ఆలయం వద్ద కుటుంబ సభ్యులతో ఎన్నికల అధికారి భన్వర్‌లాల్
సాక్షి,తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని గురువారం రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, సభ్యులు, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కార్గ్ దర్శించుకున్నారు. వీరికి డెప్యూటీఈవోలు కోదండరామారావు, హరీంద్రనాథ్, ఓఎస్‌డీ లక్ష్మీనారాయణ యాదవ్ ప్రత్యేకంగా శ్రీవారి దర్శనం కల్పించి, లడ్డూ ప్రసాదాలు అందజేశారు. ఉదయం నైవేద్య విరామ సమయం అనంతరం సినీనటి శ్రియ కుటుంబ సభ్యులతో కలసి ఆలయానికి వచ్చారు. ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని, తర్వాత శ్రీవారిని, వకుళమాతను దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు లడ్డూ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల వచ్చిన ఆమెను చూసేందుకు అభిమానులు, భక్తులు ఉత్సాహం చూపారు.