nregs workers
-
ఉపాధికూలీలపై టీడీపీ నేతల దాష్టీకం
దెందులూరు : ఉపాధి హామీ పథకం పనులకు ఎందుకు రానివ్వరని అడిగారన్న అక్కసుతో టీడీపీ నేతలు దాడికి ఒడిగట్టారు. అర్ధరాత్రి వేళ దళిత కూలీల ఇంటికి వెళ్లి తల్లీకొడుకులను రాడ్లతో కొట్టి తీవ్రంగా గాయపరిచారు. దెందులూరు మండలం కొవ్వలిలో ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నాలుగు రోజుల క్రితం ఉపాధి హామీ పథకం కింద కొవ్వలిలో చేపట్టిన చెరువు తవ్వకం పనులకు గ్రామానికి చెందిన కొందరు దళితులు వెళ్లారు. 7గంటలకే పనిలోకి రావాలని.. 15 నిమిషాలు ఆలస్యంగా వచ్చినందును అనుమతించేది లేదని టీడీపీ నేతలు వారిని అడ్డుకున్నారు. మరునాటి నుంచి కచ్చితంగా సమయానికి వస్తామని, ఒక్క రోజుకు అనుమతించాలని వారంతా ప్రాధేయపడ్డారు. అందుకు టీడీపీ నేతలు అంగీకరించకపోగా.. దళిత కూలీలను దుర్భాషలాడారు. ఆ రోజు కూలీలు, టీడీపీ నేతల మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులు పురమాయించిన కొందరు వ్యక్తులు ఆదివారం రాత్రి కొవ్వలిలో రాడ్లతో స్వైరవిహారం చేశారు. ఇంట్లో నిద్రిస్తున్న కాలి జ్యోతి, ప్రవీణ్‌లను బయటకు రావాలని పిలిచారు. రాత్రిపూట ఎందుకని, ఏదైనా విషయం ఉంటే ఉదయం మాట్లాడుకుందామని జ్యోతి చెప్పింది. బస్ షెల్టర్ వద్ద గ్రామ టీడీపీ అధ్యక్షుడు కసుకుర్తి రామకృష్ణ ఉన్నాడని, ఆయన మిమ్మల్ని వెంటనే తీసుకు రమ్మంటున్నాడని ఆ వ్యక్తులు చెప్పారు. ఇందుకు జ్యోతి ససేమిరా అనడంతో టీడీపీ నేతలు పురమాయించగా వచ్చిన వ్యక్తులు దుర్భాషలాడారు. ‘ఇక్కడ మేం చెప్పిందే వేదం. రామకృష్ణ దగ్గరకు వచ్చారా సరేసరి లేదంటే మీ అంతు చూస్తాం’ అంటూ బెదిరించారు. దీంతో జ్యోతి కుమారుడైన ప్రవీణ్ ఇంట్లోంచి బయటకు రాగా.. అతనితో వాగ్వివాదానికి దిగా రు. ఇంతలో సుబ్బయ్య, నిట్టా చింతయ్య అనేవారు రాడ్లతో జ్యోతి, ఆమె కుమారుడిపై దాడికి తెగబడ్డారు. జ్యోతిని జుట్టు పట్టుకుని బస్‌షెల్టర్ వరకూ లాక్కెళ్లారు. ఈ ఘటనలో కాలి జ్యోతికి, ప్రవీణ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వారిద్దరూ ప్రస్తుతం ఏలూరులోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకూ బాధితుల ఫిర్యాదును అవుట్‌పోస్టు పోలీసులు తీసుకోకపోవడంతో కొవ్వలి గ్రామ దళితులు, బాధితుల బంధువులు నిరసన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ నేతల పరామర్శ బాధితులు కాలి జ్యోతి, ప్రవీణ్‌లను వైఎస్సార్ సీపీ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ కన్వీనర్ కోటగిరి శ్రీధర్ పరామర్శించారు. టీడీపీ నేతలు రాడ్లతో తమపై దాడి చేసిన వైనాన్ని, ఫిర్యాదు స్వీకరించని అవుట్‌పోస్టు పోలీసులు నిర్వాకాన్ని బాధితులు ఆయనకు వివరించారు. దళితులపై అర్ధరాత్రి దాడిగి తెగబడటం దుర్మార్గమని కోటగిరి శ్రీధర్, వైఎస్సార్ సీపీ దెందులూరు నియోజకవర్గ ఇ¯ŒSచార్జి కొఠారు రామచంద్రరావు వ్యాఖ్యానించారు. దళితులకు న్యాయం జరిగేంత వరకూ అండగా నిలబడతామని వారు పేర్కొన్నారు. బాధితులను పరామర్శించిన వారిలో వైఎస్సార్ సీపీ నేత డాక్టర్ అనంతశ్రీనివాస్ తదితరులు ఉన్నారు. కేసులు నమోదు చేశాం బాధితులు జ్యోతి, ప్రవీణ్ ఇచి్చన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని దెందులూరు ఎస్సై ఎ¯ŒSఆర్ కిషోర్‌బాబు చెప్పారు. అదే గ్రామానికి చెందిన ఇంతేటి రాజేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాలి జ్యోతి, కాలి ప్రవీణ్, కాలి కిరణ్లపైనా కేసు నమోదు చేశామన్నారు. ఈ ఘటనపై గ్రామ టీడీపీ అధ్యక్షుడు కసుకుర్తి రామకృష్ణ వివరణ ఇస్తూ.. ఈ విషయాలేవీ తనకు తెలియవన్నారు. తాను దళితపేట బస్ షెల్టర్ వద్దకు వెళ్లలేదని, దాడి ఘటనతో తనకు సంబంధం లేదని అన్నారు. -
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
గుంతకల్లు రూరల్ : ఉపాధి హామీ పనుల నిర్వహణలో ఉపాధిహామీ సిబ్బంది నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఏపీడీ విజయలక్ష్మి హెచ్చరించారు. ఉపాధిహామీ పనుల్లో కూలీలు పడుతున్న ఇబ్బందులను వివరిస్తూ ‘ కూలీలకు ప్రాణ సంకటం’ అనే శీర్షికతో శనివారం సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీనిపై ఉపాధిహామీ ఏపీడీ విజయలక్ష్మి స్పందించారు. శనివారం తన సిబ్బందితో కలిసి వైటీ.చెరువు గ్రామంలో పర్యటించారు. పని ప్రదేశంలో నిలువ నీడ లేక కూలీలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వారికి టార్పాలిన్లను పంపిణీ చేశారు. ప్రతిరోజు కూలీలకు మజ్జిగ పంపిణీ చేయాలని ఆదేశించారు. ఉపాధి హామీ టీఏ ప్రభాకర్, ఇతర సిబ్బంది ఆమె వెంట ఉన్నారు. -
మాఫీమంటలు
కొవ్వూరు రూరల్ : డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానన్న చంద్రబాబు నాయుడి హామీ పేద కుటుంబాలను నిలువునా దహించివేస్తోంది. మాట తప్పిన సర్కారు వివిధ రూపాల్లో మహిళల ఉసురు పోసుకుంటోంది. ఓ వైపు కోర్టు సమన్లు, మరోవైపు నడ్డివిరిచే వడ్డీలతో బ్యాంకుల నుంచి అందుతున్న నోటీసులతో డ్వాక్రా మహిళలు తల్లడిల్లిపోతుండగా.. తాజాగా మరో కోణం వెలుగులోకి వచ్చింది. ఉపాధి హామీ పథకం పనులు చేసుకుంటున్న మహిళా కూలీలకు చెల్లించే కూలి డబ్బులను బ్యాంకులు డ్వాక్రా రుణాలకు జమ చేసుకుంటున్నాయి. దీంతో డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళా కూలీల కుటుంబాలు పట్టెడన్నం తినే అవకాశం లేక ఆకలితో అలమటిస్తున్నాయి. కడుపు కాల్చడమూ ప్రయోగాత్మకమే కొవ్వూరు మండలంలో ఈ విధానం ప్రయోగాత్మకంగా అమల్లోకి వచ్చింది. ఇప్పటివరకూ ఉపాధి హామీ పనులు చేసుకునే కూలీలకు ప్రభుత్వం పోస్టాఫీసుల ద్వారా కూలి సొమ్ము చెల్లించేది. త్వరలో ఈ విధానాన్ని మార్చి రాష్ట్రవ్యాప్తంగా జాతీయ బ్యాంకుల ద్వారా చెల్లింపులు చేయాలని నిర్ణయిం చారు. తొలి