ప్రతిపక్షాలవి పనికిమాలిన ఆరోపణలు: హరీశ్
సాక్షి, హైదరాబాద్: గోదావరి జలాలపై మహారాష్ట్రతో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంపై ప్రతిపక్ష పార్టీలు పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నాయని నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు దుయ్యబట్టారు. మంగళవారం ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలోనే ఒప్పందాలు చేసుకున్నట్లయితే అందుకు ఆధారాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌తో ఎస్సెస్సారెస్పీ మళ్లీ కళకళలాడుతుందన్నారు.
టెండర్లపై కొందరు నేతలు చేస్తున్న విమర్శలు అర్థరహితమని, ప్రక్రియ అంతా పారదర్శకంగా నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలు అడగటానికి ముందే అన్ని అంశాలపై చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రాజెక్టులపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామంటే ప్రతిపక్షాలు కుంటిసాకులు చెప్పాయన్నారు. ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాల చొప్పున కోటి ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. పార్టీలో, ప్రభుత్వంలో తన ప్రాధాన్యతపై వంద శాతం సంతృప్తిగా ఉన్నట్లు స్పష్టం చేశారు.