నిందితుల అరెస్ట్ చూపుతున్న పోలీసులు
లారీ, టైర్ల దొంగల అరెస్ట్
Published Sat, Oct 1 2016 11:25 PM | Last Updated on Mon, Sep 4 2017 3:48 PM
– రూ.17లక్షల విలువైన లారీ, టైర్లు స్వాధీనం
రామసముద్రం: పార్కింగ్ చేసిన లారీలను అపహరించి టైర్లను చోరీ చేస్తున్న దొంగల ముఠాను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. పలమనేరు డీఎస్పీ శంకర్, పుంగనూరు రూరల్ సీఐ రవీంద్ర, ఎస్‌ఐ సోమశేఖర్ విలేకరులతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రం ముళబాగిల్ తాలూకా బాలసంద్ర గ్రామానికి చెందిన శివరాజ్(32), అమిడిగల్‌కు చెందిన హనుమప్ప(32), విజయ్‌కుమార్ అలియాస్ భద్ర(26) కొంతకాలంగా చిత్తూరు, వి.కోట తదితర ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద నిలిపి ఉన్న లారీలను చోరీ చేస్తున్నారు. వాటి టైర్లను తీసుకుని లారీలను వదిలేసి వెళ్లిపోయేవారు. ఈ నెల 23న యూరియా లోడ్‌ను రామసముద్రం మండలం చెంబకూరులో దింపి రామసముద్రం బస్టాండ్‌లో లారీని పెట్టి డ్రైవర్ గురునాథరెడ్డి భోజనానికి వెళ్లాడు. దుండగులు లారీని చోరీ చేశారు. డ్రైవర్ ఈ నెల 26న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో లారీ అమిడిగల్ చెరువు వద్ద ఉన్నట్టు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. విచారణలో రెడ్డెప్ప, వెంకటప్ప, ఉమేష్, రాజేంద్ర టైర్లు కొనుగోలు చేసినట్లు తేలింది. వారిని విచారించగా లారీ చోరీ చేసే ముఠా విషయం వెలుగులోకి వచ్చింది. శనివారం ఉదయం బరిడేపల్లె బస్టాప్ వద్ద ఉన్న శివరాజ్, హనుమప్ప, విజయ్‌కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.17 లక్షల విలువైన లారీ, 31 టైర్లు, జాకీలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సహకరించిన కానిస్టేబుల్ నాగార్జునను డీఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో సీఐ చంద్రశేఖర్, ఎస్‌ఐ సోమశేఖర్, హెడ్ కానిస్టేబుల్ దామోదర్, సిబ్బంది అర్జున్, వెంకటాచలం పాల్గొన్నారు.
Advertisement
Advertisement