ఎస్సీలపై మంత్రి ‘పల్లె’ వివక్ష | lhps leaders fires minister palle | Sakshi

ఎస్సీలపై మంత్రి ‘పల్లె’ వివక్ష

Dec 29 2016 10:35 PM | Updated on Aug 29 2018 7:39 PM

రెండు దశాబ్దాలుగా మంత్రి పల్లె రఘునాథరెడ్డి కోసం, టీడీపీ బలోపేతానికి కృషి చేశాను. అయినా ఎస్సీనైన నాకు పార్టీలో ఏ మాత్రం గుర్తింపు ఇవ్వకుండా మంత్రి పల్లె తీవ్రంగా అవమానిస్తున్నారు.

పుట్టపర్తి టౌన్‌ : ‘‘రెండు దశాబ్దాలుగా మంత్రి పల్లె రఘునాథరెడ్డి కోసం, టీడీపీ బలోపేతానికి కృషి చేశాను. అయినా ఎస్సీనైన  నాకు పార్టీలో ఏ మాత్రం గుర్తింపు ఇవ్వకుండా మంత్రి పల్లె తీవ్రంగా అవమానిస్తున్నారు. దీంతో మనస్థాపానికి గురై మార్కెట్‌యార్డ్‌ డైరెక్టర్‌ పదవికి రాజీనామా చేస్తున్నా’’ అంటూ నగరపంచాయతీ పరిధిలోని బడేనాయక్‌ తండాకు చెందిన దేవేంద్రనాయక్‌ ప్రకటించారు. స్థానిక సాయిఆరామంలో గురువారం లంబాడ హక్కుల పోరాట సమితి నాయకులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. పల్లె రఘునాథరెడ్డి కోసం 1998లో అనంతపురంలో ఆందోళనలు చేశానని, తన సొంత వార్డు బడేనాయక్‌ తండాలో పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నానన్నారు.

అయితే తనను, తన వార్డును మంత్రి పల్లె తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. నగర పంచాయతీలో తన వార్డులోని టీడీపీ కార్యకర్తలకు కాంట్రాక్ట్‌ ఉద్యోగాలు, ఎస్టీ రుణాలు మంజూరులో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. కష్టపడి పనిచేసిన తనలాంటి కార్యకర్తలను విస్మరిస్తూ ఇటీవల పార్టీలో చేరిన ధనవంతులు, వ్యాపారులకు ప్రాధాన్యతనిస్తున్నాడని ఆరోపించారు. తనకు 2016 ఫిబ్రవరిలో పెనుకొండ మార్కెట్‌యార్డు డైరెక్టర్‌ పదవి ఇచ్చారని,ఇది నామమాత్రమేనని ఎలాంటి ప్రాధాన్యతా లేదన్నారు. మంత్రి పల్లె దృష్టికి తాను బడేనాయక్‌ తడా సమస్యలు తీసుకెళ్తే ఒక్కటీ పరిష్కరించలేదన్నారు. పార్టీ సభ్యత్వం పొందిన 140 మందితోపాటు మరో 300 మంది గిరిజనులతో కలసి టీడీపీని వీడాలనుకుంటున్నామని త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు.

లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవినాయక్‌ మాట్లాడుతూ టీడీపీలో ఎస్టీలను ఓట్ల కోసమే వాడుకుంటారే తప్ప రాజకీయంగా ఎదగనివ్వడం లేదన్నారు. సమావేశంలో ఎల్‌హెచ్‌పీఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి విజయకుమార్‌ నాయక్, నాయకులు లోకేష్‌నాయక్, బాలాజీనాయక్, సాయికుమార్‌నాయక్, గణేనాయక్, శ్యాంకుమార్‌నాయక్, నాగేంద్రనాయక్, కిరణ్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

దేవేంద్రనాయక్‌ సస్పెండ్‌ :  పెనుకొండ మార్కెట్‌ యార్డు డైరెక్టర్‌ దేవేంద్రనాయక్‌ను టీడీపీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నామని పార్టీ పట్టణ కన్వీనర్‌ రామాంజనేయులు తెలిపారు. గురువారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ పార్టీని మంత్రి పల్లెను కించపరుస్తూ బహిరంగంగా ప్రకటనలు చేయడంతో దేవేంద్రపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement