mobile library
-
స్కూటర్‌పైనే స్కూలు: టీచర్ వినూత్న ప్రయోగం
సాక్షి, భోపాల్: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు స్కూళ్లకు దూరంగా ఉండాల్సి వచ్చింది. లాక్డౌన్ నిబంధనలకారణంగా ఆన్లైన్ చదువులకు పరిమితం కావల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్ సదుపాయాలు, స్మార్ట్ఫోన్లు లేక గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులు పడ్డ కష్టాలు, ఆవేదన ఇంతా అంతాకాదు. స్మార్ట్ఫోన్లు కొనే స్తోమత లేక చాలామంది విద్యను కోల్పోయారు. ఈ సంక్షోభ సమయంలో అటు ఉపాధ్యాయులు కూడా ఇబ్బందలునెదుర్కోవాల్సి వచ్చింది. అయినా కూడా ఈ విపత్కర పరిస్థితుల్లో విద్యార్థులను ఆదుకునేందుకు, వారిల్లో ఆత్మస్థయిర్యాన్ని నింపేందుకు పలువురు ఉపాధ్యాయులు వినూత్న ఆలోచనలతో ముందుకు రావడం మనం చూశాం. తాజాగా మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు శ్రీవాస్తవ వార్తల్లోనిలిచారు. పేద విద్యార్థులకు స్మార్ట్ఫోన్లను కొనివ్వడమేకాదు, తనకున్న పరిమితమైన వనరులతో విద్యార్థులకు పుస్తకాలు అందుబాటులో ఉండేలా చొరవ తీసుకోవడం ప్రశంసనీయంగా నిలిచింది. శ్రీవాస్తవ తన స్కూటర్‌పై మినీ లైబ్రరీని ఏర్పాటు చేసి సాగర్‌లోని వివిధ గ్రామాల్లోని విద్యార్థులకు బోధిస్తున్నారు. ఇక్కడ చాలామంది పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులున్నారు. వారికి స్మార్ట్ఫోన్లు కొనలేని కారణంగా ఆన్లైన్ విద్యను పొందలేకపోతున్నారు అందుకే తానీ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. అంతేకాదు చాలా ప్రాంతాల్లో మొబైల్ నెట్వర్క్ కూడా పెద్ద సమస్య. వీటిన్నింటినీ దృష్టిలో ఉంచుకుని, తన విద్యార్థులకు 5 స్మార్ట్ఫోన్లను కొని ఇచ్చానని, అలాగే పుస్తకాలు కొనలేని విద్యార్థులకు బుక్స్ అందుబాటులోకి తీసుకొచ్చానన్నారు. తన లైబ్రరీలోని పుస్తకాలను 2-3 రోజులు ఉంచుకోవచ్చని వెల్లడించారు. ఏది ఏమైనా పిల్లలు చదువుకోవడమే తన లక్ష్యమని చెప్పారు. దీంతో ఆయనపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థులు, ఉపాధ్యాయుల అపురూప బంధాన్ని గుర్తు చేసు కుంటున్నారు. -
ఆమె ఒక నడిచే గ్రంథాలయం
మొబైల్ లైబ్రరీలు తెలుసు. టూ వీలర్ మీద వచ్చి పుస్తకాలు ఇచ్చి వెళ్లేవారు కూడా ఉన్నారు. కాని 64 ఏళ్ల రాధామణికి రెండు కాళ్లే వాహనం. రోజుకు నాలుగు కిలోమీటర్లు చుట్టుపక్కల పల్లెలకు తిరిగి స్త్రీలకు ఆమె పుస్తకాలు ఇస్తుంది. తిరిగి తెచ్చుకుంటుంది. ఊరి గ్రంథాలయ నిర్వహణలో భాగంగా గత 8 ఏళ్లుగా ఆమె సాగిస్తున్న నడక కొన్ని వెలుతురు నక్షత్రాలనైనా ఉదయించేలా చేస్తోంది. వాకింగ్ లైబ్రరీగా పేరు తెచ్చుకున్న రాధామణి పరిచయం ఇది. ఈశాన్య