లారీ వీడి భాగాలు ఇలా తరలిస్తారు..
కరీంనగర్‌క్రైం: రోడ్లపై లారీపెడితే చాలూ క్షణాల్లో మాయం.. గంటల వ్యవధిలో సరిహద్దుదాటి స్క్రాప్ కింద మారుతుంది. ఈ వ్యవహారానికి సంబంధించిన ముఠాగుట్టును కరీంనగర్ పోలీసులు రట్టు చేశారు. కరీంనగర్‌తో పాటు పలు ప్రాంతాల్లో లారీలను మాయం చేస్తున్న ముఠాలో ఒకరిని కరీంనగర్ రూరల్ పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం సీపీ కమలాసన్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. మహారాష్ట్ర పర్భనీకి చెందిన రహీంఖాన్ సాహేబ్ లారీలను చోరీచేయడం వృత్తిగా ఎంచుకున్నాడు. పర్భానీ పట్టణంలో సాగర్ సర్గం సొసైటీ ఏరియాలో షెడ్డు ఏర్పాటు చేశాడు. లారీలు చోరీ చేయడానికి కొంతమంది ఏజెంట్లను నియమించుకున్నాడు. కొన్నేళ్లుగా కరీంనగర్ జిల్లాతోపాటు ఇతర జిల్లాల్లో పార్కింగ్ చేసిఉన్న లారీలు, ట్రక్కులు, వ్యాన్‌ను చోరీ చేయించాడు. వాటిని పర్భానీలోని షెడ్డుకు తరలించి, కొద్దిగంటల్లోనే భాగాలుగా విడదీసి విక్రయించసాగాడు.
వెలుగులోకి ఇలా..
కరీంనగర్ రూరల్ మండలంలోని బొమ్మకల్ శివారులోని లారీ అసోసియేషన్ పార్కింగ్‌స్థలంలో ఈనెల 4న రాత్రి కరీంనగర్‌కు చెందిన నారదాసు మారుతీరావు తన లారీని పార్క్‌చేశాడు. మరునాడు వచ్చి చూసేసరికి లారీ కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రూరల్ సీఐ శశిధర్‌రెడ్డి దర్యాప్తు ప్రారంభించారు. పక్కజిల్లాల్లోనూ లారీలు మాయమైన విషయాన్ని గుర్తించారు. చోరీకి గురైన లారీలో జీపీఎస్ ఉండడంతో దాని సాయంతో విచారణ ప్రారంభించారు. మహారాష్ట్రలోని పర్భానీ శివారులోని రహీంఖాన్ ఏర్పాటు చేసిన షెడ్డులో లారీ విడిభాగాలను గుర్తించారు. లారీని చోరీచేసిన డ్రైవర్ గజానన్ సామ్మోజీ బోస్లీని పట్టుకున్నారు. పలు లారీలకు సంబంధించిన విడిభాగాలు, గ్యాస్ కట్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు.
కమీషన్లతో ఏజెంట్ల ఏర్పాటు రహీంఖాన్ వివిధరాష్ట్రాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నాడు. వారు కొద్దిరోజులుగా రోడ్లపై నిలిపిఉన్న లారీలను చోరీ చేస్తున్నారు. దీనికి మూడంచెల విధానాన్ని అమలు చేస్తారు. మొదట చోరీచేసిన వ్యక్తి కొంతదూరం తీసుకెళ్లి వదిలేస్తాడు. అక్కడి నుంచి మరొకరు తీసుకెళ్తారు. ఇలా ముగ్గురి చేతులు మారాక షెడ్డుకు చేరుతుంది. దీనికి ఒక్కో డ్రైవర్‌కు రూ.15నుంచి రూ. 20 వేలు కమీషన్ ఇస్తాడు.
క్షణాల్లో మాయం...
లారీ షెడ్డుకు చేరగానే.. భాగాలు విడదీయడానికి సిబ్బంది సిద్ధంగా ఉంటారు. తక్కువ సమయంలోనే స్క్రాప్‌గా మార్చి విక్రయిస్తారు. ఇంజిన్‌కు పలుమార్పులు అమ్మేస్తారు. కరీంనగర్‌లో లారీని చోరీచేసిన గజానన్ సామ్మోజి బోస్లేను అరెస్టు చేయగా రహీంఖాన్ సాహేబ్, విజయ్ పరారీలో ఉన్నారు. దొంగలను పట్టుకున్న కరీంనగర్ రూరల్ సీఐ శశిధర్‌రెడ్డి, ఎస్సై లక్ష్మినారాయణ, ఏఎస్సై తిరుపతి, సిబ్బందిని సీపీ అభినందించారు. అడిషనల్ డీసీపీ శ్రీనివాస్, రూరల్ ఏసీపీ ఉషారాణి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment