ప్రతీకాత్మక చిత్రం
దంపతుల మధ్య కొరవడిన సఖ్యత చిన్నారులకు శాపంగా మారింది. భర్తపై ఉన్న కోపంతో ఆ ఇల్లాలు చివరకు పేగుబంధాన్ని కూడా విస్మరించింది. అభం.. శుభం తెలియని ఆ చిన్నారులను చివరకు చెరువులోకి తోసేసి ఉసురు తీసింది. ఆపై తానూ తనువు చాలించాలనుకుని విరమించుకుంది. ఈ విషాదకర ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
సూర్యాపేటక్రైం : పెన్‌పహాడ్ మండల సింగిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన నాగమణి, హైదరాబాద్‌కు చెందిన ప్రశాంత్‌కుమార్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మాధవి (9), కుమారుడు హర్షవర్ధన్ (6) పిల్లలు ఉన్నారు. సూర్యాపేటలోని విద్యానగర్‌లో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. కొద్ది రోజులుగా భార్య, భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో పిల్లలతో కలిసి నాగమణి ఆత్మహత్య చేసుకోవాలని సూర్యాపేటలోని సద్దల చెరువు కట్టపైకి చేరుకుంది. మొదట పిల్లలిద్దరినీ చెరువులోకి తోసేసింది. ఆ తర్వాత తానూ చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడాలనుకుంది. ధైర్యం సరిపోక అక్కడే కూర్చొని ఏడుస్తుంది. తెల్లవారేంత వరకు కూర్చోవడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని హర్షవర్ధన్, మాధవి మృతదేహాలను వెలికి తీశారు.
మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడని..
ప్రశాంత్ కుమార్ మరో మహిళతో సహజీవనం చేస్తుండ డాన్ని నాగమణి తెలుసుకుంది. దీంతో అప్పటినుంచి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇదే విషయంపై నాగ మణి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా వారిద్దరి మధ్య పెద్దగా సఖ్యత లేదు. పిల్లలను సాకేందుకు భారమవడంతో నాగమణి చేసేదేమి లేక తనువు చాలించాలని నిర్ణయించుకుంది. సద్దల చెరువు సమీపంలోకి వచ్చిన నాగమణి ముందుగా చిన్నారులను నీటిలోకి నెట్టేసి తరువాత ఈమె దూకాలనుకుంది. కానీ అప్పటికే చిన్నారులను చెరువులోకి నెట్టినప్పటికి ఈమెకు ధైర్యం చాలలేదు. చెరువులో ఉన్న చిన్నారులను కాపాడేందుకు రాత్రంతా తీవ్ర ప్రయత్నం చేసింది. తీరా తెల్లారేసరికల్లా చిన్నారులు విగత జీవులుగా మారారు. అమ్మతనంపై మమకారం చెరువులో పడ్డాక చిన్నారులపై చూపించాలనుకుంది.
భార్యపై భర్త దాడి..
జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చిన్నారుల మృతదేహాలను చూసి రోదిస్తున్న తల్లిపై భర్త దాడి చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని భార్యభర్తలిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తన్నట్లు సూర్యాపేట సీఐ ఆంజనేయులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment