ఇంటికి వెళ్లి పుస్తకాలు అందిస్తున్న రాధామణి
మొబైల్ లైబ్రరీలు తెలుసు. టూ వీలర్ మీద వచ్చి పుస్తకాలు ఇచ్చి వెళ్లేవారు కూడా ఉన్నారు. కాని 64 ఏళ్ల రాధామణికి రెండు కాళ్లే వాహనం. రోజుకు నాలుగు కిలోమీటర్లు చుట్టుపక్కల పల్లెలకు తిరిగి స్త్రీలకు ఆమె పుస్తకాలు ఇస్తుంది. తిరిగి తెచ్చుకుంటుంది. ఊరి గ్రంథాలయ నిర్వహణలో భాగంగా గత 8 ఏళ్లుగా ఆమె సాగిస్తున్న నడక కొన్ని వెలుతురు నక్షత్రాలనైనా ఉదయించేలా చేస్తోంది. వాకింగ్ లైబ్రరీగా పేరు తెచ్చుకున్న రాధామణి పరిచయం ఇది.
ఈశాన్య కేరళలో చిన్న ఊరైన వాయనాడ్‌లో నివసించే 64 ఏళ్ల రాధామణి దిన చర్య మనం తెలుసుకోదగ్గది. ఆమె ఐదున్నరకంతా నిద్ర లేస్తుంది. తొమ్మిది లోపు ఇంటి పనులన్నీ పూర్తి చేసుకుంటుంది. ఆ తర్వాత ఆ పక్కనే ఉన్న లైబ్రరీకి ఉద్యోగం నిమిత్తం వెళుతుంది. అక్కడ ఒక సంచిని తీసుకుని పుస్తకాలను పెట్టుకుంటుంది. ఆ తర్వాత సాయంత్రం వరకూ ఆమె చుట్టు పక్కల నాలుగు కిలోమీటర్ల వరకూ ఉండే ఇళ్లకు తిరుగుతూ ఉంటుంది. ఎందుకు? అక్కడి శ్రామిక స్త్రీలకు పుస్తకాలు ఇచ్చేందుకు. వారు చదువుకున్నవి తెచ్చుకునేందుకు. అలా ఆమె గత ఎనిమిదేళ్లుగా అలుపెరగక చేస్తూనే ఉంది.
స్త్రీ చదువుకోవాలి
కేరళ ప్రభుత్వం ప్రజలలో పఠనాభిలాష గురించి అందునా స్త్రీల పఠనాభిలాష గురించి శ్రద్ధ పెడుతోంది. ప్రతి ఊళ్లో గ్రంథాలయాల ఏర్పాటును ప్రోత్సహిస్తోంది. ఆ గ్రంథాలయాలను నిర్వహించడానికి, సభ్యత్వాలు కట్టించడానికి స్త్రీలనే నియమిస్తోంది. ఆ కార్యక్రమాన్ని అక్కడ ‘వనితా వయోజక పుస్తక వితరణ పద్ధతి’ అని పిలుస్తున్నారు. వాయనాడ్‌లో 60 ఏళ్లుగా లైబ్రరీ ఉంది. అందరూ అక్కడికి వచ్చి చదువుకునేవారు. అయితే పని చేసుకుని జీవించే స్త్రీలు లైబ్రరీకి వచ్చి చదవలేరు. అంత సమయం ఉండదు. అందుకే వారి దగ్గరకే పుస్తకాలు తీసుకెళ్లి ఇచ్చే ఉద్యోగులను లైబ్రరీలు నియమించుకున్నాయి. రాధామణి 8 ఏళ్ల క్రితం ఆ ఉద్యోగంలో చేరింది.
వారపత్రికలతో మొదలెట్టి....
రాధామణి చాలా కాలం ఒక ప్రింటింగ్ ప్రెస్‌లో చిన్న ఉద్యోగం చేసింది. ఆ తర్వాత ప్రైమరీ టీచర్‌గా పని చేసింది. ఆ పని నుంచి బయటపడే సమయానికి లైబ్రరీలో ఉద్యోగం దొరికింది. ‘నేనూ స్త్రీనే. నాకు లోకం పుస్తకాల ద్వారానే తెలిసింది. నా తోటి స్త్రీలు కూడా పుస్తకాల ద్వారాన్నే ఈ ప్రపంచాన్ని తెలుసుకోవాలి’ అని రాధామణి అంటుంది. ఇప్పుడు వాయనాడ్ లైబ్రరీకి 130 మంది సభ్యులు ఉన్నారు. వారిలో 90 మంది స్త్రీలే. వాటిలో చాలా సభ్యత్వాలను రాధామణి కట్టించింది. కొందరి సభ్యత్వ రుసుం తనే కట్టింది కూడా. ‘వారి చదువుకోవాలనే కోరికకు డబ్బు అవరోధం కాకూడదు’ అంటుంది. రాధామణి ఇంటింటికి తిరిగి పుస్తకాలు ఇచ్చేటప్పుడు మొదట చాలామంది స్త్రీలు పాపులర్ వారపత్రికలనే అడిగేవారు. కాని మెల్లమెల్లగా నవలలు... ఇప్పుడు విజ్ఞానం కలిగించే పుస్తకాలను అడిగి చదువుతున్నారు. ‘వారు చదివిన పుస్తకాల్లోని విశేషాలు వారు చెప్పేటప్పుడు ఆ కళ్లల్లో వెలుగు నాకు చాలా సంతోషం కలిగిస్తుంది’ అంటుంది రాధామణి.
నడిచే గ్రంథాలయం
64 ఏళ్ల వయసులో రాధామణి వాహనం నడపలేదు. ఇంటింటికి తిరిగేందుకు ఆమెకు ప్రత్యేక వాహనం లేదు. అందుకే ఆమె నడిచి తిరుగుతుంది. అందువల్ల ఆమెను ‘నడిచే గ్రంథాలయం’ అంటారు. భర్త నడిపే చిల్లర అంగడిలో సాయంత్రాలు అతనికి సాయం చేస్తుంది రాధామణి. పుస్తకాలతోనే ఆమె ప్రపంచం. పుస్తకాలు చదివి చదివి రాధామణి ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం సంపాదించింది. కొంచెం ఫ్రెంచ్ కూడా నేర్చుకుంది. ఆమెకు పర్యాటక ప్రాంతాలంటే ఇష్టం కనుక ప్రపంచంలోని చాలా పర్యాటక స్థలాల గురించి ఇట్టే చెబుతుంది. పుస్తకానికి మించిన సంపద లేదని పెద్దలు అంటారు.
పుస్తకాన్ని మనమంతా బాగా చదవాలని రాధామణి పిలుపునిస్తోంది.
– సాక్షి ఫ్యామిలీ
Comments
Please login to add a commentAdd a comment