విడతగా కొవ్వూరు మండలంలోని ధర్మవరం, దొమ్మేరు గ్రామాలతోపాటు నియోజకవర్గంలోని 9 గ్రామాల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. వచ్చేనెల నుంచి అన్ని గ్రామాల్లోని ఉపాధి కూలీలకు బ్యాంకుల ద్వారానే కూలి డబ్బులు చెల్లించాలని నిర్ణయించారు. నియోజకవర్గంలో సుమారు 20 మంది ఉపాధి కూలీల సొమ్ము రూ.50 వేల వరకు బ్యాంకులు డ్వాక్రా రుణాల ఖాతాల్లో జమ చేసుకున్నాయి. పైగా ఈ మొత్తాలను ఆయా మహిళల వ్యక్తిగత ఖాతాల్లో కాకుండా గ్రూప్ ఖాతాల్లో జమ చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఎన్నికల సమయంలో డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానన్న చంద్రబాబు మాటలు నమ్మి ఆయనకు ఓటేస్తే.. రెక్కలు ముక్కలు చేసుకునే తమ నోటిదగ్గర కూడు లాగేసుకుంటున్నారని బాధిత మహిళలు వాపోతున్నారు. ఇదేం దారుణమయ్యా నాలుగు వారాలు కష్టపడితే రూ.4 వేలు కూలి డబ్బులు వచ్చాయి. ఆ సొమ్మును బ్యాంకు ఖాతాలో వేశామని అధికారులు చెప్పారు. తీసుకోవడానికి వెళితే డ్వాక్రా రుణానికి జమ చేసుకుంటున్నామని బ్యాంకోళ్లు చెప్పారు. మా తండ్రి దినకర్మలు ఉన్నాయని చెప్పి బతిమాలడంతో రూ.2 వేలు అప్పుకు జమ చేసుకుని రూ.2 వేలు ఇచ్చారు. మా గ్రూపు సభ్యులంతా కలిసి తీసుకున్న అప్పుకు ఆ సొమ్ము జమ చేశామంటున్నారు. నేను తీసుకున్న వ్యక్తిగత బాకీలో రాసుకోమంటే కుదరదంటున్నారు. నమ్మి ఓటేస్తే మా కడుపులు కాలుస్తారా. ఇదేం దారుణమయ్యా. – వానపల్లి దుర్గ, ఉపాధి కూలీ, ధర్మవరం ఎలా బతకాలి ఏ పనులూ దొరక్కపోవడంతో ఉపాధి పనులకు వెళుతున్నాం. చేతిదాకా వచ్చిన కూడు నోటిదాకా రావడం లేదు. కూలి డబ్బుల్ని బ్యాంకు ఖాతాలో వేశారు. బ్యాంకుకెళితే డ్వాక్రా రుణానికి జమ చేసుకున్నామని చెప్పారు. కూలి డబ్బులు లేకపోతే మాలాంటోళ్లు ఎలా బతికేది. ఊరి పెద్దల సాయంతో వెళ్లి బ్యాంకోళ్లను బతిమాలుకుంటే రూ.2 వేలు కట్ చేసుకుని మిగిలిన సొమ్ము ఇచ్చారు. ఎన్నికలప్పుడు చంద్రబాబు డ్వాక్రా రుణాలు చెల్లించవద్దంటే మానేశాం. ఇప్పుడు కూలి డబ్బులు కూడా మాకు దక్కనివ్వటం లేదయ్యా. ఇలాగైతే మేమెలా బతకాలి. – పొలుమాటి వెంకాయమ్మ, ఉపాధి కూలి, ధర్మవరం కూలీలకు ఇబ్బందే కూలీలకు ఉపాధి కల్పించేందుకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తున్నాం. ఈ పనులు చేసిన కూలీలకు బ్యాంకుల ద్వారా కూలి డబ్బు చెల్లిస్తున్నాం. డ్వాక్రా రుణాలు బకాయి ఉన్నారన్న కారణంగా మహిళా కూలీల వేతనాలను బ్యాంకర్లు ఆ ఖాతాలకు జమ చేసుకుంటున్నారని తెలిసింది. ప్రభుత్వం కూలీలకు జీవనోపాధి కల్పించేందుకు ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పిస్తోంది. వారి కూలి డబ్బుల్ని బకాయిలకు జమ చేసుకోవడం వల్ల ఆయా కుటుంబాలు ఇబ్బందిపడతాయి. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతాం – ఎ.రాము, ఎంపీడీవో, కొవ్వూరు