వీడిన హత్యకేసు మిస్టరీ | Leaving the murder mystery | Sakshi
Sakshi News home page

వీడిన హత్యకేసు మిస్టరీ

Published Mon, Feb 6 2017 11:54 PM | Last Updated on Mon, Jul 30 2018 8:37 PM

వీడిన హత్యకేసు మిస్టరీ - Sakshi

వీడిన హత్యకేసు మిస్టరీ

  • బావమరిది ప్రాణం తీసిన బావ
  • అప్పు తిరిగి చెల్లించాలంటూ ఒత్తిడి చేసినందుకే..
  • నిందితుడిని అరెస్ట్‌ చేసిన గుత్తి పోలీసులు 
  •  
    గుత్తి (గుంతకల్లు) : జనవరి 29న గుత్తి శివారులో హత్యకు గురైన యుగంధర్‌గౌడ్‌ (23) మిస్టరీని పోలీసులు ఛేదించారు. స్నేహితుడు, వరుసకు బావ అయిన వ్యక్తి చేతిలో దారుణంగా హత్యకు గురయ్యాడు. అప్పు తిరిగి చెల్లించాలంటూ తీవ్రస్థాయిలో ఒత్తిడి తేవడం వల్లే చంపేవానని నిందితుడు పోలీసుల విచారణలో అంగీకరించాడు. ఇందుకు సంబంధించిన వివరాలను గుత్తి సీఐ మధుసూదన్‌గౌడ్‌ సోమవారం సర్కిల్‌ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. గుత్తి మండలం పెద్దొడ్డి గ్రామానికి చెందిన యుగంధర్‌గౌడ్‌ కర్నూలు జిల్లా పాణ్యంలోని ఒక మద్యం షాపులో పనిచేస్తుండేవాడు. ఇతనికి అదే జిల్లాలోని ఆదోని మండలం కపటి గ్రామానికి చెందిన ఈడిగ రాముడుతో పరిచయమైంది. ఇద్దరి మధ్య స్నేహబంధం పెరిగింది. ఆ తర్వాత యుగంధర్‌గౌడ్‌ పెద్దనాన్న కుమార్తెను రాముడు వివాహం చేసుకున్నాడు. దీంతో ఇద్దరూ మరింత దగ్గరయ్యారు. ఈ క్రమంలో యుగంధర్‌గౌడ్‌ నుంచి రాముడు రూ.20 వేలు అప్పుగా తీసుకున్నాడు. తర్వాత కొన్ని రోజులకు అప్పు తిరిగి చెల్లించాలంటూ యుగంధర్‌గౌడ్‌ ఒత్తిడి చేశాడు. తరచూ డబ్బు గురించి అడుగుతుండటంతో ఎలాగైనా అతడిని చంపేయాలని రాముడు నిర్ణయించుకున్నాడు.
     
    హత్య ఇలా జరిగింది..
    జనవరి 29న రాత్రి ఏడు గంటల సమయంలో కోడుమూరులో రాముడును తన బైక్‌లో ఎక్కించుకుని యుగంధర్‌గౌడ్‌ స్వగ్రామం పెద్దొడ్డికి బయలుదేరాడు. గుత్తికి రాత్రి 9.30 గంటల సమయంలో చేరుకున్నారు. అక్కడ కొంత సేపు ఆగి పెద్దొడ్డికి పయనమయ్యాడు. అయితే పెద్దొడ్డి మార్గం (నాగసముద్రం) క్రాస్‌ వద్ద మూత్ర విసర్జన కోసం రాముడు బైక్‌ను ఆపించాడు. తిరిగి బైక్‌ ఎక్కే సమయంలో వెనుక నుంచి బలమైన రాయి తీసుకుని తలపై మోదాడు. కిందపడ్డ యుగంధర్‌గౌడ్‌ను కొంతదూరం చేనులోకి లాక్కెళ్లి గొంతు నులిమాడు. అయినా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుడటంతో వెంట తెచ్చుకున్న కత్తితో తలపై, పొట్టలో ఇష్టానుసారం పొడిచాడు. గిలగిలా కొట్టుకుంటూ యుగంధర్‌గౌడ్‌ ప్రాణం విడిచాడు.
     
    నిందితుడు అలా పారిపోయాడు..
    హత్య చేసిన అనంతరం రాముడు గుంతకల్లుకు పారిపోయాడు. అక్కడి నుంచి బెంగుళూరుకు వెళ్లి అక్కడ అర గంట మాత్రమే ఉండి తిరిగి మరో రైలు ఎక్కి గుత్తికి వచ్చాడు. 30వ తేదీ హత్య సంఘటన వెలుగు చూసింది. ఎవరు చంపారనేది మిస్టరీగా మారింది. పోలీసులు విభిన్న కోణాలో విచారణ చేపట్టారు. మృతదేహాన్ని చూడటానికి గానీ, అంత్యక్రియలకు గానీ రాముడు రాలేదు. యుగంధర్‌ గౌడ్‌తో ఎంతో సన్నిహితంగా ఉండే రాముడు ఎందుకు రాలేదనే అనుమానం పోలీసులు తట్టింది. రాముడే హత్య చేసి ఉంటాడని నిర్దారించుకున్నారు. 
     
    ఎలా పట్టుబడ్డాడంటే..
    రాముడు ఆచూకీ కోసం ఎంత ప్రయత్నించినా దొరకలేదు. చివరకు సోమవారం సేవాఘడ్‌ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా అతడిని పోలీసులు పట్టుకున్నారు. పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి తమదైన శైలిలో విచారించారు. డబ్బు కోసం తానే తన బావమరిదిని హత్య చేశానని రాముడు అంగీకరించాడు. నిందితుడి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన కత్తిని, సెల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితున్ని కోర్టులో హాజరు పరచగా.. మెజిస్ట్రేట్‌ రిమాండ్‌కు ఆదేశించారు. విలేకరుల సమావేశంలో ఎస్‌ఐలు చాంద్‌బాషా, రామాంజనేయులు, సుధాకర్, ఏఎస్‌ఐలు ప్రకాష్, ప్రభుదాస్, ఐడీ పార్టీ పీసీ సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.
     
     
     
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement