ఛనాఖా-కొరట బ్యారేజీకి మహారాష్ట్ర ఓకే
సాక్షి, హైదరాబాద్: పెన్‌గంగా డ్యామ్ దిగువన ఛనాఖా-కొరట వద్ద నిర్మిస్తున్న బ్యారేజీకి మహారాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. ఈ మేరకు మంత్రుల స్థాయిలో జరిగిన చర్చల్లో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలకు సంబంధించి మౌఖిక ఒప్పందాలు చేసుకున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రితో ఈ నెల 30న మరో సమావేశం నిర్వహించిన అనంతరం అధికారిక ఒప్పందాలను చేసుకునే అవకాశం ఉంది. ఛనాఖా-కొరట బ్యారేజీ నిర్మాణానికి సహకారం కోరుతూ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, బీసీ, అటవీ శాఖ మంత్రి జోగురామన్నలు మంగళవారం మహారాష్ట్రకు వెళ్లి ఆ రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి గిరీశ్ మహాజన్‌తో సమావేశమయ్యారు.
ఈ భేటీకి ఆదిలాబాద్ ఎంపీ నగేశ్, ప్రభుత్వ సలహాదారులు డి.శ్రీనివాస్, విద్యాసాగర్‌రావు, ముఖ్యకార్యదర్శి ఎస్‌కే జోషి, సీఈ మధుసూధన్, ఓఎస్‌డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర భూభాగంలోని రెండున్నర ఎకరాల భూమి అవసరమౌతుందని హరీశ్‌రావు మహారాష్ట్ర మంత్రికి నివేదించారు. బ్యారేజీ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వమే ఖర్చులు భరిస్తుందని, భూసేకరణకు అవసరమైన చర్యలన్నీ తీసుకుంటామని తెలిపారు. ఈ ప్రతిపాదనను వారు సూత్రప్రాయంగా అంగీకరించారు. అయితే మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అందుబాటులో లేనందున, ఆయనతో చర్చించాక తుది నిర్ణయం చేస్తామని చెప్పారు. ఈనెల 30న సీఎంతో మరోమారు సమావేశం నిర్వహించిన అనంతరం అధికారికంగా దస్తావేజులపై ఇరు రాష్ట్రాలు సంతకాలు చేసుకునే అవకాశాలున్నాయి.
లెండిపైనా చర్చలు..
లెండి ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగడంపై ఇరు రాష్ట్రాలు సమావేశంలో సమీక్షించుకున్నాయి. ఇప్పటికే రెండు ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టుపై రూ.500 కోట్లు ఖర్చు పెట్టినట్లు హరీశ్‌రావు గుర్తు చేశారు. పునరావాస సమస్యల వల్ల ప్రాజెక్టు పనులు నెమ్మదిగా సాగుతున్నాయని, వీటిని వేగిరం చేయాల్సిన అవసర ఉందని వారికి లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. కాగా, ప్రాణహితలో భాగంగా నిర్మించదలిచిన తుమ్మిడిహెట్టి బ్యారేజీపై ఎలాంటి చర్చ జరగలేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.