ఈ రోజుల్లో ఇలాంటి ఆలోచనా..!
టెహ్రాన్: ట్యాక్సీ అనగానే ఇప్పుడు తొలిసారి వేసే ప్రశ్న.. వైఫై ఉందా.. వీడియో కోచా అని.. ఎందుకంటే.. తీరిక లేకుండా చిన్నసైజు నుంచి పెద్ద సైజు ఎలక్ట్రానిక్ మాధ్యమాలకు మన జీవితాన్ని ఎప్పుడో అర్పించేశాం. మంచినీళ్లు లభించకున్నా ఉండగలరేమోగానీ.. చేతిలో ఓ స్మార్ట్ ఫోన్ దానికి డేటా సపోర్ట్ లేకుంటే మాత్రం క్షణమైనా నిజంగా గడ్డుకాలమేనేమో అనిపిస్తుంది.
మానసిక అస్తిత్వాన్ని ఇంతగా కోల్పోయి మనం ఫార్వార్డ్ కల్చర్లోకి దూసుకెళుతున్నాం అని చెప్పుకుంటున్న ఈ రోజుల్లో.. ఇరాన్లో ట్యాక్సీ డ్రైవర్ మాత్రం తన ప్రయాణీకులకు ఒత్తిడి నుంచి విముక్తి ప్రసాధించే చక్కటి సౌకర్యాన్ని ఏర్పాటుచేశాడు. ఎలాంటి ఒత్తిడినైనా దూరం చేయడమేకాకుండా చక్కటి జ్ఞానం అందించగల పుస్తకాలను తన క్యాబ్లో పెట్టాడు.
ఇదంతా ఎందుకని అంటే.. పుస్తకాలు ప్రజలను ఒత్తిడి నుంచి దూరం చేయగలవని తన విశ్వాసం అని చెప్పాడు. సాహెల్ ఫిల్సూఫ్ అనే ఈ క్యాబ్ డ్రైవర్ ఏకంగా దాన్ని ఒక మొబైల్ లైబ్రరీగా మార్చేశాడు. దాదాపు 50 పుస్తకాలు అందులో భద్రపరిచాడు. ఈ ట్యాక్సీ ఎక్కిన వారు తమ ఆలోచనకు తగిన పుస్తకాలను తీసుకొని ఏం చక్కా చదువుకోవచ్చు. ఈ పుస్తకాల్లో సైకాలజీ, పిల్లల పుస్తకాలు, చరిత్రకు సంబంధిచిన పుస్తకాలు ఉంచాడు. అందుకే తన ట్యాక్సీని మహిళలు, యువకులు ఎక్కువగా ఇష్టపడతారని అతడు చెప్పుకొచ్చాడు.