లైబ్రరీ ఆన్ వీల్స్
గచ్చిబౌలి: విద్యార్థుల్లో పుస్తక పఠనంపై ఆసక్తి పెంపొందించాల్సిన అవసరం ఉందని బ్లూక్రాస్ సొసైటీ వ్యవస్థాపకురాలు, సినీ నటి అక్కినేని అమల అన్నారు. కొండాపూర్‌లోని చిరెక్ పబ్లిక్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో మొబైల్ లైబ్రరీ (లైబ్రరీ ఆన్ వీల్స్), ఆడిటోరియాలను ఆమె శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం స్కూల్ మేనేజ్‌మెంట్ మొబైల్ లైబ్రరీ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ రత్నారెడ్డి మాట్లాడుతూ మొబైల్ లైబ్రరీ వారంలో ఒక రోజు మసీద్‌బండ (శేరిలింగంపల్లి) స్కూల్‌కు వెళ్తుందన్నారు. చిరెక్ స్టూడెంట్స్ అక్కడికి వెళ్లి ప్రభుత్వ విద్యార్థులతో చదివిస్తారని చెప్పారు. ఈ బస్‌లో తెలుగు, హిందీ పుస్తకాలు, చార్టులు ఉన్నాయి. విద్యార్థుల విరాళాలతో పుస్తకాలు సమకూర్చామన్నారు. ప్రిన్సిపల్ ఇఫ్రత్ ఇబ్రహీం, జోషి తదితరులు పాల్గొన్నారు.