తట్టుకోలేక జీవితంపై విరక్తి చెంది శనివారం సాయంత్రం పొన్నకల్లు రహదారి వైపు సొంత ఆటోలో చేరుకుని ముళ్ల కంచెల దాపులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆదివారం ఉదయం అటువైపుగా వెళ్తున్న కూలీలు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కోడుమూరు సీఐ డేగల ప్రభాకర్, స్థానిక ఎస్‌ఐ చంద్రబాబు ఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. మతుడికి భార్య నయోమి, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. మతుడి తల్లి మరియమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.