సరుకు రవాణాకు బ్రేక్!
► మొదటి రోజు లారీల సమ్మె పాక్షికం
► దూరప్రాంతాల నుంచి వస్తున్న లారీలకోసం వెసులుబాటు
► నేటి నుంచి ఉధృతం చేస్తామన్న నేతలు
ఒంగోలు క్రైం: దక్షిణ భారతదేశ రాష్ట్రాలకు చెందిన లారీ అసోసియేషన్లు చేపట్టిన లారీల బంధ్ మొదటి రోజు గురువారం పాక్షికంగా జరిగింది. ఒంగోలు లారీ ఓనర్ల యూనియన్ ఆధ్వర్యంలో నేతలు రోడ్లపైకి వచ్చారు. మార్టూరు నుంచి ఉలవపాడు వరకు ఉన్న అన్ని యూనియన్లు సమ్మెకు మద్దతు పలికాయి. ఒంగోలు లారీ ఓనర్స్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక యూనియన్ కార్యాలయం వద్ద టెంట్ వేసుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. మొదటి రోజు కావటంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే లారీల కోసం కొంత వెసులు బాటు కల్పించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన లారీలను ఎక్కడికక్కడే ఆపేవిధంగా శుక్రవారం నుంచి కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. దూర ప్రాంతాల నుంచి జిల్లాకు రావాల్సిన, ఇతర జిల్లాలకు వెళ్లాల్సిన లారీలను నిర్బంధించలేదు.
ఒంగోలు లారీ యూనియన్ కార్యాలయం వద్ద యూనియన్ అధ్యక్షుడు వేమూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ శుక్రవారం నుంచి లారీల సమ్మెను ఉధృతం చేస్తామన్నారు. ప్రభుత్వంతో జరిపిన సంప్రదింపులు విఫలం కావటంతో సమ్మె చేసేందుకు ఐదు రాష్ట్రాల లారీ యూనియన్లు తీర్మానించినట్లు పేర్కొన్నారు. మొదటి రోజు కావటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నిత్యావసర వస్తువుల విషయంలో ఆటంకాలు కలుగనీయవద్దని లారీ యూనియన్ నాయకులను హెచ్చరించారు. యూనియన్ నాయకులు ఏవీ రాము, రాఘవరెడ్డితో పాటు తదితరులు పాల్గొన్నారు.