కేరళలో చిన్న ఊరైన వాయనాడ్‌లో నివసించే 64 ఏళ్ల రాధామణి దిన చర్య మనం తెలుసుకోదగ్గది. ఆమె ఐదున్నరకంతా నిద్ర లేస్తుంది. తొమ్మిది లోపు ఇంటి పనులన్నీ పూర్తి చేసుకుంటుంది. ఆ తర్వాత ఆ పక్కనే ఉన్న లైబ్రరీకి ఉద్యోగం నిమిత్తం వెళుతుంది. అక్కడ ఒక సంచిని తీసుకుని పుస్తకాలను పెట్టుకుంటుంది. ఆ తర్వాత సాయంత్రం వరకూ ఆమె చుట్టు పక్కల నాలుగు కిలోమీటర్ల వరకూ ఉండే ఇళ్లకు తిరుగుతూ ఉంటుంది. ఎందుకు? అక్కడి శ్రామిక స్త్రీలకు పుస్తకాలు ఇచ్చేందుకు. వారు చదువుకున్నవి తెచ్చుకునేందుకు. అలా ఆమె గత ఎనిమిదేళ్లుగా అలుపెరగక చేస్తూనే ఉంది. స్త్రీ చదువుకోవాలి కేరళ ప్రభుత్వం ప్రజలలో పఠనాభిలాష గురించి అందునా స్త్రీల పఠనాభిలాష గురించి శ్రద్ధ పెడుతోంది. ప్రతి ఊళ్లో గ్రంథాలయాల ఏర్పాటును ప్రోత్సహిస్తోంది. ఆ గ్రంథాలయాలను నిర్వహించడానికి, సభ్యత్వాలు కట్టించడానికి స్త్రీలనే నియమిస్తోంది. ఆ కార్యక్రమాన్ని అక్కడ ‘వనితా వయోజక పుస్తక వితరణ పద్ధతి’ అని పిలుస్తున్నారు. వాయనాడ్‌లో 60 ఏళ్లుగా లైబ్రరీ ఉంది. అందరూ అక్కడికి వచ్చి చదువుకునేవారు. అయితే పని చేసుకుని జీవించే స్త్రీలు లైబ్రరీకి వచ్చి చదవలేరు. అంత సమయం ఉండదు. అందుకే వారి దగ్గరకే పుస్తకాలు తీసుకెళ్లి ఇచ్చే ఉద్యోగులను లైబ్రరీలు నియమించుకున్నాయి. రాధామణి 8 ఏళ్ల క్రితం ఆ ఉద్యోగంలో చేరింది. వారపత్రికలతో మొదలెట్టి.... రాధామణి చాలా కాలం ఒక ప్రింటింగ్ ప్రెస్‌లో చిన్న ఉద్యోగం చేసింది. ఆ తర్వాత ప్రైమరీ టీచర్‌గా పని చేసింది. ఆ పని నుంచి బయటపడే సమయానికి లైబ్రరీలో ఉద్యోగం దొరికింది. ‘నేనూ స్త్రీనే. నాకు లోకం పుస్తకాల ద్వారానే తెలిసింది. నా తోటి స్త్రీలు కూడా పుస్తకాల ద్వారాన్నే ఈ ప్రపంచాన్ని తెలుసుకోవాలి’ అని రాధామణి అంటుంది. ఇప్పుడు వాయనాడ్ లైబ్రరీకి 130 మంది సభ్యులు ఉన్నారు. వారిలో 90 మంది స్త్రీలే. వాటిలో చాలా సభ్యత్వాలను రాధామణి కట్టించింది. కొందరి సభ్యత్వ రుసుం తనే కట్టింది కూడా. ‘వారి చదువుకోవాలనే కోరికకు డబ్బు అవరోధం కాకూడదు’ అంటుంది. రాధామణి ఇంటింటికి తిరిగి పుస్తకాలు ఇచ్చేటప్పుడు మొదట చాలామంది స్త్రీలు పాపులర్ వారపత్రికలనే అడిగేవారు. కాని మెల్లమెల్లగా నవలలు... ఇప్పుడు విజ్ఞానం కలిగించే పుస్తకాలను అడిగి చదువుతున్నారు. ‘వారు చదివిన పుస్తకాల్లోని విశేషాలు వారు చెప్పేటప్పుడు ఆ కళ్లల్లో వెలుగు నాకు చాలా సంతోషం కలిగిస్తుంది’ అంటుంది రాధామణి. నడిచే గ్రంథాలయం 64 ఏళ్ల వయసులో రాధామణి వాహనం నడపలేదు. ఇంటింటికి తిరిగేందుకు ఆమెకు ప్రత్యేక వాహనం లేదు. అందుకే ఆమె నడిచి తిరుగుతుంది. అందువల్ల ఆమెను ‘నడిచే గ్రంథాలయం’ అంటారు. భర్త నడిపే చిల్లర