డీజిల్ దొంగతనం అయిన లారీ ట్యాంకు
బొంరాస్‌పేట: మండల పరిధిలోని అంతరాష్ట్ర రహదారిపై ఉన్న తుంకిమెట్ల హైటెక్ దొంగతనానికి అడ్డాగా మారింది. గ్రామంలో రహదారి పక్కన నిలిచి ఉన్న వాహనాల్లో నుంచి డీజిల్ దొంగతనం పరిపాటిగా మారింది. తాజాగా ఆదివారం తెల్లవారుజామున డీజిల్ దొంగతనం జరిగింది. బాధితుల వివరాల మేరకు.. గ్రామంలో సిమెంటు ట్యాంకర్ల డ్రైవర్లు, లారీల డ్రైవర్లు ఉన్నారు. రాత్రి పూట ఇంటివద్ద విశ్రాంతి తీసుకొని ఉదయం వెళ్లేందుకు గ్రామంలోని రహదారి పక్కన తమ వాహనాలకు నిలుపుతారు. దీన్ని అదునుగా చూసి దొంగలు మాటువేసి పెద్ద మొత్తంలో డీజిల్‌ను లాగేస్తూ హైటెక్ దందాను నడిపిస్తున్నారు. ఆదివారం తెల్లవారు జామున మూడు లారీలు వెంకటయ్యగౌడ్ లారీలో నుంచి 400 లీటర్లు, శామప్ప లారీలో 100 లీటర్లు, బూదరి వెంకటయ్య లారీలో 100 లీటర్ల డీజిల్ మాయమైంది.
డీజిల్ ఇలా మాయం...
విశ్రాంతి కోసం నిలిపిన వాహనాల్లో డీజిల్ దొంగతనానికి అలవాటుపడ్డ దుండగులు ఎవరికీ అనుమానం రాకుండా ఓ కారులో వస్తారు. అదే కారులో డ్రమ్ములు ఉంచుకొని దొంగతనం చేయాల్సిన వాహనం పక్కన కారును నిలుపుతారు. లారీల డీజిల్ ట్యాంకు తాళం పగులగొట్టి ట్యాంకు నుంచి కారులో ఉన్న డ్రమ్ముల్లోకి పైపులు వేసి నేరుగా డీజిల్‌ను లాగేస్తారు. డ్రుమ్ములు నిండగానే ఉడాయిస్తారు. ఇది గమనించిన స్థానికులు గతంలో వారిని వెంబడించడంతో దొంగలు చిక్కకుండా పరారయ్యారని పలువురు పేర్కొంటున్నారు.
నెలలో నాలుగోసారి
నెలరోజుల క్రితం రూ.1.50లక్షల డీజిల్ మాయం చేశారు. నెల రోజలు క్రితం ఐదు లారీలు (తుంకిమెట్లకు చెందిన లారీడ్రైవర్లు శ్యామప్ప, రాములు, నర్సింలు, నారాయణ, దస్తప్ప) నుంచి 140 లీటర్ల వరకు రూ.1.50లక్షల డిజిల్ ఒకేరాత్రి లాగేశారు. తర్వాత షబ్బీర్, తోలు నర్సింలు, అఫీజ్‌ల వాహనాల్లో డీజిల్ దొంగతనం జరిగింది. మూడోసారి హైదరాబాద్‌కు చెందిన రెండు లారీలు రోడ్డు పక్కన తుంకిమట్లెలో నిలిచి ఉండగా డీజిల్ మాయం చేశారు.
పోలీసుల కన్నుగప్పి
డీజిల్ దొంగతనాలపై పోలీసులు పహారా నిర్వహిస్తున్నా దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. శనివారం రాత్రి నుంచి పోలీసులు ఆదివారం తెల్లవారుజామున పోలీసులు వెళ్లిన పది నిమిషాల్లో డీజిల్ దొంగతనం కావడం పట్ల బాధితులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
400 లీటర్ల డీజిల్ పోయింది
పోలీసుల కన్నుగప్పి జరుగుతున్న డీజిల్‌మాయం సంఘటనలు అనుమానాలకు తావిస్తోంది. నా లారీలో నుంచి 400 లీటర్ల రూ.28వేల విలువ చేసే డీజిల్ మాయమైంది. 100కు కాల్ చేశాం. సరైన రీతిలో పోలీసుల స్పందన కరువైంది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు విరాళాలు సేకరిస్తున్నామని చెప్తున్నారు.
– వెంకటయ్యగౌడ్, తుంకిమెట్ల
విచారణ జరుపుతున్నాం
తుంకిమెట్లలో డీజిల్ దొంగతనాలపై నిఘా ఉంచాం. హైటెక్ దొంగతనానికి పాల్పడేది స్థానికులా, బయటివారా అనే కోణంలో విచారణ చేస్తున్నాం. ఆదివారం చోటుచేసుకున్న సంఘటనపై ఫిర్యాదు అందలేదు. దీనిపై విచారణ చేస్తున్నాం.
– వెంకటేశ్వర్లు, ఎస్సై, బొంరాస్‌పేట
Comments
Please login to add a commentAdd a comment