మాఫీమంటలు
Published Sun, Sep 18 2016 1:07 AM | Last Updated on Sat, Sep 29 2018 6:00 PM
కొవ్వూరు రూరల్ : డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానన్న చంద్రబాబు నాయుడి హామీ పేద కుటుంబాలను నిలువునా దహించివేస్తోంది. మాట తప్పిన సర్కారు వివిధ రూపాల్లో మహిళల ఉసురు పోసుకుంటోంది. ఓ వైపు కోర్టు సమన్లు, మరోవైపు నడ్డివిరిచే వడ్డీలతో బ్యాంకుల నుంచి అందుతున్న నోటీసులతో డ్వాక్రా మహిళలు తల్లడిల్లిపోతుండగా.. తాజాగా మరో కోణం వెలుగులోకి వచ్చింది. ఉపాధి హామీ పథకం పనులు చేసుకుంటున్న మహిళా కూలీలకు చెల్లించే కూలి డబ్బులను బ్యాంకులు డ్వాక్రా రుణాలకు జమ చేసుకుంటున్నాయి. దీంతో డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళా కూలీల కుటుంబాలు పట్టెడన్నం తినే అవకాశం లేక ఆకలితో అలమటిస్తున్నాయి.
కడుపు కాల్చడమూ ప్రయోగాత్మకమే
కొవ్వూరు మండలంలో ఈ విధానం ప్రయోగాత్మకంగా అమల్లోకి వచ్చింది. ఇప్పటివరకూ ఉపాధి హామీ పనులు చేసుకునే కూలీలకు ప్రభుత్వం పోస్టాఫీసుల ద్వారా కూలి సొమ్ము చెల్లించేది. త్వరలో ఈ విధానాన్ని మార్చి రాష్ట్రవ్యాప్తంగా జాతీయ బ్యాంకుల ద్వారా చెల్లింపులు చేయాలని నిర్ణయిం చారు. తొలి విడతగా కొవ్వూరు మండలంలోని ధర్మవరం, దొమ్మేరు గ్రామాలతోపాటు నియోజకవర్గంలోని 9 గ్రామాల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. వచ్చేనెల నుంచి అన్ని గ్రామాల్లోని ఉపాధి కూలీలకు బ్యాంకుల ద్వారానే కూలి డబ్బులు చెల్లించాలని నిర్ణయించారు. నియోజకవర్గంలో సుమారు 20 మంది ఉపాధి కూలీల సొమ్ము రూ.50 వేల వరకు బ్యాంకులు డ్వాక్రా రుణాల ఖాతాల్లో జమ చేసుకున్నాయి. పైగా ఈ మొత్తాలను ఆయా మహిళల వ్యక్తిగత ఖాతాల్లో కాకుండా గ్రూప్ ఖాతాల్లో జమ చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఎన్నికల సమయంలో డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానన్న చంద్రబాబు మాటలు నమ్మి ఆయనకు ఓటేస్తే.. రెక్కలు ముక్కలు చేసుకునే తమ నోటిదగ్గర కూడు లాగేసుకుంటున్నారని బాధిత మహిళలు వాపోతున్నారు.
ఇదేం దారుణమయ్యా
నాలుగు వారాలు కష్టపడితే రూ.4 వేలు కూలి డబ్బులు వచ్చాయి. ఆ సొమ్మును బ్యాంకు ఖాతాలో వేశామని అధికారులు చెప్పారు. తీసుకోవడానికి వెళితే డ్వాక్రా రుణానికి జమ చేసుకుంటున్నామని బ్యాంకోళ్లు చెప్పారు. మా తండ్రి దినకర్మలు ఉన్నాయని చెప్పి బతిమాలడంతో రూ.2 వేలు అప్పుకు జమ చేసుకుని రూ.2 వేలు ఇచ్చారు. మా గ్రూపు సభ్యులంతా కలిసి తీసుకున్న అప్పుకు ఆ సొమ్ము జమ చేశామంటున్నారు. నేను తీసుకున్న వ్యక్తిగత బాకీలో రాసుకోమంటే కుదరదంటున్నారు. నమ్మి ఓటేస్తే మా కడుపులు కాలుస్తారా. ఇదేం దారుణమయ్యా.
– వానపల్లి దుర్గ, ఉపాధి కూలీ, ధర్మవరం
ఎలా బతకాలి
ఏ పనులూ దొరక్కపోవడంతో ఉపాధి పనులకు వెళుతున్నాం. చేతిదాకా వచ్చిన కూడు నోటిదాకా రావడం లేదు. కూలి డబ్బుల్ని బ్యాంకు ఖాతాలో వేశారు. బ్యాంకుకెళితే డ్వాక్రా రుణానికి జమ చేసుకున్నామని చెప్పారు. కూలి డబ్బులు లేకపోతే మాలాంటోళ్లు ఎలా బతికేది. ఊరి పెద్దల సాయంతో వెళ్లి బ్యాంకోళ్లను బతిమాలుకుంటే రూ.2 వేలు కట్ చేసుకుని మిగిలిన సొమ్ము ఇచ్చారు. ఎన్నికలప్పుడు చంద్రబాబు డ్వాక్రా రుణాలు చెల్లించవద్దంటే మానేశాం. ఇప్పుడు కూలి డబ్బులు కూడా మాకు దక్కనివ్వటం లేదయ్యా. ఇలాగైతే మేమెలా బతకాలి.
– పొలుమాటి వెంకాయమ్మ, ఉపాధి కూలి, ధర్మవరం
కూలీలకు ఇబ్బందే
కూలీలకు ఉపాధి కల్పించేందుకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తున్నాం. ఈ పనులు చేసిన కూలీలకు బ్యాంకుల ద్వారా కూలి డబ్బు చెల్లిస్తున్నాం. డ్వాక్రా రుణాలు బకాయి ఉన్నారన్న కారణంగా మహిళా కూలీల వేతనాలను బ్యాంకర్లు ఆ ఖాతాలకు జమ చేసుకుంటున్నారని తెలిసింది. ప్రభుత్వం కూలీలకు జీవనోపాధి కల్పించేందుకు ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పిస్తోంది. వారి కూలి డబ్బుల్ని బకాయిలకు జమ చేసుకోవడం వల్ల ఆయా కుటుంబాలు ఇబ్బందిపడతాయి. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతాం
– ఎ.రాము, ఎంపీడీవో, కొవ్వూరు
Advertisement
Advertisement