అంగడిలో సాయంత్రాలు అతనికి సాయం చేస్తుంది రాధామణి. పుస్తకాలతోనే ఆమె ప్రపంచం. పుస్తకాలు చదివి చదివి రాధామణి ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం సంపాదించింది. కొంచెం ఫ్రెంచ్ కూడా నేర్చుకుంది. ఆమెకు పర్యాటక ప్రాంతాలంటే ఇష్టం కనుక ప్రపంచంలోని చాలా పర్యాటక స్థలాల గురించి ఇట్టే చెబుతుంది. పుస్తకానికి మించిన సంపద లేదని పెద్దలు అంటారు. పుస్తకాన్ని మనమంతా బాగా చదవాలని రాధామణి పిలుపునిస్తోంది. – సాక్షి ఫ్యామిలీ -
ఆఖరి ఆదివారం
ఒలియా అనేది ఒడిశా రాష్ట్రంలో ఒక చిన్న గిరిజన గ్రామం. అక్కడ జనాభా వెయ్యి కంటె తక్కువే. ఈ గ్రామం భువనేశ్వర్ నుంచి 110 కి. మీ. దూరంలో ఉంది. ఇంత తక్కువమంది ఉన్న ఈ గ్రామంలో చదువుకున్న వారు 70 శాతానికి పైగానే ఉన్నారు. అయితే వారిలో పుస్తకాలు చదివే అవకాశం కొద్దిమందికి మాత్రమే ఉంది! ఇది గమనించిన స్థానిక తరిణి నోడల్ అప్పర్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులు గ్రామంలో అందరికీ పుస్తకాలు అందుబాటులోకి తేవాలనుకున్నారు. తమ టీచర్ అయిన ప్రజ్ఞా ప్రమీత తో ఈ విషయం చెప్పినప్పుడు వారికో పరిష్కారం దొరికింది. వారి గ్రామంలో ఒక్క లైబ్రరీ కూడా లేదు. సొంత లైబ్రరీని ఏర్పాటు చేసుకుంటే ఈ సమస్యకు పరిష్కారం దొరికినట్లేనని భావించారు. అది కూడా సంచార లైబ్రరీ అయితే మంచిదనుకున్నారు. ఆ ఆలోచనకు పాఠశాల హెడ్మాస్టర్ ఎంతో సంతోషించారు. తన వంతు ప్రోత్సాహం విద్యార్థులకు అందించారు. రంగురంగుల పుస్తకాలు బయటకు కనిపిస్తూ, అందరినీ ఆకర్షించేలా వెదురుతో ఒక మొబైల్ బుక్ ర్యాక్ తయారుచేశారు. అందులో పుస్తకాలను అందంగా, ఆకర్షణీయంగా అమర్చారు. ‘రండి చదవండి’ అనే నినాదాలతో బ్యానర్లు తయారుచేశారు. వీటిని చూసి గ్రామస్థులు ఆకర్షితులయ్యారు. పుస్తకాలకు సంబంధించిన సమాచారాన్ని ఒక పుస్తకంలో పొందు పరచడానికి అనువుగా పన్నెండు మంది విద్యార్థులతో ఒక కమిటీ ఏర్పాటుచేశారు. ప్రతి నెల ఆఖరి ఆదివారం ఈ లైబ్రరీ ఒలియా గ్రామానికి వస్తుంది. అలా గ్రామస్థులు పుస్తకాలు చదవడానికి అలవాటు పడ్డారు. ఎప్పుడు ఆఖరి ఆదివారం వస్తుందా అని ఎదురుచూడటం ప్రారంభించారు. ఈ గ్రామంలో మొబైల్ లైబ్రరీ నడుస్తోందనే విషయం ఇరుగుపొరుగు గ్రామాల వరకు వ్యాపించింది. వారి గ్రామాలు కూడా లైబ్రరీని తీసుకురమ్మని ఈ విద్యార్థులను ఆహ్వానిస్తున్నారు. ఇది తెలిసి టాటా స్టీల్స్ వారి పాఠశాల (ఒడిశా) లలో కూడా అందరికీ పుస్తకాలు అందుబాటులో ఉండేలా చూశారు. ఇంత విజయం సాధించిన ఈ ప్రాజెక్టుకి ‘పార్లే – జి’ వారు ‘ఈజీ టు రెప్లికేట్’ విభాగంలో 50,000 రూపాయల నగదు బహుమతి అందచేశారు. ఇప్పుడు తరిణి నోడల్ అప్పర్ ప్రైమరీ పాఠశాలలో 6 – 14 సంవత్సరాల వయసున్న విద్యార్థులతో పాటు, తల్లిదండ్రులు, టీచర్లు అందరూ ఈ మొబైల్ లైబ్రరీలో పాలు పంచుకుంటున్నారు. ఈ లైబ్రరీ పుస్తకాలం కోసం ఒక తరగతి గదిని ప్రత్యేకంగా కేటాయించారు. నెలకోసారి లైబ్రరీ కమిటీ సమావేశమై లైబ్రరీకి సంబంధించిన అంశాలను చర్చిస్తున్నారు. – రోహిణి -
