కరువు మండలాల్లో రుణాలు రీషెడ్యూల్
-
ఎరువుల దుకాణాల్లో స్వైపింగ్ మిషన్లు
-
కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు
నెల్లూరు(పొగతోట):
జిల్లాలోని 27 కరువు మండలాల్లో రుణాలను రీషెడ్యూల్ చేసి రైతులకు కొత్త రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం తన చాంబర్‌లో వ్యవసాయ శాఖ, బ్యాంకు అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. కొత్త రుణాలు రైతుల అకౌంట్లలో జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. కరువు లేని మండలాల్లో రైతులకు సకాలంలో రుణాలు మంజూరు చేయాలన్నారు. రుణాల రీషెడ్యూల్‌కు సంబంధించి రైతుల జాబితా బ్యాంకు అధికారులకు అందజేయాలని సూచించారు. జిల్లాలోని 640 ఎరువులు, పురుగుమందుల దుకాణాల్లో స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. రైతులకు డెబిట్ కార్డులు పంపిణీ చేసి వాటిని వినియోగించే విధానంపై అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో వ్యవసాయ శాఖ జేడీ ఎం.హేమమహేశ్వరరావు, ఏపీజీబీ ఆర్‌ఎం బీవీ శివయ్య, మత్స్యశాఖ, పశుసంవర్ధక శాఖ జేడీలు సీతారామరాజు, శ్రీధర్‌కుమార్ పాల్గొన్నారు.