కౌలు రైతు ఆత్మహత్యాయత్నం | Lease farmer to commit suicide | Sakshi
Sakshi News home page

కౌలు రైతు ఆత్మహత్యాయత్నం

Published Thu, Aug 4 2016 6:26 PM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM

కౌలు రైతు ఆత్మహత్యాయత్నం

కౌలు రైతు ఆత్మహత్యాయత్నం

కడప సెవెన్‌రోడ్స్‌ :

ఇతరుల ఆక్రమణలో ఉన్న తన భూమిని తనకు ఇప్పించాలని పలుసార్లు ‘మీకోసం’ కార్యక్రమంలో కలెక్టర్‌కు అర్జీలు సమర్పించినా రెవెన్యూ అధికారులు స్పందించలేదని వైఎస్సార్‌ జిల్లా బి.కోడూరు మండలం రెడ్డివారిపల్లెకు చెందిన రంపతాడు రామయ్య (70) అనే కౌలురౌతు గురువారం కలెక్టరేట్‌లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఉదయం నుంచే ఆయన కలెక్టర్‌ చాంబర్‌ ఎదుట నేలపై కూర్చొని ఉన్నాడు. కలెక్టర్‌ ఎప్పుడు వస్తారంటూ దారిన వెళ్లిన వారందరినీ విచారించాడు. ఓ ఉద్యోగి విషయం ఏమిటో తెలుసుకుందామని ఆయన వద్దకు వెళ్లాడు. మాట తడబడడమే కాకుండా పురుగులమందు తాగిన వాసన గుప్పుమనడంతో ఆయన వెంటనే బయట ఉన్న పోలీసులకు సమాచారం ఇచ్చాడు. 108 వాహనానికి ఫోన్‌ చేయగా, తాము రావడానికి ఆలస్యమవుతుందని బదులిచ్చారు. దీంతో విధి నిర్వహణలో ఉన్న ఎస్‌ఐ నాగరాజు హుటాహుటిన ఆ రైతును తన వాహనంలో రిమ్స్‌కు తరలించారు. వైద్యులు ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రాణాపాయం ఏమీ లేదని, ఏడు రోజులపాటు చికిత్స తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు పేర్కొన్నారు.
 కౌలు రైతు రామయ్య చెప్పిన కథనం మేరకు....
షెడ్యూల్డ్‌ కులానికి చెందిన ఆయన స్వగ్రామం రెడ్డివారిపల్లె కాగా, ప్రస్తుతం తమ అత్తగారి గ్రామమైన శంఖవరంలో ఉంటున్నాడు. ఆయనకు భార్య నారాయణమ్మ, కుమారుడు ఓబులేశు, కుమార్తె ఈశ్వరమ్మ ఉన్నారు. కుమార్తె టీటీసీ(టీచర్‌ ట్రైనింగ్‌ కోర్సు) చదివి ప్రస్తుతం ఇంటి వద్దనే ఉంటోంది. కుమారుడు, తను, తన భార్య కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గత ఆరేళ్లుగా రెండెకరాలు కౌలుకు తీసుకుని సేద్యం చేస్తున్నారు. ఒక ఎకరాకు రూ. 4500, మరో ఎకరాకు రూ. 5000 చొప్పున గుత్త చెల్లిస్తున్నాడు. బ్యాంకు రుణం, సబ్సిడీ విత్తనాలు, బీమా వంటి సంగతులేవీ ఆయనకు తెలియవు. ఇదిలా ఉండగా గతంలో ఆయన సర్వే నెంబరు 1274లో 3.62 ఎకరాల ప్రభుత్వ భూమిని అనుభవించుకుంటూ ఉండేవాడు. అయితే ఆ ప్రాంతానికే చెందిన ఓ వ్యక్తి ఆ భూమిని ఆక్రమించుకున్నాడని రామయ్య ఆరోపిస్తున్నాడు. తన భూమిని తిరిగి తనకు ఇప్పించి న్యాయం చేయాలని కాళ్లరిగేలా కలెక్టరేట్, తహశీల్దార్‌ కార్యాలయాల చుట్టూ తిరిగాడు. మీకోసంలో పలుమార్లు అర్జీలు సమర్పించినప్పటికీ క్షేత్రస్థాయి అధికారులు పట్టించుకోకపోవడంతో విసిగి వేసారి పోయాడు. కలెక్టరేట్‌లోనే ఆత్మహత్య చేసుకుంటే కనీసం తన కుటుంబానికైనా న్యాయం జరుగుతుందనే ఆశతో ఈ యత్నానికి పాల్పడినట్లు ఆయన తెలిపారు. ఆక్రమణలో ఉన్న ఎస్సీ ఎస్టీల భూములను విడిపించి తిరిగి వాటిని వారికే అప్పగిస్తామని బుధవారం జరిగిన విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశంలో కలెక్టర్‌ కేవీ సత్యనారాయణ చెప్పి 24 గంటలు కూడా ముగియకుండానే ఈ సంఘటన చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement