
విజయవాడ వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయం నుంచి..
విజయలక్ష్మి ఎంటర్‌ప్రైజెస్ పేరుతో గ్రానైట్ వ్యాపారం చేసినట్లు వెల్లడి
తనకు ఏమీ తెలియదన్న బాధితుడు
చండ్రుగొండ: ఓ సాధారణ వ్యవసాయ కూలీకి రూ.22 లక్షలు జీఎస్టీ చెల్లించాలంటూ నోటీసు జారీ అయింది. ఇటీవల పోస్టు ద్వారా అందిన నోటీసుతో నిరక్షరాస్యుడైన ఆ కూలీ బిత్తరపోయాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండకు చెందిన జానపాటి వెంకటేశ్వర్లు (వెంకటేష్) కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆయనకు ఈ నెల 4వ తేదీన జీఎస్టీ నోటీసు అందింది. తనకు చదువు రాకపోవటంతో తెలిసివారికి ఆ లేఖను చూపగా, విజయవాడ బెంజ్ సెంటర్‌లోని కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయం నుంచి అందిన నోటీసుగా చెప్పారు.
విజయలక్ష్మి ఎంటర్‌ప్రైజెస్ పేరుతో రూ.కోటి విలువైన గ్రానైట్ వ్యాపారం చేశారని, 2022 ఏడాదిలో చేసిన ఈ వ్యాపారానికి జరిమానాతో కలిపి జీఎస్టీ రూ.22,86,014 బకాయి పడ్డట్లు అందులో ఉంది. దీంతో ఆందోళన చెందిన వెంకటేశ్వర్లు.. విజయలక్ష్మి ఎంటర్‌ప్రైజెస్ ఎవరిదో కనుక్కునేందుకు ఈ నెల 12న విజయవాడ వెళ్లాడు. అయితే ఆ అడ్రస్‌లో కార్యాలయమే లేదని తేలడంతో వెనుదిరిగాడు. 2022 ఏడాదిలో ఆయనకు పాన్‌కార్డు కూడా లేదు.
ఆరు నెలల క్రితమే చండ్రుగొండలోని మీ సేవ కేంద్రానికి పాన్‌కార్డు కోసం దరఖాస్తు చేయటానికి వెళ్తే.. ఆ పేరు, ఆధార్ నంబర్‌తో అప్పటికే పాన్‌కార్డు జారీ అయిందని చెప్పారు. అయితే, వెంకటేశ్వర్లు ఆధార్‌కార్డు అక్రమార్కుల చేతికి ఎలా వెళ్లింది? ఆయన పేరుతో వ్యాపార లైసెన్స్ తీసుకున్నది ఎవరేది తేలాల్సి ఉంది. ఈ విషయమై బాధితుడు మాట్లాడుతూ రెక్కాడితే కాని డొక్కాడని తనకు ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో అర్థం కావడం లేదని, అధికారులు సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని కోరాడు.
Comments
Please login to add a commentAdd a comment