పోలీసుల దెబ్బలకే చనిపోయాడా.?
♦ ఎర్రగుంట్ల పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి మృతి
♦ కడప ఆర్డీఓ ఆధ్వర్యంలో మెజిస్ట్రీరియల్ విచారణ
♦ పోలీసులే చంపారని మృతుడి బంధువుల ఆరోపణ
ఎర్రగుంట్ల పోలీసుల అదుపులో ఉన్న ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు చిత్రహింసలకు గురిచేయడం వల్లనే మృతిచెందాడని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. దీనిపై న్యాయవిచారణ జరపాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
కడప అర్బన్: ఎర్రగుంట్ల పోలీసుల ఓవరాక్షన్.. విచారణ విధానం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బుధవారం అర్ధరాత్రి ఎర్రగుంట్ల పోలీసుల అదుపులో ఉన్న దయ్యాల ప్రసాద్‌రెడ్డి(50) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతన్ని ఓ లాడ్జీలో ఉంచి విచారించే క్రమంలో పోలీసులు చిత్రహింసలకు గురి చేయడంతోనే మృతి చెందాడని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనపై మృతుని బంధవుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.
చిత్తూరు జిల్లా పుత్తూరు జెండామాను వీధిలో నివాసముంటున్న ప్రసాద్‌రెడ్డి పాల ట్యాంకర్ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి రాజేష్ కుమార్‌రెడ్డి, సురేష్‌కుమార్‌రెడ్డి అనే కుమారులు ఉన్నారు. మూడురోజుల క్రితం ఎర్రగుంట్ల పోలీసులు ప్రసాద్ రెడ్డిని పుత్తూరు నుంచి తీసుకుని వచ్చారు. తమ కస్టడీలో ఉంచుకుని విచారిస్తుండగా పోలీసులు కొట్టిన దెబ్బలకు తట్టుకోలేక తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలాడు. హడావుడిగా స్థానిక ఆర్‌ఎంపీ వైద్యుని దగ్గర పరీక్షలు చేయించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వెంటనే కడప రిమ్స్‌కు తీసుకెళ్లారు. బుధవారం అర్ధరాత్రి 1:15 గంటలకు (గురువారం తెల్లవారు జాము) మృతి చెందాడని రిమ్స్ వైద్యులు నిర్ధారించారు. పోలీసులు గురువారం ఉదయం మృతుని బంధువులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం కార్వేటినగరం అలతూరులో ఉంటున్న ప్రసాద్ రెడ్డి సోదరుడు మనోహర్ రెడ్డి, బావమరిది కృష్ణారెడ్డి, కుమారుడు సురేష్ కుమార్ రెడ్డి, ఇంకా బంధువులను స్వయంగా పోలీసులు కడపకు తీసుకుని వచ్చారు.
లాడ్జిలో ఎందుకు ఉంచారు?
సాధారణంగా ఏదైనా కేసులో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుంటే పోలీసు స్టేషన్లలోనే విచారిస్తారు. ఒకవేళ తమ పోలీసు స్టేషన్‌లో విచారించడం ఇబ్బందికరమనుకుంటే ఇతర పోలీసు స్టేషన్లకు తీసుకెళ్లి అక్కడ విచారిస్తుంటారు. కానీ ప్రసాద్‌రెడ్డిని మూడు రోజుల క్రితం పుత్తూరు నుంచి తీసుకొచ్చిన పోలీసులు అతన్ని లాడ్జీలో విచారించడం ఏమిటనేది అర్థం కావడం లేదు. నిజంగా లాడ్జీలోనే ఈ సంఘటన జరిగిందా లేక మరో ప్రధానమైన ప్రాంతంలో జరిగితే దానిని ఎర్రగుంట్లలో జరిగినట్లు చిత్రీకరిస్తున్నారా అనే అనుమానం కూడా వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారంలో ఎర్రగుంట్ల సీఐ, ఎస్‌ఐలతో పాటు పోలీసు సిబ్బంది ఓవరాక్షన్ కూడా ‘పోలీస్ కస్టడీ డెత్’కు కారణమైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా, ప్రసాద్‌రెడ్డితో పాటు అదుపులోకి తీసుకున్న ఉదయ్‌కుమార్ అనే మరో వ్యక్తిని గురువారం పోలీసులు కమలాపురం కోర్టులో హాజరుపరిచారు.
పోలీసుల దెబ్బలు తట్టుకోలేకే మృతి
ఎర్రగుంట్ల పోలీసుల దెబ్బలకు తట్టుకోలేకే మా బావ మృతిచెందాడు. నోరు, ముక్కుల్లో నుంచి రక్తం కారుతోంది. మా బావ మృతికి కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. - కృష్ణారెడ్డి, మృతుని బావమరిది
మూడు రోజుల క్రితమే తీసుకుని వచ్చారు
మా అన్న దయ్యాల ప్రసాద్‌రెడ్డి పాల ట్యాంకర్ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఎలాంటి కేసులు లేవు. మూడు రోజుల క్రితం మా అన్నను ఎర్రగుంట్ల పోలీసులు తీసుకుని వచ్చారు. పోలీసులేమో ప్రసాద్ రెడ్డిని తరుముతుంటే ఆయాసపడి అనారోగ్యానికి గురయ్యాడని, తర్వాత రిమ్స్‌కు తీసుకుని రాగానే మృతి చెందాడని సమాచారం ఇచ్చారు. ఈ సంఘటనపై మెజిస్ట్రీరియల్ విచారణ జరిపించి న్యాయం చేయాలి. - దయ్యాల మనోహర్‌రెడ్డి, మృతుని సోదరుడు