Lord Srinivasa
-
డాలస్‌లో శ్రీనివాసుడి కల్యాణం
డాలస్: అమెరికాలోని డాలస్‌లో శ్రీనివాస కల్యాణాన్ని వైభవంగా నిర్వహించనున్నారు.డాలస్‌లోని క్రెడిట్ యూనియన్ ఆఫ్ టెక్సాస్ ఈవెంట్ సెంటర్లో తెలుగువారి ఆధ్వర్యంలో సుప్రభాత సేవ, తోమాల సేవ, అభిషేకం, కల్యాణ సేవలను అత్యంత భక్తి ప్రపత్తులతో నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. జూన్ 25వ తేదీన అలెన్ ఈవెంట్ సెంటర్ (క్రెడిట్ యూనియన్ ఆఫ్ టెక్సాస్ ఈవెంట్ సెంటర్) వేదికగా డాలస్ తెలంగాణ ప్రజాసమితి (టీపాడ్) చేపడుతున్న ఈ విశేష కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పాల్గొననున్నారు. స్వయంగా దేవదేవతల ప్రతిరూపాలను, పూజారులను ఆయన వెంటబెట్టుకుని రానున్నారు. ఈ సందర్భంగా డాలస్‌లో ఉంటున్న తెలంగాణ, తెలుగు వారి సౌకర్యార్థం టీపాడ్ తగిన ఏర్పాట్లను చేస్తోంది. పద్మావతీ అలిమేలు సమేత శ్రీనివాసుడి దర్శనానికి వచ్చే ప్రతి ఒక్కరికి స్వామివారి లడ్డూ ప్రసాదం, విశేష పూజల్లో భాగస్వాములయ్యే వారికి తిరుమల లడ్డూతోపాటు వస్త్రం అందజేయనున్నట్టు టీపాడ్ ప్రతినిధులు తెలిపారు. అలాగే స్వామివారి విశేష సేవా కైంకర్యాల్లో పాల్గొనేవారు ముందుగా తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందని ప్రకటించారు. అందరూ ఆహ్వానితులేనని, పార్కింగ్ కూడా ఉచితమని తెలిపారు. డాలస్‌లో తిరుమల వెంకన్న దర్శన భాగ్యం కల్పించడం పట్ల స్థానిక భక్తులు ఆనందాన్ని వ్యక్తం చేశారనీ టీపాడ్ ప్రతినిధులు చెప్పారు. మరిన్ని వివరాల కోసం tpadus.org ని సంప్రదించవచ్చు. -
శ్రీవారిని దర్శించుకున్న డీజీపీ
–తిరుమల బ్రహ్మోత్సవాలపై సమీక్ష సాక్షి, తిరుమల : రాష్ట్ర డీజీపీ సాంబశివరావు గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన తొలిసారిగా ఆలయానికి వచ్చారు. వేకువజాము తోమాల సేవ, ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత ఆలయం వెలుపల తిరుపతి అర్బన్ ఎస్పీ జయలక్ష్మీ, ఇతర పోలీసు అధికారులతో కొంత సమయం బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై మాట్లాడి, పలు సూచనలు చేశారు. తర్వాత పోలీసు అతిధిగృహంలో ఆయన టీటీడీ విజిలెన్స్, పోలీసు అధికారులతో బ్రహోత్సావాలపై సమీక్షించారు. భద్రతాపరమైన విషయాలపై చర్చించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భద్రత కల్పించాలని సూచించారు. ఈ సారి బ్రహ్మోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. -
శ్రీవారి సేవలో ప్రముఖులు
సాక్షి,తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని గురువారం రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, సభ్యులు, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కార్గ్ దర్శించుకున్నారు. వీరికి డెప్యూటీఈవోలు కోదండరామారావు, హరీంద్రనాథ్, ఓఎస్డీ లక్ష్మీనారాయణ యాదవ్ ప్రత్యేకంగా శ్రీవారి దర్శనం కల్పించి, లడ్డూ ప్రసాదాలు అందజేశారు. ఉదయం నైవేద్య విరామ సమయం అనంతరం సినీనటి శ్రియ కుటుంబ సభ్యులతో కలసి ఆలయానికి వచ్చారు. ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని, తర్వాత శ్రీవారిని, వకుళమాతను దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు లడ్డూ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల వచ్చిన ఆమెను చూసేందుకు అభిమానులు, భక్తులు ఉత్సాహం చూపారు. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జగన్
తిరుమలలో శ్రీవేంకటేశ్వరుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దర్శించుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున విఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయనకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమలేశుడిని దర్శించుకున్న సమయంలో ఆ పార్టీ నేతలు రోజా, కరుణాకర్ రెడ్డి తదితరులు వైఎస్ జగన్ వెంట ఉన్నారు. ఆ తర్వాత వైఎస్ జగన్ రేణుగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి విమానంలో హైదరాబాద్ బయలుదేరారు. -
రేపు పుప్పాలగూడలో శ్రీనివాస కల్యాణం
హైదరాబాద్: పుప్పాలగూడ సెక్రటేరియట్ కాలనీలో వెలసిన వెంకటేశ్వరస్వామి దేవాలయంలో శ్రీపద్మావతి అలివేలుమంగా సమేత శ్రీనివాస కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరగనుంది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ముఖ్య ఆచార్యుల నిర్దేశంతో శృంగేరి సేవా సమితి ఆధ్వర్యంలో భక్తిశ్రద్దలతో స్వామివారి కల్యాణం నిర్వహిస్తున్నారు. భక్తులందరూ విచ్చేసి స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా సేవా సమితి అధ్యక్షుడు వంగల కేశవ భట్ కోరారు.