హంస వాహనంపై ఊరేగుతున్న వెంకటరమణుడు
రాయంచపై రఘుకుల నందనుడు
Published Tue, Oct 4 2016 10:39 PM | Last Updated on Mon, Sep 4 2017 4:09 PM
– వేడుకగా వాహన సేవల ఊరేగింపు
– స్నపన తిరుమంజనంలో సేద తీరిన శ్రీవారు
– కోలాహలంగా భజన, సాంస్కృతిక కార్యక్రమాలు
– వెలవెలబోయిన భక్తుల గ్యాలరీలు
సాక్షి,తిరుమల:
తిరుమలేశుని బ్రహ్మోత్సవ సంబరాలు వైభవంగా సాగుతున్నాయి. మంగళవారం రాత్రి హంస వాహనంపై ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. కాగా తొలి రెండు రోజుల ఉత్సవాలకు భక్తజనం చాలా పలుచగా కనిపించారు. మంగళవారం వాహన సేవల్లో భక్తుల గ్యాలరీలు ఖాళీగా కనిపించాయి. మాడ వీధులు, గ్యాలరీలు బోసిపోయాయి. వాహన సేవల ముందు వీఐపీలు, వారి బంధుగణం సందడి మాత్రమే కనిపించింది. పోలీసులు మాత్రం నిండుగా కనిపించారు. రద్దీ తక్కువగా ఉన్నప్పటికీ భక్తులను నియంత్రించేందుకు భద్రతా సిబ్బంది ఉత్సాహం చూపారు.
తిరుమలపై శ్రీవారి బ్రహోత్సవ కోలాహలం ఉట్టిపడుతోంది. రెండో రోజు మంగళవారం ఉదయం చిన్నశేషవాహన సేవలో మలయప్ప స్వామివారు బద్రీనారాయణుడి రూపంలో ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు. ఈసారి బ్రహ్మోత్సవాల్లో తొలి స్నపన తిరుమంజన సేవలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారు ఉత్సవమూర్తులు సేద తీరారు. ఆలయంలోని రంగనాయక మండపంలో ఈ వేడుక ఘనంగా జరిగింది. పుష్పాలు, పండ్లతో అలంకరించిన మండపంలో విశేషంగా ఉత్సవర్లు ఈ ప్రత్యేక సేవ అందుకున్నారు. ఆ తర్వాత కొత్త కొలువు మండపంలో మంగళవారం రాత్రి 7 గంటలకు వేయి నేతి దీపాల వెలుగులో స్వామివారు ఊయలూగుతూ భక్తులకు కనువిందు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంతం వద్ద భక్తుల సందడి కొంత కనిపించింది. అనంతరం రాత్రి రాత్రి 9 గంటలకు నిర్వహించిన హంసవాహన సేవలో కూడా భక్తులు పలుచగా కనిపించారు. వాహన సేవల ముందు కోలాటాలు, చెక్క భజనలు, భజన బందాలు, వేషధారణలు, ఉడిపి వాయిద్యాలు, కేరళ చండి నృత్యం, మహారాష్ట్ర కళాకారుల డోలు వాయిద్యాల కోలాహలంతో వాహన సేవల్లో సాంస్కృతిక శోభ కనిపించింది. కళాకారుల అభినయం, వేషధారణలు భక్తులు విశేషంగా అలరించాయి. మరోవైపు ఆలయం, పుష్కరిణి, నాలుగు మాడవీధుల్లో వివిధ రకాల పుష్పాలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పాపవినాశనం రోడ్డు మార్గంలో ఏర్పాటు చేసిన పుష్ప, ఫొటో ప్రదర్శనశాలకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. రంగురంగుల విద్యుత్ అలంకరణలు, దేవతామూర్తులు కటౌట్లు భక్తులను కనువిందు చేశాయి. ఆలయ ప్రాంతం స్వర్ణకాంతులతో మెరుస్తోంది. ఉత్సవ ఊరేగింపు సందర్భంలో భక్తుల గోవింద నామ స్మరణ మారుమోగింది.
5గంటల్లో శ్రీవారి దర్శనం
అలిపిరి: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ తగ్గింది. ఉదయం 3 గంటల నుంచి సాయంత్రం 6 వరకు 62,155 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి 11 కంపార్ట్‌మెంట్లోని సర్వదర్శనం భక్తులకు 5 గంటలు, కాలిబాట ¿¶ క్తులకు 3 గంటల్లో శ్రీవారి దర్శనం లభిస్తోంది. గదులు ఖాళీ లేవు. శ్రీవారి హుండీ కానుకలు రూ.1.78 కోట్లు లభించాయి.
Advertisement
Advertisement