లైబ్రరీ ఆన్ వీల్స్
గచ్చిబౌలి: విద్యార్థుల్లో పుస్తక పఠనంపై ఆసక్తి పెంపొందించాల్సిన అవసరం ఉందని బ్లూక్రాస్ సొసైటీ వ్యవస్థాపకురాలు, సినీ నటి అక్కినేని అమల అన్నారు. కొండాపూర్‌లోని చిరెక్ పబ్లిక్ ఇంటర్నేషనల్ స్కూల్లో మొబైల్ లైబ్రరీ (లైబ్రరీ ఆన్ వీల్స్), ఆడిటోరియాలను ఆమె శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం స్కూల్ మేనేజ్మెంట్ మొబైల్ లైబ్రరీ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ రత్నారెడ్డి మాట్లాడుతూ మొబైల్ లైబ్రరీ వారంలో ఒక రోజు మసీద్‌బండ (శేరిలింగంపల్లి) స్కూల్‌కు వెళ్తుందన్నారు. చిరెక్ స్టూడెంట్స్ అక్కడికి వెళ్లి ప్రభుత్వ విద్యార్థులతో చదివిస్తారని చెప్పారు. ఈ బస్‌లో తెలుగు, హిందీ పుస్తకాలు, చార్టులు ఉన్నాయి. విద్యార్థుల విరాళాలతో పుస్తకాలు సమకూర్చామన్నారు. ప్రిన్సిపల్ ఇఫ్రత్ ఇబ్రహీం, జోషి తదితరులు పాల్గొన్నారు. -
ఈ రోజుల్లో ఇలాంటి ఆలోచనా..!
టెహ్రాన్: ట్యాక్సీ అనగానే ఇప్పుడు తొలిసారి వేసే ప్రశ్న.. వైఫై ఉందా.. వీడియో కోచా అని.. ఎందుకంటే.. తీరిక లేకుండా చిన్నసైజు నుంచి పెద్ద సైజు ఎలక్ట్రానిక్ మాధ్యమాలకు మన జీవితాన్ని ఎప్పుడో అర్పించేశాం. మంచినీళ్లు లభించకున్నా ఉండగలరేమోగానీ.. చేతిలో ఓ స్మార్ట్ ఫోన్ దానికి డేటా సపోర్ట్ లేకుంటే మాత్రం క్షణమైనా నిజంగా గడ్డుకాలమేనేమో అనిపిస్తుంది. మానసిక అస్తిత్వాన్ని ఇంతగా కోల్పోయి మనం ఫార్వార్డ్ కల్చర్‌లోకి దూసుకెళుతున్నాం అని చెప్పుకుంటున్న ఈ రోజుల్లో.. ఇరాన్లో ట్యాక్సీ డ్రైవర్ మాత్రం తన ప్రయాణీకులకు ఒత్తిడి నుంచి విముక్తి ప్రసాధించే చక్కటి సౌకర్యాన్ని ఏర్పాటుచేశాడు. ఎలాంటి ఒత్తిడినైనా దూరం చేయడమేకాకుండా చక్కటి జ్ఞానం అందించగల పుస్తకాలను తన క్యాబ్‌లో పెట్టాడు. ఇదంతా ఎందుకని అంటే.. పుస్తకాలు ప్రజలను ఒత్తిడి నుంచి దూరం చేయగలవని తన విశ్వాసం అని చెప్పాడు. సాహెల్ ఫిల్సూఫ్ అనే ఈ క్యాబ్ డ్రైవర్ ఏకంగా దాన్ని ఒక మొబైల్ లైబ్రరీగా మార్చేశాడు. దాదాపు 50 పుస్తకాలు అందులో భద్రపరిచాడు. ఈ ట్యాక్సీ ఎక్కిన వారు తమ ఆలోచనకు తగిన పుస్తకాలను తీసుకొని ఏం చక్కా చదువుకోవచ్చు. ఈ పుస్తకాల్లో సైకాలజీ, పిల్లల పుస్తకాలు, చరిత్రకు సంబంధిచిన పుస్తకాలు ఉంచాడు. అందుకే తన ట్యాక్సీని మహిళలు, యువకులు ఎక్కువగా ఇష్టపడతారని అతడు చెప్పుకొచ్చాడు.