ఆకివీడు కార్పొరేషన్ బ్యాంక్‌లో బంగారం చోరీ వెనుక అనుమానాలెన్నో
దొంగ చేతికి తాళాలు ఇచ్చిందెవరు
తెరవెనుక ఉన్నదెవరు
పోలీస్ దర్యాప్తు ముగించేశారెందుకో
ఏలూరు : ఆకివీడు కార్పొరేషన్ బ్యాంక్‌లో 3 కేజీలకు పైగా బంగారు ఆభరణాలను మాయం చేసిన కేసులో ఎన్నో అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. ఆ బ్యాంక్‌లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న అప్రైజర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు విషయంలో చేతులు దులిపేసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
బ్యాంక్ లాకర్ తాళాలు కాంట్రాక్ట్ ఉద్యోగి అయిన అప్రైజర్‌కు ఎలా ఇస్తారు, అతడు పెద్దఎత్తున బంగారు ఆభరణాలను తీసుకుపోతుంటే ఎవరూ ఎందుకు పట్టించుకోలేదు, వేరొకరి సాయం లేకుండానే అప్రైజర్ ఇలా చేయగలడా, ఈ వ్యవహారం వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే అంశాలపై పోలీసులు దృష్టి పెట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది.
బ్యాంక్ అధికారుల ‘ఒత్తిళ్లు‘ పోలీసులపై బాగా పని చేశాయని, వారు తమ ఉద్యోగాలు కాపాడుకోవడానికి అప్రైజర్‌ను బలి పశువును చేశారన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి. బ్యాంక్‌లో ఇంకా ఎవరికైనా సంబంధం ఉందా అన్న కోణంలో కూడా పరిశీలన జరుపుతామని ఎస్పీ భాస్కర్‌భూషణ్ ప్రకటించారు. అయితే, పూర్తిస్థాయిలో విచారణ జరపకుండా అప్రైజర్ అరెస్ట్‌ను అంత హడావుడిగా చూపాల్సిన అవసరం ఏమొచ్చిందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
పోలీసుల కథనం ప్రకారం.. ఈనెల 6న కార్పొరేషన్ బ్యాంక్ ఆకివీడు బ్రాంచి మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ వ్యక్తిగత కారణాలతో సెలవు పెట్టారు. దీంతో క్షేత్రస్థాయి అధికారి కల్యాణ్ ఆనంద్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. ఇతను కొత్తగా చేరాడని పోలీసులు చెబుతున్నారు. కోట్లాది రూపాయల టర్నోవర్ జరిగే బ్యాంక్‌లో బ్రాంచి మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ ఒకేరోజు సెలవు పెట్టడం, అదే రోజున బంగారం పోవడం అనుమానాలకు తావిస్తోంది.
పమిడి లక్ష్మీనారాయణ అనే ఖాతాదారుడు తాను తనఖా పెట్టిన నగలు విడిపించుకునేందుకు వచ్చిన సమయంలో లాకర్ తాళాలను బ్యాంక్ ఇన్‌చార్జి అప్రైజర్‌కు ఎలా ఇచ్చాడనే దానికి సమాధానం లేదు. అప్రైజర్ బ్యాంక్ మేనేజర్‌కు అత్యంత సన్నిహితంగా ఉన్నందునే అతనిపై నమ్మకంతో బ్యాంక్ తాళాలు ఇచ్చినట్టు సిబ్బంది చెబుతున్నారు.
దీనిని అలుసుగా తీసుకుని నగలు చోరీ చేశాడనేది పోలీసుల కథనం. బ్యాంక్ ఉద్యోగికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించిన తర్వాత.. తిరిగి బాధ్యతలు తీసుకునే సమయంలో అన్ని వస్తువులు, నగదు సక్రమంగా ఉన్నాయా అన్నది పరిశీలించాల్సిన బాధ్యత బ్యాంక్ మేనేజర్ లేదా అసిస్టెంట్ మేనేజర్‌పై ఉంటుంది. అయితే 14 రోజుల తర్వాత మరో బ్యాంక్ ఖాతాదారుడు వచ్చి తనఖా పెట్టిన బంగారం తీసుకునే వరకూ బ్యాంక్‌లోని నగలు మాయమయ్యాయనే విషయాన్ని ఎందుకు గుర్తించలేకపోయారన్నది ప్రశ్నార్థకంగా మారింది.
బ్యాంక్‌లో పైస్థాయి ఉగ్యోగులు ఇటీవల ఏలూరుతోపాటు పలు నగరాల్లో ఆస్తులు కొనుగోలు చేసినట్టు సమాచారం. కార్పొరేషన్ బ్యాంక్‌లో వ్యవహారాలన్నీ అప్రైజరే చక్కదిద్దేవారని, ఈ కారణంగానే కొత్తగా విధుల్లో చేరిన ఉద్యోగులు అతడు చెప్పినట్టు చేయాల్సి వచ్చిందనేది మరో వాదన.
ఈ వ్యవహారం బయటకి పొక్కడంతో ఆకివీడు బ్రాంచి మేనేజర్ ఫిర్యాదు చేయడానికి సిద్ధపడినా వద్దని, అతనిపై అనుమానంతో విజయవాడ జోనల్ కార్యాలయం నుంచి వచ్చిన చీఫ్ మేనేజర్ బాలాజీరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పరిణామాలతో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని, అప్రైజర్‌పైనే నెపం మోపి మిగిలిన వారిని కాపాడారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
బ్యాంక్ అధికారుల సహకారం లేకుండా స్ట్రాంగ్ రూమ్ తాళాలు అప్రైజర్‌కు ఎలా అందుతాయని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. బ్యాంక్‌లో అప్రైజర్ తల్లి పేరున లాకర్ ఉందని, ఆ లాకర్ తెరవడానికి వచ్చినపుడు అప్రైజర్ కూడా లోపలకు వె ళ్లి బంగారు ఆభరణాలను తన లాకర్‌లోకి మార్చుకుని, తర్వాత బయటకు తీసుకువెళ్లాడనే ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు. బ్యాంక్‌లో విలువైన దస్తావేజులు కూడా కనిపించడం లేదన్న ప్రచారం సాగుతోంది. దీనిపై బ్యాంక్ అధికారులు స్పందించడం లేదు. ఇప్పటికైనా పోలీసులు పూర్తిస్థాయిలో ఈ వ్యవహారంపై దృష్టి పెట్టి ఇంటి దొంగల పనిపట్టాలని బ్యాంక్ ఖాతాదారులు కోరుతున్నారు.