కుమారుడి సమాధి వద్దే తండ్రి బలవన్మరణం
ఆదిలాబాద్(కోటపల్లి): కుమారుడి మరణం తట్టుకోలేక ఓ తండ్రి కుమారుడి సమాధి వద్ద ఆత్మహత్య చేసుకున్న సంఘటన కోటపల్లి మండలం షెట్‌పల్లిలోచోటుచేసుకుంది. వివరాలు..గ్రామానికి చెందిన మోతె మదనయ్య(60)కు మోతె రవి(30) ఒక్కగానొక్క కుమారుడు. కుటుంబ కలహాల కారణంగా గతేడాది రవి ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడి మృతి తట్టుకోలేక అప్పటి నుంచి ఓ పిచ్చివాడిలా తిరిగేవాడని స్థానికులు చెబుతున్నారు.
పురుగుల మందు తాగి కుమారుడి సమాధి వద్ద ఆదివారం విగతజీవిగా పడి ఉన్నాడు. మదనయ్య చనిపోయినట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.