నత్తనడకన కొసాగుతున్న జూరాల పుష్కర రోడ్డు పనులు
నాసిరకంగా పుష్కర పనులు
Published Fri, Jul 22 2016 6:26 PM | Last Updated on Mon, Sep 4 2017 5:51 AM
ఆత్మకూర్: ఆత్మకూర్ పీజేపీ ఎక్స్‌రోడ్ నుంచి జూరాల పుష్కరఘాట్ వరకు రూ.4కోట్లతో నాలుగు కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న రోడ్డు పనులను నత్తనడకన కొనసాగుతున్నాయి. ఏప్రిల్‌లో మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి భూమిపూజలు చేసి రోడ్డు పనులను ప్రారంభించారు. పుష్కరాల వరకు పనులను పూర్తి చేయాలని ఆదేశించినా, పనులు మందుకు సాగడం లేదు. రోడ్డు వేయడంలో ఎక్కడా నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. సింగిల్‌రోడ్డును డబుల్‌రోడ్డుగా మారుస్తూ చేపట్టిన పనులపై ఆర్‌అండ్‌బీ అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో పాటు పనులు నత్త నడకన సాగుతున్నాయి.1600 మీటర్లమేర పాతరోడ్డుకు ఇరువైపుల కొత్తరోడ్డు నిర్మిస్తున్నారు. అలాగే 1400 మీటర్లమేర కొత్తరోడ్డును ఘాట్‌వరకు చేపడుతున్నారు.
కొల్లాపూర్‌రూరల్: మంచాలకట్ట గ్రామ సమీపం నుంచి పుష్కరఘాట్ల వరకు వేస్తున్న రోడ్లు ఇంకా పూర్తి కాలేదు. పుష్కరాల సమయం సమీపిస్తుండటంతో కాంట్రాక్టర్లు హడావుడిగా నాసిరకంగా పనులు చేస్తున్నారు. పుష్కరాల సందర్భంగా బీటీ, సీసీ రోడ్లు నిర్మాణం కోసం రూ.2.5కోట్లు మంజూరయ్యాయి. ఈ పనులు ఇంకా పూర్తి కాలేదు. గ్రామ సమీపం నుంచి ఘాట్ల వరకు వేస్తున్న సీసీ రోడ్డు నిర్మాణం ఇంకా కొనసాగుతోంది. అక్కడక్కడా నాసిరకంగా పనులు చేయడంతో కంకర తేలి నెర్రెలు కనిపిస్తున్నాయి. 4.09 కిలోమీటర్ల రోడ్లు మంజూరు కాగా, ఇప్పటి వరకు 60శాతమే పూర్తయ్యాయి. సీసీ రోడ్లకు వాటర్ క్యూరింగ్ చేయడం లేదు. పుష్కరాలు ప్రారంభమయ్యే నాటికి పనులు పూర్తయ్యేలా కనిపించడం లేదు. సోమశిలలో ప్రధాన పుష్కరఘాట్ వరకు వేస్తున్న బైపాస్ రోడ్డు పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. అమరగిరి, మల్లేశ్వరం గ్రామాల్లో వేసిన రోడ్లు దాదాపుగా 90శాతం పూర్తయ్యాయి. ఈ రోడ్లన్నీ పీఆర్ నిధుల నుంచి వేస్తున్నారు. పుష్కరాల సమయం దగ్గర పడుతుండటంతో కాంట్రాక్టర్లు రోడ్ల పనులు నాసిరకంగా చేస్తున్నారని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. కాంట్రాక్టర్లు ప్రజాధనాన్ని దోచుకోవటానికే పుష్కరాల పనులు వచ్చాయని, వీటి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని వాపోతున్నారు.
Advertisement
Advertisement